డబ్బులు ఎవరికీ ఊరికే రావుగా..!

Dec 24,2023 13:14 #Sneha

‘మీ పేస్టులో ఉప్పుందా.. విటమిన్లు ఉండే పప్పు తింటున్నారా.. ద్విచక్ర వాహనం వల్ల నడుము నొప్పి వస్తోందా.. ఈ కంపెనీ పరుపుపై నిద్ర పోవడం వల్లనే నేను ఇప్పటికీ ఫేమ్‌లోనే ఉన్నాను..’ ఇలా మనం తినే తిండి నుండి వాడే వస్తువుల వరకూ అన్నింటా ప్రతిరోజూ ప్రకటనలు ఊదరగొట్టేస్తుంటాయి. ఇవన్నీ మనం నిత్యం వినేవే. పైగా అరసెకను లేదా నిమిషం మాత్రమే వచ్చే ప్రకటనలే కదా అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఒకచెవి దానిపై వేస్తాం. మన బుర్రలోకి చొచ్చుకుపోతున్న ఈ ప్రకటనలే లక్షల కోట్ల వ్యాపారానికి ముడిసరుకు. ఈ నెల 24వ తేదీ ‘జాతీయ వినియోగదారుల దినోత్సవం’ సందర్భంగా.. వినిమయ ప్రపంచంలో సగటు మనిషి ఎలా కొట్టుమిట్టాడుతున్నాడో తెలియజేసే ప్రత్యేక కథనం..

ఇంట్లో అట్లు వేసుకునే గరిటె, అంట్లు తోమే సబ్బు కూడా టివీలో చూసి, కొనాల్సిన పరిస్థితిని మార్కెట్‌ సృష్టించింది. తినే తిండి, వేసుకునే దుస్తులు, మనిషి నడవడిక, ప్రయాణించే వాహనం వరకూ అన్నింటిలోనూ వినియోగదారులకు తెలియకుండానే బడా కార్పొరేట్‌ సంస్థలు వారి జేబుల్ని కొల్లగొడుతున్నాయి. కుటుంబసభ్యుల అవసరాల నుంచి బాత్రూమ్‌ కడిగే బ్రష్‌, దానికివాడే క్లీనర్‌ వరకూ అవేమిటో చెప్పి, కొనిపించేంత స్థాయిలోకి ప్రచారాలు వెళ్లాయి.

వేల కోట్ల ప్రచారం..

సాధారణంగా అనిపించినా ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ ఎనాలసిస్‌ రీసెర్చ్‌ అండ్‌ కౌన్సిలింగ్‌ గ్రూపు (ఐఎంఎఆర్‌సి) నివేదిక ప్రకారం.. 2022లో ఇండియాలో రూ.74,300 కోట్ల ప్రచార వ్యాపారం జరిగింది. 2023-28 మధ్యకాలంలో 11.2 శాతం వృద్ధి చెందింది. ఇది రూ.1,41,200 కోట్లకు చేరే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యాపార సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రచార మార్కెట్‌ విలువ ఎంత పెద్దఎత్తున పెరిగితే.. దాని ఆధారంగా కొనుగోలు చేసే వస్తువుల మార్కెట్‌ కూడా అన్ని లక్షల రెట్లు పెరుగుతోంది. వ్యాపారంలో పది శాతం ఎడ్వర్‌టైజ్‌మెంట్లకు ఖర్చు పెట్టినా దాని ఆధారంగా చూస్తే మనదేశంలో వినియోగదారీ సంస్కృతిని ఎంత పెద్దఎత్తున జరుగుతుందో తెలుసుకోవచ్చు. టెలివిజన్‌, ప్రింట్‌, రేడియో, సోషల్‌మీడియా, మొబైల్‌, ఔట్‌రోడ్‌ ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ వంటి మాధ్యమాల్లో ఈ ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. విచిత్రం ఏమిటంటే ఇండియాలో ప్రచారం చేసే వ్యాపార ప్రకటనల సంస్థలన్నీ అమెరికాలోని న్యూయార్క్‌, వాషింగ్టన్‌ వంటి నగరాల నుండే నడుస్తున్నాయి. అంటే ప్రపంచం మొత్తాన్ని వ్యాపార ప్రకటనలతో ముంచేసి, లక్షల కోట్ల వ్యాపారం చేయించడం అమెరికా కేంద్రంగా నడిచే వ్యాపార సంస్థల పని.

ఆఫర్లతో..

పండుగ సీజన్‌లు, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డే ఇలా ప్రత్యేక రోజుల పేరుతో ఈకామర్స్‌, ఆఫ్‌లైన్‌ కంపెనీలు ఆఫర్‌లను కుమ్మరిస్తుంటాయి. ఊరించే ఆఫర్లు, రేట్ల తగ్గింపుతో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ అని, బై నౌ… పే లేటర్‌ అంటూ వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతూ ఉంటాయి. ఈ ఆఫర్లను చూసి కొందరు అవసరం లేకపోయినా, రేటు తగ్గింది కదా అని కొనుగోలు చేస్తుంటారు. ఇలా అనవసర ఖర్చులతో ఇంటి బడ్జెట్‌ గాడి తప్పుతోంది. రాబోయే పండగల సీజన్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు వినియోగదార్లు మొగ్గుచూపుతున్నారని అమెజాన్‌ ఇండియా-నీల్సన్‌ మీడియా సర్వే వెల్లడించింది. వినియోగదారులను ఆఫర్‌ల పేరుతో భ్రమల్లో ముంచుతున్నారు.

ఆలోచనల ప్రభావితం..

మన దేశంలో వేర్వేరు సంప్రదాయాలను అనుసరించి, దుస్తుల వినియోగం ఉంటుంది. వాటిల్లో రంగులు, తయారీలో తేడాలూ ఉంటాయి. జమ్మూకాశ్మీర్‌లో తయారయ్యే దుస్తులకూ, రాజస్థాన్‌లో వినియోగించే దుస్తులకూ చాలా తేడా ఉంటుంది. కానీ మీ దుస్తులు తెల్లగా లేవా లేకపోతే మీకు ఉద్యోగంలో ఫెయిలయిపోతారు అని భయపెడుతూ.. దానికోసం మా సర్ఫ్‌ వాడండీ అనీ చెబుతుంటారు. పైగా ఇప్పటివరకూ నాసిరకం సర్ఫ్‌ వాడుతున్నారా అనీ ప్రశ్నిస్తారు. అంటే ఇప్పటి వరకూ వాడే సర్ఫ్‌లన్నీ పనికిరానివి అన్నట్లుగా సెలబ్రిటీలతో చెప్పిస్తుంటారు. ఆ సర్ఫ్‌ వాడటం ద్వారానే ఉన్నత ఉద్యోగం వస్తుందనే విధంగా వినియోగదారులను భ్రమల్లోకి నెట్టడం ద్వారా తమ వ్యాపారాన్ని వేలకోట్లకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇండియాలో దుస్తుల వ్యాపారంలో రిలయన్స్‌ అతిపెద్ద సంస్థగా అవతరించింది.

ఒకప్పుడు బూడిద, వేపపుల్ల వంటి సహజ పదార్థాలతో పళ్లు తోమేవారు. దాన్ని అవమానంగా భావించే పరిస్థితిని తీసుకొచ్చి.. దీనిద్వారా పేస్టు అమ్మకాలు పెంచుకున్నారు. ఇడ్లీ, దోసె వంటి సాధారణ అల్పాహారాలు మానేసి ఓట్స్‌, వర్మిసెల్లీ, ముందుగా తయారుచేసిన చపాతీలు, మ్యాగీ న్యూడిల్స్‌, పాలలో కలుపుకుని తినే శాచురేటెడ్‌ ఆహార పదార్థాలను కొనే విధంగా వినియోగదారుల అభిరుచిని మార్చేస్తున్నాయి. రాత్రి భోజనంలో రైస్‌ తింటే షుగర్‌ వస్తుంది. ఈ చపాతీలు తినండి, ఓట్స్‌ తినండి అంటూ ఏం తినాలో, ఎలా తినాలో కూడా వారే నిర్ణయిస్తున్నారు. నడుస్తుంటే మోకాలు నొప్పి పెడుతోందా అయితే మా చెప్పులు వాడండి, చెప్పులు వాడితే కాళ్లు మంటపెడుతున్నాయా మా బూట్లు కొనండి, కాళ్లు పగులుతున్నాయా ఈ క్రీము రాసుకోండి. అయినా తగ్గడం లేదా అయితే ఈ డాక్టరును సంప్రదించండీ అంటూ.. తిండి తినడం దగ్గర నుండి డాక్టర్‌కు చూపించుకునే వరకూ అన్నీ వారే చెప్పేస్తారు. అంటే ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాల నుండి ఆరోగ్యాన్ని నయం చేసుకునేందుకు వైద్యుల వివరాల వరకూ అన్నిటినీ వ్యాపార సంస్థలే వండి వార్చుతున్నాయి.

ఆహారపు అలవాట్లపైనా..

ఒక్కో ప్రాంత జీవనశైలి ఒక్కో రకంగా ఉంటుంది. సహజమైన పద్ధతుల్లో తయారైన స్వచ్ఛమైన ఆహారాన్ని తినేవారిని సైతం ప్రభావితం చేస్తోంది మార్కెట్‌. ఇంట్లో తయారుచేసుకునే సహజమైన వంటలు, బలవర్థకమైన ఆహారం పట్ల మొహం మొత్తేలా చేసి, చిన్నపిల్లలు సైతం ఫాస్ట్‌ఫుడ్‌ల వైపు మొగ్గుచూపేలా తయారు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే కేకులు, చాక్లెట్లు, డ్రింకులు, బిస్కెట్లు, చిప్స్‌ తింటే.. పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మబలికే ప్రకటనలు కోకొల్లలు. పుట్టిన బిడ్డ నుండి వృద్ధులకు పెట్టే ఆహారం వరకూ ప్రకటనలు చూసి నిర్ణయించుకుని స్థితికి చేరుకుంది నేటి సమాజం.

సీరియల్స్‌ భాగస్వామ్యమే..

వినిమయతత్వాన్ని పెంచి పోషించడంలో టీవీ సీరియల్స్‌ పాత్ర తక్కువేమీ కాదు. ప్రజలను సీరియల్స్‌కు బానిసలను చేయడం ద్వారా అరగంట ప్రసారమయ్యే సీరియల్‌లో 15 నిమిషాల పాటు వచ్చే వాణిజ్య ప్రకటనలు ఛానల్స్‌కు, ప్రకటనదారులకు వేలకోట్లను తెచ్చిపెడుతున్నాయి. ఇది చూసేవారికి అర్థంకాదు. రేపటి ఎపిసోడ్‌లో ఏమవుతుందోననే ఆత్రుతతో మనిషి మెదడు కొంత స్తబ్దతకు గురవుతుంది. అప్పుడు వచ్చే ప్రతి ప్రకటనా మనిషి ఆలోచనను ప్రభావితం చేయగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మొబైల్‌ఫోన్లలో మోతెత్తిస్తూ..

వ్యాపార ప్రపంచం టివీల నుంచి స్మార్ట్‌ఫోన్‌లలోకి వచ్చేసింది. మన అడుగులను లెక్కగట్టగడం నుండి మనం ఏ సమయానికి ఏం చేయాలో చెప్పేస్థాయికి సాంకేతికత ఎదిగింది. స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపడం నిత్యజీవనంగా మారింది. ఇప్పుడు సెల్‌ఫోన్‌లో జరిగే వాణిజ్య ప్రకటనల మార్కెట్లు కూడా ఇండియాలో రూ.30వేల కోట్ల మార్కెట్‌ను దాటిపోయిందని ఒక అంచనా.

బంధుత్వాలపైనా..

వాణిజ్య ప్రకటనల ముసుగు మనిషిని యంత్రంగా మార్చేసింది. ప్రతి చిన్న విషయాన్ని టివిలో లేదా నెట్‌లో చూడటం, సెల్‌ఫోనులో చెక్‌చేసుకోవడం జరుగుతుంది. ఒక వస్తువు కొనేముందు పక్కవాళ్ల అనుభవం తీసుకోవడం తగ్గింది. ఇది మనుషుల మధ్య బంధాలను పూర్తిగా దూరం చేస్తోంది.

మహిళల ప్రభావం..

వినియోగదారుల్లో మహిళలే అత్యధికంగా ఉంటున్నారనేది పెద్ద అపోహ మాత్రమే. మహిళలూ ఉద్యోగాల్లో కొనసాగుతున్నప్పటికీ జీతంపై వారికి హక్కు ఉండదు. అటువంటప్పుడు కనీస అవసరాలకు ఖర్చు చేసేందుకైనా వారికి అవకాశం ఉంటుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

ఈ పురుషాధిక్య ప్రపంచంలో దాదాపు అన్ని విషయాల్లో మహిళల కంటే పురుషుల ఆధిపత్యమే ఎక్కువని అనేక సర్వేలు తేల్చాయి. చివరకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్న వారిలో మహిళల కంటే పురుషుల శాతమే ఎక్కువని ఈకామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ముఖ్యంగా ఈ మొబైల్‌ యాప్‌ ద్వారానే 80 శాతం మంది వినియోగదారులు కొనుగోళ్లు జరిపారట.

నష్టపోతే !

ఆన్‌లైన్‌ మార్కెట్‌ వ్యవస్థలు వచ్చిన తరువాత తాము తీసుకున్న వస్తువులో నాణ్యత లేకపోతే ఏమి చేయాలనేది పెద్ద ప్రశ్న. వీటిలో దేనికీ గ్యారెంటీ వుండదు. దీంతో వినియోగదారులు నష్టపోవడమూ, మోసపోవడమూ పరిపాటిగా మారింది. దీన్నుండి బయటపడాలంటే ప్రతి వస్తువునూ చూసి కొనుగోలు చేసుకోవాలి. బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి. వారంటీ వివరాలు ఉంటే వాటికి స్టాంపులూ వేయించుకోవాలి. ఎక్కడా న్యాయం జరగకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి. వీటిల్లో బిల్లుల అధారంగా వినియోగదారుడే నేరుగా వాదించుకోవచ్చు. దీనిపై చాలా మందికి అవగాహన లేక మోసపోయినా అలాగే వదిలేస్తున్నారు. ఒకసారి ఫోరంలో ఫిర్యాదు చేసిన తరువాత విచారణ అనంతరం మొత్తం కాలానికి అయిన వడ్డీతో సహా వసూలు చేసి ఇచ్చే బాధ్యత వినియోగదారుల ఫోరం తీసుకుంటుంది.

-ఎల్‌. ఫణీశ్వరి

8885733554

➡️