అప్రమత్తతతో అరికడదాం..

Apr 28,2024 09:10 #Fire Accident, #fire workers, #Sneha

సాధారణంగా వేసవిలోనే అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిని నివారించడం మన చేతుల్లోనే ఉంది. విద్యుత్తు వినియోగంతో పాటు దీపాలు వెలిగించడంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వంట చేసే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపకూడదు. ఒక్కోసారి ఒకరింట్లో జరిగిన ప్రమాదంతో చుట్టుపక్కల ఇళ్లు అగ్నికి ఆహుతవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గడ్డివాములు, పూరిళ్లు ఉన్నప్పుడు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సిగరెట్టో, చుట్టో, బీడీనో తాగి, ఆ పీకలు నిర్లక్ష్యంగా విసిరేస్తుంటారు. ఇలాంటివి సైతం భారీ అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. ఇది ప్రపంచం.. దేశం.. రాష్ట్రం.. జిల్లా.. గ్రామం.. చివరకు మన నివాస ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరగడం చూస్తుంటాం. అందుకే అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాల్ని అరికట్టవచ్చు. మే 4వ తేదీన ‘అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం..

అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అధైర్యపడకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. అందుకోసం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. వీటి పరిధిలోని ఆయా విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖలకు చెందిన సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తుంటారు. ఎంత ప్రమాదకరమైన స్థితిలో అయినా ఆపదలో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సాహసాలకు, త్యాగాలకు నివాళులర్పించేందుకు 1944లో జాతీయ స్థాయిలోనూ, 1999లో ఆస్ట్రేలియాలోని విక్టోరియల్‌ లింటన్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మరణించారు. వారిని స్మరించుకుంటూ ప్రతి ఏటా మే 4వ తేదీన అంతర్జాతీయంగా అగ్నిమాపక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాల్లో తమ ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరిస్తూ ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తప్పిదాల వల్లే..
నిరంతరం మన చుట్టూ ఉండే పరిసరాలు, ప్రాంతాల్లో మానవ తప్పిదాలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే నీరు, వాయువు కాలుష్యంతోనూ, పరిశ్రమల్లో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, వివిధ కారణాలతో అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏ కారణాలతో జరిగినా అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, వ్యాపార కూడళ్ళు, ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు జరిగే సందర్భాల్లో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అగ్నిమాపక శాఖకు వెంటనే తెలియజేయటం ద్వారా చాలావరకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అయితే ప్రతిఒక్కరూ ప్రమాదాలకు సంబంధించిన కనీస పరిజ్ఞానం అవసరం.
అదేవిధంగా తమ జీవితాలను ప్రజాసేవకు అంకితం చేసిన సిబ్బందిని స్మరించుకుంటూ అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన నీలం, ఎరుపు రంగు రిబ్బన్‌లను గౌరవార్థం ధరిస్తారు. ఐఎఫ్‌ఎఫ్‌డి రిబ్బన్లు అగ్నిమాపక సిబ్బంది పనిచేసే ప్రధానాంశాలకు ప్రతీకమైన రంగులతో అనుసంధానించి ఉంటాయి. అగ్నిని సూచిస్తూ ఎరుపు, నీటిని సూచించేందుకు నీలం రంగులు అంతర్జాతీయంగా అత్యవసర సేవకు సూచికగా ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయాలు

  •  ప్రపంచంలో మొట్టమొదటి అగ్నిమాపక కేంద్రం పురాతన రోమ్‌లో నిర్మించబడింది.
  •  మొదటి అధికారిక అగ్నిమాపక విభాగం 1678లో మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో స్థాపించబడింది.
  •  మండుతున్న భవనంలోకి ప్రవేశించడానికి అనుమతించే ముందు అగ్నిమాపక సిబ్బందికి సుమారు 100 గంటల శిక్షణ అవసరం.
  •  నిబంధనల ప్రకారం, అగ్నిమాపక సిబ్బంది రెండు నిమిషాలలోపు దుస్తులు ధరించాలి.
  •  యునైటెడ్‌ స్టేట్స్‌లో పది లక్షల కంటే ఎక్కువ అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. వారిలో మహిళలు కేవలం 7 శాతం మాత్రమే.
  •  మోలీ విలియమ్స్‌ 1815లో న్యూయార్క్‌ నగరంలో అగ్నిమాపక సిబ్బందిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ.
  •  అగ్నిమాపక సిబ్బంది మంటల బారిన పడటం కంటే గుండెపోటుతో చనిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది.
  •  చాలా మంది అగ్నిమాపక సిబ్బంది ప్రతి వారం సుమారు 50 గంటల పాటు విధుల్లో ఉంటారు.
  •  డాల్మేషియన్లను ఫైర్‌హౌస్‌ కుక్కలు అంటారు.
  •  బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ను అగ్నిమాపక సిబ్బందికి పితామహుడు.
  •  సిన్సినాటి అగ్నిమాపక విభాగం 1853లో స్థాపించబడింది.

మన రాష్ట్రంలో..
అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్‌ డి. మురళీమోహన్‌, వారి శాఖ వివరాలు ఇలా వివరించారు.
రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ద్వారా అగ్నిప్రమాదాల నిరోధానికి పెద్దఎత్తున కృషి చేస్తున్నాం. ఏటా ఏప్రిల్‌ 14 – 20వ తేదీ వరకూ ‘సేవయే మా కర్తవ్యం’ పేరుతో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ‘అగ్ని భద్రతను నిర్ధారించండి- దేశ నిర్మాణానికి సహకరించండి’ అన్న సందేశంతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాం. రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి అగ్నిమాపక వారోత్సవాలను రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డిజి) పి.వి.సునీల్‌కుమార్‌ ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నాలుగుజోన్లుగా విభజించి, అగ్నిప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నాం.

  •  జోన్‌ 1లో.. విశాఖలో విశాఖపట్టణం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి..
  •  జోన్‌ 2లో.. రాజమహేంద్రవరంలో కాకినాడ, రాజమహేంద్రవరం, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమజిల్లా, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాలు..
  •  జోన్‌ 3లో.. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు..
  •  జోన్‌ 4లో.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాలు ఉన్నాయి.

నిరంతరం అందుబాటులో..
రాష్ట్ర వ్యాప్తంగా 188 ఫైర్‌స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాకేంద్రంలో అగ్నిమాపక శాఖ కేంద్రాలు, వాటి పరిధిలోని డివిజన్లు, మండలాల్లో కొన్ని ఫైర్‌స్టేషన్లు పనిచేస్తున్నాయి. ప్రతిరోజూ 101 సర్వీసుల ద్వారా 24 గంటల పాటు హెల్ప్‌లైన్‌ నంబరు అందుబాటులో ఉంటుంది. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఎల్లవేళలా షిఫ్ట్‌ విధానంలో అన్నిచోట్లా అందుబాటులో ఉంటారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి 31 వరకూ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖకు వచ్చిన 13,107 ఫోన్‌ కాల్స్‌ ద్వారా 507 మంది వ్యక్తులను ప్రాణాలను కాపాడాం. రూ.1133 కోట్ల విలువైన ఆస్తులను అగ్నిమాపక శాఖ ద్వారా కాలిపోకుండా కాపాడగలిగాం. మొత్తం 12,180 ఇతర ప్రమాదాలకు సంబంధించిన 927 రిస్కుకాల్స్‌ను పరిష్కరించాం. మా శాఖ ద్వారా మూడు రోజులు వివిధ పరిశ్రమలు, ఇతర ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన నిమిత్తం 5,132 మందికి శిక్షణ ఇచ్చాం. ఫైర్‌ సేఫ్టీ మాక్‌ డ్రిల్‌ను 325 ఆసుపత్రుల్లో అగ్నిమాపక వారోత్సవాల్లో చేపట్టాం. పెద్దఎత్తున ప్రమాదాలు జరిగినా అదుపు చేయగల శక్తి మన అగ్నిమాపక శాఖకు ఉంది. 90 మీటర్ల ఎత్తులో జరిగిన ప్రమాదాలను సైతం నివారించగలిగిన హైడ్రాలిక్‌ వాహనాలు అగ్నిమాపకశాఖ పరిధిలో మూడుచోట్ల విశాఖ, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. గతంలో గుంటూరు జిల్లా మహేశ్వరపురం ప్రాంతంలో పెద్దఎత్తున జరిగిన ప్రమాదంలో ఇలాంటి యంత్రాలను వాడి, మంటలను అదుపులోకి తెచ్చాం. మా శాఖ ద్వారా రాష్ట్రస్థాయి శిక్షణా కేంద్రం సత్తెనపల్లిలో ఉంది. రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్లు రాజమహేంద్రవరం, పెనుగొండ, విజయనగరంలో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న కోరుకొండలో అధునాతనంగా నిర్మించిన ఫైర్‌స్టేషన్‌ను ప్రారంభించాం.

పురస్కారాలు..
ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పనిచేసినందుకుగాను.. మా శాఖా సిబ్బందిలో- 2023 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున 29 మంది, 2024 ఉగాది రోజున మరో 29 మంది ఉత్తమ పురస్కారాలను అందుకున్నారు.

సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు
949009214

➡️