మనం ఓటు వేద్దాం

May 12,2024 10:51 #2024 elction, #Sneha, #vote

‘ప్రతి ఎన్నికలను ప్రజలే నిర్ణయిస్తారు’ అంటారు లారీ జె. సబాటో. ప్రజాస్వామ్య దేశాలలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియనే ఎన్నికల వ్యవస్థగా చెబుతారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలైంది. 1947లో 30 కోట్లు వున్న దేశ జనాభా… నేడు 140 కోట్లను దాటేసింది. తొలిసారిగా 1951లో 26 రాష్ట్రాలలోని 489 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పారిశ్రామిక, సేవా సంఘాలు అభివృద్ధి చెందాయని చెప్పుకుంటున్నప్పటికీ… ఐరాస లెక్కల ప్రకారం మన దేశం చాలా రంగాల్లో వెనుకబడే వుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత… మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులదే. అయితే, స్థానిక పంచాయతీ వార్డు మెంబర్‌ నుంచి… దేశ పార్లమెంట్‌ మెంబర్‌ వరకూ సరైన వారిని ఎన్నుకోలేక పోతున్నాం. ఈ క్రమంలో కుల, మత దురభిమానాలను అధిగమించ లేకపోతున్నాం. రకరకాల ప్రలోభాలకు లొంగిపోతున్నాం. ముఖ్యంగా పాలకులు చెప్పే మాయమాటల్లో పడి, మంచిచెడ్డల విచక్షణ కోల్పోతున్నాం. దాని ఫలితంగా… బడా కార్పొరేట్లు, నేరగాళ్లు, సెక్స్‌ స్కాండల్స్‌లో, ఆర్థిక కుంభకోణాల్లో ఇరుక్కున్న వారు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవుతున్నారు. కాబట్టి మన ఓటుకు వున్న విలువను గుర్తించాలి. ఆ ఓటును సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా సరైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకోగలుగుతాం అంటూ… ”ఎన్నికలంటే ఏమిటి?” అనే ఈ 42 పేజీల చిన్న పుస్తకంలో వివరించారు రచయిత దేవినేని మధుసూదనరావు.
‘మనం ఓటు వేద్దాం… మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’ అనే సదుద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రచించారు. రచయిత చెప్పదల్చుకున్న అంశాన్ని పన్నెండు చాప్టర్లుగా విభజించి, సూక్ష్మంగా, సూటిగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ‘ఎన్నికలంటే ఏమిటి?’ అనే మొదటి అధ్యాయంలో ఎన్నికలు, వాటి ప్రాధాన్యత, ఎన్నుకునే విధానం వంటి అనేక అంశాలను వివరించారు. 2వ అధ్యాయంలో… ఎన్నికల చరిత్రను వివరించారు. 3వ అధ్యాయంలో ‘ఎన్నుకోవడం’ ఎలా? ఎవరికి ఓటు హక్కు వుంటుంది వంటి అంశాలున్నాయి. 4వ అధ్యాయంలో ‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు’ వివరాలున్నాయి. తర్వాత వరుసగా ‘ఎన్నికల వాస్తవాలు’, ‘ఉచితాలను ఆశించకుండా ఒక నిరుపేద చిన్నారి ఏవిధంగా ప్రవర్తించిందో’ అంటూ… ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో ఢిల్లీ రాజమార్గంలో బొమ్మలు అమ్ముకునే ఓ చిన్నారి పాపతో ఇందిరాగాంధీ సంభాషణ ఆసక్తికరంగా వుంటుంది. మిగతా అధ్యాయాలు కూడా ఓటు విలువ, ఓటరు కర్తవ్యం గురించిన అంశాలే వుంటాయి. ‘ఓటు నీ ఆస్తి – అమ్ముకోవద్దు’, ‘ఓటు నీ ఆత్మ- తాకట్టు పెట్టొద్దు’, ‘ఓటు నీ భవిష్యత్తు – నాశనం చేసుకోవద్దు’ వంటి స్ఫూర్తివంతమైన నినాదాలు కూడా మనల్ని లక్ష్యం వైపునకు నడిపిస్తాయి.
అందువల్ల 13వ తేదీన జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆడియో రూపంలోను, పుస్తకరూపంలోను వున్న ఈ సమాచారం తెలుసుకోవడం అవసరం. కుల, మతాలు చూసుకోకుండా, డబ్బుకు లొంగిపోకుండా… మంచిని గెలిపించాలి. ప్రజలతో వుండి, ప్రజలలో వుండి… ప్రజల కోసం పనిచేసేవారిని ఎన్నుకోవాలి. అందుకు ఈ చిన్న పుస్తకం ఉపయోగపడుతుంది.

కె.ఎక్స్‌.రాజు
94900 99231

➡️