మనిషి పూర్ణాహుతి

Apr 21,2024 11:54 #Sneha

అదొక
ఆధ్యాత్మిక శిక్షణా శిబిరం
బలవంతపు అనుమతులు
విగ్రహాలు చెక్కడం
యాగశాలల నిర్మాణం
వేదాల బట్టీయం
ఎన్నెన్నో తరగతులు
శిలలో తొలగించిన ముక్కలన్నీ
తాటాకుల మిగుళ్ళన్నీ
నత్తి మాటల అవ్యయాలన్నీ
మనం పోగుచేసుకొచ్చామా
ఆజ్యం రగులుకుంది
బహిష్కరణ వెలి నిషిద్ధం
అంటు ముట్టు మడి
సిద్ధాంతచర్చ జోరుగా
లోపలంతా దేవుడి వైభవం
పరిహారం శాంతి విరుగుడు
పాపం బలి మోక్షం
ధైర్యం మాటున దైవభీతి
పునశ్చరణ పాఠం
అవమానం చిన్నతనం
అగ్రహారం పరువుహత్య
తీర్మాన ఫర్మానా
అత్యాచారం దౌర్జన్యం
చెప్పుదెబ్బ కాలితన్ను
కన్నీటి కారుణ్యం
తప్పులన్నీ అతడి దృష్టి
శిక్షలన్నీ మనిషి సృష్టి
పశ్చాత్తాపమెరుగని పరమేష్టి
బయటంతా మానవ పరాభవం
మనిషిని నిలువునా చీల్చి
ముక్కల్ని ఏమార్చాలి
కడుపు కుండలో బాణం నాటాలి
చెట్టు చాటు నుంచి విషం చిమ్మాలి
నిద్రాభంగంతో చంపేయ్యాలి
వరాలకు శాపం వేషాలెయ్యాలి
అడుగడుగునా శిక్షణ
ఇంటింటా పూజాఫలం
మెదడుకో మంత్రపుష్పం
మనిషి పూర్ణాహుతి!

ప్రసేన్‌
9848997241

➡️