హృదయాన్ని తట్టి లేపే ‘నల్ల సూరీడు’

Jan 21,2024 06:44 #book review, #Sneha
nalla sureeu book review jothirmai

మనిషి తన చుట్టూ ఉన్న వాళ్లని గమనించడం మానేసి చాలా రోజులైంది. యాంత్రికతతో పోటీపడుతూ జీవిస్తున్నాడు. అటువంటి మనిషిని తట్టిలేపే ప్రయత్నం చేశారు ‘నల్లసూరీడు’ సంకలన రచయిత వంజారి రోహిణి. ఈ పుస్తకంలో ప్రతి కథ మనల్ని సమాజానికి దగ్గరగా నడిపిస్తుంది. ఆమె ఎంచుకున్న కథావస్తువు ఊహాలోకంలో విహరించదు. మనలో ఒకరిని చూపిస్తుంది. మనకు తెలిసిన వారిని గుర్తుచేస్తుంది. మానవత్వాన్ని తట్టిలేపుతుంది. కష్టాల్లో పోరాడడం నేర్పిస్తుంది. దు:ఖంలో ఉన్న వారికి చేయూతనివ్వమంటుంది. కులం, మతం కంటే మానవత్వం గొప్పదని చెబుతుంది. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి కథా హృదయానికి దగ్గరవుతుంది.

నిత్య జీవితంలో మనకు ఎన్నో సంఘటనలు ఎదురవుతుంటాయి. వాటి ప్రభావం కొంతసేపు, కొన్ని రోజులు మనల్ని వెంటాడుతుంది. అలా తనకెదురైన అనుభవాల్లోంచి రచనలు చేసి, పదిమందినీ ఆలోచింపజేసిన రచయిత చొరవ అభినందనీయం.

కాలేజీ ఈడు పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు నిత్యం రద్దీ ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఎక్కే బస్సు, దిగే బస్సు, క్యాబ్‌లు, ఆటోలు ప్రతిచోటా జనసందోహాలే. అలాంటి చోట ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో తలదించుకుని వెళ్లిపోయేవాళ్లు, ఎదురుతిరిగి మాట్లాడేవారు కూడా తారసపడతారు. ఆ అనుభవాలనే ‘క్రూకెడ్‌’ పేరుతో కథగా మలిచారు రచయిత. ఇది చదువుతున్నప్పుడు ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో కర్తవ్య బోధ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని తాపత్రయపడే టీచర్లకు కొదవలేదు. అయితే వృత్తిలో భాగంగా వారు ఎన్నో రాగద్వేషాలకు గురికావాల్సి వుంటుంది. తోటి ఉపాధ్యాయుల నుండి విముఖత ఎదుర్కొనాల్సి వుంటుంది. ఆ అనుభవాలతో ‘సూపర్‌ టీచర్‌ సిండ్రోమ్‌’ కథను మలిచిన తీరు బాగుంది.

పుట్టలో పాలు పోసే బదులు వాటితో పొంగలి వండి, ఆకలితో ఉన్నవారికి అన్నంపెట్టండని సున్నితంగా హెచ్చరిస్తారు ‘కుబుసం’ కథలో. వైకల్యం శరీరానికే కాని, మనసుకు కాదని నిరూపిస్తారు ‘మధు’ అనే కథలో. కాళ్లూ, చేతులు లేని మధుని గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దిన హర్ష పాత్రను ఎంతో హుందాగా మలుస్తారు. కళాకారుడిగా తనను తాను నిరూపించుకున్న హర్ష, అచేతన స్థితిలో ఉన్న మధులో ఆత్మస్థైర్యం నింపిన తీరు భావోద్వేగపూరితంగా సాగుతుంది.

మధ్యతరగతి కుటుంబాల్లో ఆలుమగలు ఇద్దరు కష్టపడితేనే రోజులు గడుస్తాయి. అలాంటి కుటుంబాల్లో ఏదైనా ప్రమాదంలో భాగస్వామికి సుస్తీ చేసి, మంచానపడితే ఆ కుటుంబ కష్టాలు వర్ణనాతీతం. అన్ని కష్టాల్లోనూ గుండె నిబ్బరం చేసుకుని ఇంటి బాధ్యతను నెత్తినేసుకుంటారు చాలా మంది గృహిణులు. ఇంటిని సాకుతూ, బిడ్డలను ప్రయోజకులను చేస్తారు. భర్తకు తోడునీడగా నిలబడతారు. అటువంటి ఓ ఇల్లాలి కథే ‘సరంగు’. రాత్రి బాగా పొద్దుపోయాక బస్సుల్లో, ఆటోల్లో, క్యాబుల్లో ప్రయాణించే మహిళల అంతరంగాన్ని ఆవిష్కరించారు ‘చెల్లె’ కథలో. పైకి ధైర్యంగా కనిపిస్తున్నా ఆ సమయంలో పడే మానసిక సంఘర్షణ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించామనే స్పృహ వస్తుంది పాఠకురాలికి. ఊబకాయ పాత్రతో కాస్తంత జాలితనం జోడించి, తీర్చిదిద్దిన ‘పరబ్రహ్మం’ కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

సాటి మనిషిని తక్కువ చేసి చూడొద్దని చెబుతారు ‘జాడలు’ కథలో. ‘ఆసరా’ కథైతే రచయిత స్వీయానుభవం. చుట్టుపక్కల ఉండే వారిని పలకరించడం మానేసి చాలా రోజులైన వారంతా ఈ కథ చదివితే కచ్చితంగా నొచ్చుకుంటారు. ఏదో అపరాధ భావం వారిని వెంటాడుతుంది. అంత హృద్యంగా ఈ కథను మలిచారు. కుల, మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అని చాటిచెబుతూ ‘నల్ల సూరీడు’ టైటిల్‌ కథను నడిపించిన తీరు చాలా బాగుంది.

పండుగలకి, పబ్బాలకి మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం అందరికీ అలవాటు. అలా పేరుకుపోయిన స్వీట్లన్నీ ఫ్రిజ్‌ల్లో మురుగబెట్టి, ఆనక బూజు పట్టాక పారేస్తారు చాలామంది. ఈ అంశాన్ని తీసుకున్నారు ‘ఇచ్చుటలో ఆనందం’ కథలో. ఈ కథ చదివాక ఎవ్వరూ స్వీట్లను వృథాగా పారేయరు. పెంపుడు జంతువుల పట్ల ఆ యజమానులు పెంచుకునే ప్రేమను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తారు ‘బుజ్జమ్మ పిల్లి’ కథలో. హాస్య రచనగా ‘డ్రైవర్‌ నారాయణో హరి’ కథను నడిపించిన తీరు బాగుంది. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను, క్లాసు రూంలో టీచర్‌ వేధింపులను, మన ఉన్నతికి పాటుపడిన వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించమని చెప్పిన తీరు.. ఇలా ప్రతికథలో ఒక ఆలోచనాత్మక, ఆచరణాత్మక అంశం కనిపిస్తుంది. విశ్రాంత ఉద్యోగులు కోరుకునే మానసిక ప్రశాంతత, ఆరుగాలం పడ్డ కష్టమంతా వరదపాలైన రైతు వేదన.. ఇలా సమాజంలో ప్రతి అంశాన్ని స్పృశించిన తీరు సర్వత్రా అభినందనీయం.

– జ్యోతిర్మయి

➡️