ఓ ఆకలి చావు

Dec 28,2023 07:38 #Hunger, #Poetry
poetry on hunger deaths

మానవ విలువలు కర్పూరమయ్యాక

ఆకలి కేకలు ఏ మానవత్వానికి వినపడవు

ఎండిన డొక్కల్లో ఆకలి చేస్తున్న రణం

మలిన పడిన మనసుల సాక్షిగా

మరణ శాసనాల్ని లిఖిస్తుంది

 

బతుకు సంద్రంలో

ఆకలి ఆనారోగ్య చింతనలతో మగ్గుతున్న

అన్నార్తుల కన్నీటి విలవిలలు

నీటి బుడగలై చితికి పోతున్నాయి

 

వైరాశ్యం గూడు కట్టుకుని

కాలంతో పోటీ పడలేక

ఓ ఆకలి చావు

ఆఖరి చూపై

సమాజ నిస్సహాయతను అవహేళన చేస్తుంది

 

ఓ మనసున్న మనిషినీ అంతరంగపు అట్టడుగు

పొరల్లోకి ఒక్కసారి తొంగి చూడు

అభయ హస్తాలు అందించే చేతులు

అక్కడ మొలిచే ఉంటాయి

ఆకలి కడుపుకు పట్టెడన్నం పెట్టే మనసు

అక్కడ పరిమళిస్తూనే ఉంటుంది

చేతనత్వంతో చేయూతనిచ్చే మనిషి

యోగ నిద్రలో ఉండే ఉంటాడు

నిస్సహాయులకు నేనున్నాననే

ఆత్మ అక్కడ సంచరిస్తూనే ఉంటుంది

నీలో మార్మికమైన ఈ నిగూఢాలను

నీ మనోనేత్రంతో దర్శించు

మనిషిలో దాగున్న దేవుడు కనిపిస్తాడు

మానవత్వం గుబాళిస్తుంది

 

  • నెల్లుట్ల సునీత, 7989460657
➡️