పొలం గట్టు

Mar 10,2024 10:36 #kavithalu, #Sneha

నాగలి భుజాన వేసుకొని
పొలంగట్టుమీద నడుస్తుంటే పచ్చని
మాగాణి పులకరించి పోతుంది
మట్టితాలూకు చిరునామా తెలిసిన
కర్షకుని పలకరిస్తే పంటపొలాల ముచ్చట్లు
ముత్యాలై రాలతాయి
పత్తిసేనంత తెల్లని పసిడివనమై పోతుంది
హాలికుడి చెమట చుక్కల తాకిడికి
పసుపు కొమ్ములు.. పోశవ్వ పాదాలకాడ
ముత్తైదువుల చెంపలకు నిండునూరేళ్లయి
పాదాలకు పచ్చని పారాణై…
ఆడబిడ్డలు బోనాలు ఎత్తుకొని…
పొలంగట్టు మీద నడుచుకుంటూ పోయి
మొక్కులు చెల్లిస్తున్నరు ఊరి దేవుళ్ళకు
పాడిపంటలు రాసులై పండాలని
కైకిలవ్వలు కలుపును కలుస్తున్నరు
నేలమ్మ సేవలో తరించిపోతున్నరు
అవ్వల సెయ్యి తాకి
మొక్కలు ఆనందంతో నవ్వుతున్నయి
ముచ్చట్లతో మునిగిపోతున్నయి
పొలంగట్టుమీద కూసోని కారం బువ్వతో
సద్దన్నం తింటే ఎంతకమ్మని భోజనమో..!
పొలంగట్టు ఆనందంతో ఉప్పొంగిపోతోంది
పచ్చని పంటలకు ఆకుపచ్చని తోరణం
కట్టినట్లు పొలంగట్టు మెరిసిపోతోంది

అశోక్‌ గోనె
9441317361

➡️