రైతే కదా వెన్నెముక

Apr 14,2024 13:16 #Sneha

చేను గట్టుపై రైతు కష్టం
మెతుకులై సమస్తాన్ని బతికించాలి
రైతు లేని రాజ్యం
ఆకలి ఆర్తనాదాల హాహాకారాలేననే
నిజం తెలిసిరావాలి
గిట్టుబాటు లేనితనం వెనుక
గుట్టు చిట్టాను బయట పెట్టేలా
సరికొత్త అజెండా లిఖించబడాలి
మొక్క పోషణకై
ముప్పతిప్పలు పడే కాలం పోయి
సరసమైన ఎరువుల ధరలతో
ప్రతి మొక్కను బతికించాలి
చెట్టు చెట్టుకూ న్యాయం జరగాలి
రాజకీయపు చదరంగంలో
మెలికలు తిరిగే రైతన్న బతుకుని
అతుకులు లేని జీవనంగా సాగించాలి
రైతు వెన్నువిరిచే
పన్నాగాల పథకావిష్కరణలపైన
నిగ్గు తేల్చే నిజాన్ని ఎక్కుపెట్టాలి
రైతు లేనిదే మెతుకు లేదన్న సత్యం
ఆదమరచిన మనసుల్లోకి ఎక్కించాలి
గింజ గింజలో కర్షకుని స్వేదం
అణువణువునా నిండి వుందని
మదమెక్కిన బుర్రల్లోకి చొప్పించాలి
ఎండ వానలు వాగు వంకలు
చెట్టుపుట్ట గుట్టలోయల్ని లెక్కచేయని
రైతు కష్టం సమాజానికి ప్రాణవాయువని
ఆదమరచిన మనిషి చెవిన
గుణపాఠమై గుచ్చుకోవాలి
రెక్కలిరుచుకున్న కంకిని విదిల్చుతూ
ధాన్య సిరులను దేశానికి పంచే
రైతే రాజని మరోసారి గుర్తు చేయాలి
ఆరుగాలం పంటకు
ఆయువంతా పోసి కుప్ప ఊడ్చాక
నడ్డి విరిచే రేటు గునపమై పొడిచాక
కరువు కాటుతో రైతు జీవనం
మట్టికే అంకితమైపోయింది
రైతు జెండా గగన సీమలో
పచ్చదనంగా పరిణమించాలి
మట్టి మనిషి కష్టానికి
ఆపన్నహస్తం ముడుచుకున్నాక
కర్షకుని కష్టం బూడిదపాలయింది
ఇక ఆగి చూసే కాలం లేదు
రైతు పోరుకు సిద్ధమవ్వాలి
మట్టిని తడిపే చెమట చుక్కల సాక్షిగా
కీళ్ళు వంచి పనిచేసే రైతన్న సాక్షిగా
అరువు బరువును మోయలేక
అసువులు బాసిన కర్షకుని సాక్షిగా
పుస్తెలమ్మి పంటదీసే దీనత్వపు సాక్షిగా
రైతన్నకు లేకపాయే చేయూత
రైతే కదా.. పిడికెడు బువ్వకు సృష్టికర్త
రైతే కదా.. నాల్గు మెతుకులకు ధర్మకర్త
రైతును బతికించాలి
రైతును జీవింపజేయాలి
వ్యవస్థను ఆకలి కరువు నుంచి
శాశ్వతంగా దూరం చేయాలి

నరెద్దుల రాజారెడ్డి
9666016636

➡️