పొగ.. ఆరోగ్యానికి పగ

May 26,2024 11:32 #Sneha, #Stories, #Tobacco

మద్యం ఓ వ్యసనం.
పొగ ‘తాగు’డు.. వ్యసనాల్ని మించిన వ్యసనం.
పొగ మరిగితే పెదవి మరచిపోలేదు.
ధూమానుబంధం ఒక జీవిత బంధం.
అయితే, ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న
ధూమపానంపై యుద్ధాల మాటలు..
ఆ బంధం తెంచుకునే ప్రయత్నాలకు సంకేతాలు..
ఈ జగతిని ‘నిర్ధూమ’ ధామం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

‘ప్రొద్దున లేచి ధూమ్రదళ పుంజము కన్నుల కద్దుకోని, దా/ ముద్దుగ చుట్ట దీర్చి, తన మోము పయిం ఘటియించి, మీసముల్‌/ దిద్ది, పొగాకు వేడియును ధీజన కోటికి మోదమిచ్చి, తా/ పెద్దల పేరు జెప్పి, పొగ పీల్చినవాడు కృతార్థు డిమ్మహిన్‌’ అన్నారు చిరుమర్రి నరసింహ కవి (1814-1894) అప్పుడెప్పుడో. కన్యాశుల్కంలో గిరీశం కూడా ‘పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌’ అంటూ వెంకటేశానికి ధూమపాన పాఠాలు ఘనంగా నేర్పుతాడు. ఒకప్పుడు పొగ తాగటం ఒక దర్జా చిహ్నంగా పద్యాలూ, పదాలూ అల్లినమాట నిజమే కానీ, ఆధునిక కాలంలో ఆ వ్యాపకం ఆరోగ్యానికి ఎంత హానికరమో శాస్త్రీయంగా తెలిసొచ్చింది. పచ్చని బతుకు మసిబారేటట్టు చేస్తోంది. పైకి దిట్టంగా కనిపించిన లోలోన ఊపరితిత్తులను తుత్తునీయులుగా మారుస్తుంది. రకరకాల క్యాన్సర్లకు, శ్వాసకోశ సంబంధ జబ్బులకు ఆహ్వానం పలుకుతుంది.
కొంతమంది పెదవులపై నాజుకుగా కదలాడే చుట్ట, సిగరెట్టు.. అదో స్టైల్‌.. అదో ఫ్యాషన్‌ సింబల్‌. గాల్లో మేఘాలు సృష్టిస్తూ.. గాల్లో తేలినట్టుందే అన్నట్టుగా ఓ అవ్యక్తానుభూతి పొందుతుంటారు. జీవితం కాలిపోతే కాలిపోనీ, బతికి ఉన్నన్నాళ్లూ హాయిగా పొగలో పొగలా సాగిపోనీ. కాలిస్తే అది కాలుస్తుందని తెలుసు. పొగ తప్ప అది ఏమీ మిగల్చదని తెలుసు. సిగార్‌తో చేసే స్నేహం.. భస్మవాటిక ప్రయాణమన్న తెల్లకాష్టం సందేశమూ తెలుసు. అయినా మనిషి పొగలో సెగలో తేలిపోతూ.. కాలిపోతూ సాగిపోతూనే వుంటాడు.
ధూమపానం అలవాటు.. అనారోగ్యానికి మొదటిమెట్టు. పొగాకు యొక్క ఆకర్షణ ఒక సమ్మోహనకరమైన సైరన్‌ పాట. ఇది జీవితకాల బాధల ఖర్చుతో నశ్వరమైన ఆనందాన్నిస్తుంది. అయినప్పటికీ, చైన్‌ స్మోకర్‌ యొక్క నల్లబడిన ఊపిరితిత్తుల వలె ఒక నిజం ఉపరితలం కింద దాగి వుంటుంది. ప్రతి పఫ్‌.. వ్యాధి యొక్క గుసగుసల వాగ్దానం. శ్వాసలు, విరిగిన శరీరాల ప్రపంచంలోకి నెమ్మదిగా, వేదనతో కూరుకుపోవడం మనకు కనిపిస్తూనే వుంటుంది. కానీ బతకాలనే ఆశ.. కాలి, రాలిపోతున్న బూడిద మధ్య మిణుకుమిణుకుమంటుంది. మన ఆరోగ్యం, మన స్వేచ్ఛను తిరిగి పొందేందుకు.. పొగ రహిత జీవితం వైపు మనం వేసే ప్రతి అడుగు.. వ్యసనమనే సంకెళ్లను తెంచుకుని, బయటపడేదిగా వుండాలి. స్వచ్ఛమైన గాలి యొక్క తీపి రుచి, పొగ భారం లేని ప్రపంచంలోని ప్రకాశవంతమైన రంగులు, ఆరోగ్యవంతమైన శరీరం బలంతో నిండిన భవిష్యత్తు వైపు కదలాలి. ఈ పొగ శత్రువుకు వ్యతిరేకంగా, ఐక్యంగా పోరాడి, పొగలేని ప్రపంచాన్ని సృష్టిస్తామని ప్రతిజ్ఞ చేయాలి.
పొగాకు పొగలో శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే రసాయనాలు ఉన్నాయి. ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్టు పెట్టెలపైనా, మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లతో పాటు బస్సులు, రైళ్లు ఇతర బహిరంగ ప్రదేశాల్లో రాసి ఉంటుంది. అయినా, పొగ తాగే అలవాటు మానుకోరు. బీడీ, చుట్ట, సిగరెట్‌ ఇతర పొగాకు ఉత్పత్తులు యువత నుంచి మొదలుపెట్టి వృద్ధుల వరకు లాగించేస్తున్నారు. డబ్బు, ఆరోగ్యం రెండూ పోయినా.. పొగను మాత్రం వదలడం లేదు. నికోటిన్‌ మత్తుకు బానిసై చాలామంది ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. చివరకు క్యాన్సర్ల బారిన పడి, ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. పొగాకును సిగరెట్‌ లేదా మరే రూపంలో తీసుకున్నా ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. నికోటిన్‌, పొలీనియం అనే రేడియో థార్మికంతో పాటు నాలుగువేల రకాల హానికారకాలున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ‘ధూమపానం ముక్కుకు అసహ్యకరమైనది, మెదడుకు హానికరం, ఊపిరితిత్తులకు ప్రమాదకరం’ అంటారు కింగ్‌ జేమ్స్‌ అనే శాస్త్రవేత్త. ఈ రోజు, లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ శత్రువుకు వ్యతిరేకంగా.. ప్రపంచాన్ని ఐక్యంగా నిలబెట్టింది ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’. దీనిపై అవగాహన పెంచడానికి, వ్యసనాల సంకెళ్లను విచ్ఛిన్నం చేయడానికి, పొగ రహిత జీవితంతో వచ్చే స్వేచ్ఛను ఆస్వాదించడానికి నిర్ణయించుకునే రోజు ఇది.

మన దేశంలో..
మనదేశం దాదాపు 80 కోట్ల కిలోల వార్షిక ఉత్పత్తితో రెండవ అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారు, ప్రపంచంలోని ప్రముఖ పొగాకు ఎగుమతిదారు. దేశంలో దాదాపు 2.6 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు పొగాకు ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. మొత్తం 4.57 కోట్ల మంది ప్రజలు పొగాకుపై ఆధారపడి జీవిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు ప్రభుత్వ పన్ను రాబడిలో రూ.50,000 కోట్లకు పైగా జమ చేస్తాయి.
కొలంబస్‌ 1492లో మనదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో అమెరికాను, పొగాకును కనుగొన్నాడు. భారత్‌ ఆ సమయంలో ఐరోపా దేశాలకు అవసరమైన కొన్ని నిత్యావసర వస్తువుల ఏకైక సరఫరాదారు. దక్షిణ అమెరికా, భారతదేశాన్ని సందర్శించిన ప్రయాణ బృందాలలో ఒకటి 1508లో దేశంలోకి పొగాకును ప్రవేశపెట్టింది. నేడు, మనదేశంలో పండించే ప్రధాన వాణిజ్య పంటలలో పొగాకు ఒకటి. దేశంలో 4.64 లక్షల హెక్టార్లలో పొగాకు సాగు జరుగుతోంది. సిగరెట్‌, బీడీ, సిగార్‌, చెరూట్‌, హుక్కా, చూయింగ్‌, స్నఫ్‌ వంటి పొగాకు ఉత్పత్తులలో ఉపయోగించడం కోసం మనదేశంలో వివిధ రకాల పొగాకులను సాగు చేస్తారు. పొగాకు సాగు దేశమంతటా విస్తరించి ఉన్నప్పటికీ, పొగాకు వాణిజ్య సాగు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర, బీహార్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉంది.
కాగా, పొగాకు ఎగుమతి చేసే దేశాల్లో మనదేశం కూడా అగ్రస్థానంలో ఉంది. దీని వార్షిక విదేశీ మారకపు ఆదాయం 2022-23లో రూ. 9,000 కోట్లు. ప్రభుత్వం తన విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచుకోవడానికి పొగాకు ఎగుమతులు భారీ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
దేశంలోనూ పొగాకు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో 110 కోట్ల మంది ధూమపాన ప్రియులుండగా, మనదేశంలో వారి సంఖ్య 10.6 కోట్ల పైమాటే. అంతేకాదు, 2030 నాటికి పొగాకు సంబంధిత మరణాలు అత్యధికంగా మనదేశంలోనే నమోదవుతాయన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఇక పరోక్షంగా పొగ పీలుస్తూ, హానికర దుష్పరిణామాల బారినపడి బలైపోతున్న వారెందరో సరైన లెక్కలు లేవు. ప్రపంచ వ్యాప్తంగా ధూమ రహిత పొగాకు ఉత్పత్తుల వాడకందారులు దాదాపు 37 కోట్లలో 20 కోట్ల మంది వరకు మనదేశంలోనే వున్నారట! నికోటిన్‌తోపాటు ఏడు వేల రకాల విషతుల్యాలకు నెలవైన పొగాకు వినియోగం వలన క్యాన్సర్లు, గుండెజబ్బులు, శ్వాసకోశ వ్యాధులు పెచ్చరిల్లుతున్న దేశం మనది. రోజుకు ఒక్క సిగరెట్‌ కాల్చే వ్యక్తుల్లోనూ గుండెజబ్బులు, పక్షవాతం ముప్పు తీవ్రతరం అవుతున్నట్లు లండన్‌ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం గతంలోనే నిగ్గుతేల్చింది.


చరిత్ర ..
చాలా దేశాల్లో 16వ శతాబ్దంలో పొగాకు మొక్కను ‘పవిత్రమైన మొక్క’ అని, దేవుడు ప్రసాదించిన ‘ఔషధ మొక్క’ అని భావించేవారు. ‘పొగాకు విషానికి చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తుంది’ అని 1587లో డచ్‌ వైద్య పరిశోధకుడు గైల్స్‌ ఎవెరార్డ్‌ రాసిన పుస్తకం ‘పనాకియా’లో పేర్కొన్నారు. ఇది చాలా శక్తివంతమైన ఔషధం అని ఎవెరార్డ్‌ భావించేవారు. కానీ, మరికొందరు ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. పొగాకును వైద్య అవసరాల కోసం వినియోగించేందుకు ప్రయత్నించిన తొలి యూరప్‌ వ్యక్తి సముద్ర యాత్రీకుడు క్రిస్టఫర్‌ కొలంబస్‌ అని ‘రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌ జర్నల్‌’లో ప్రచురించిన కథనంలో ప్రొఫెసర్‌ అన్నే కార్ల్‌టన్‌ పేర్కొన్నారు. 1492లో క్యూబా, హైతీ, బహమాస్‌లో ఉన్న దీవులకు వెళ్లిన కొలంబస్‌, అక్కడి ప్రజలు సన్నని గొట్టాలలో పొగాకు పెట్టి, పొగ పీల్చుతున్నారని గుర్తించారు. కొన్నిరకాల రుగ్మతలను నయం చేసేందుకు కూడా అప్పట్లో పొగాకును వినియోగించేవారు. కొన్ని ప్రాంతాల్లో సున్నం, పొగాకు పొడి మిశ్రమాన్ని టూత్‌పేస్ట్‌లా వినియోగించేవారు. ఇప్పటికీ మనదేశంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా ఈ అలవాటుంది.

2024 థీమ్‌
‘పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం’.. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్‌. భవిష్యత్తు తరాలను రక్షించడం, పొగాకు వినియోగం తగ్గుముఖం పట్టేలా చేయడమే లక్ష్యంగానే ప్రతి ఏడాదీ పొగాకు నిరోధక దినోత్సవాన్ని జరుపుకుంటారు. విస్తతమైన సోషల్‌ మీడియా, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ప్రచారాల ద్వారా, యువకులు పొగాకు ఉత్పత్తుల ఆకర్షణకు ఎక్కువగా గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించింది. చాలా దేశాలలో 13-15 ఏళ్ల వయస్సు గల పిల్లలు పొగాకు, నికోటిన్‌ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని ఆయా దేశాల సర్వేలు చెపుతున్నాయి. పొగాకు పరిశ్రమ కూడా యువతే లక్ష్యంగా రకరకాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెస్తోంది. ఈ విపత్తు నుంచి యువతకు అవగాహన కల్పించడం, పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే హాని గురించి వివరించడం, యువత అప్రమత్తతతో వ్యవహరించాలన్న లక్ష్యంగా ఈ ఏడాది థీమ్‌ను నిర్ణయించారు.


అవగాహన ప్రకటనలు..
కానీ, 1920, 30లలో పొగాకు వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై చర్చ మొదలైంది. ధూమపానం ఎంత హానికరమో గడచిన మూడు దశాబ్దాల కాలంలో ప్రపంచానికి స్పష్టంగా తెలిసొచ్చింది. దాంతో, భారత్‌ సహా అనేక దేశాలు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించాయి. సిగరెట్ల మీద హెచ్చరిక గుర్తులతో, ప్రకటనలు ఇస్తూ ధూమపానం మానేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 


ఎక్కువగా పొగ తాగే దేశాలివే..
ధూమ పానం ప్రపంచమంతటా అతి పెద్ద సమస్యగా మారింది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ పొగ తాగే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
1. కిరిబాటి : ఇదో చిన్న దీవి. ఇక్కడి జనాభా కేవలం 1.3 లక్షలు. అయితే, ప్రపంచంలోనే అత్యధిక శాతం పొగరాయుళ్లు ఇక్కడున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు పురుషులు ధూమపానానికి అలవాటుపడ్డారు. మూడొంతుల మంది మహిళలు కూడా పొగ తాగుతున్నారు. ఈ దేశంలో సిగరెట్లపై పన్నులతో పాటు పొగాకు నివారణా చర్యలు కూడా తక్కువే.
2. మాంటెనెగ్రో : యూరప్‌లోని మాంటెనెగ్రో దేశంలో 46 శాతం మంది ప్రజలకు పొగ తాగే అలవాటుంది. 6.3 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు.
3. గ్రీస్‌ : గ్రీస్‌లో 50 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ధూమపానం చేస్తారు. 2008 నుంచి అక్కడ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించారు. అయినా, చాలామంది బహిరంగంగానే పొగ తాగుతూ కనిపిస్తారు. ఇక్కడ సిగరెట్ల అక్రమ రవాణా కూడా ఎక్కువే.
4. ఈస్ట్‌ తైమూర్‌ : ప్రపంచంలోనే అత్యధికంగా పొగ తాగే దేశం ఇది. 80 శాతం మంది పురుషులు, ఆరు శాతం మంది మహిళలు పొగ తాగుతారు. ప్రతి సిగరెట్‌ డబ్బాపైన హెచ్చరికలు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత కారణంగా 50 శాతం మంది వాటిని చదివే పరిస్థితే లేదు.
5. రష్యా : రష్యాలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 60 శాతం మంది పొగ తాగుతున్నారు. 23 శాతం మంది మహిళలకూ పొగ తాగే అలవాటుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడంపై నిషేధం ఉన్నప్పటికీ.. పొగాకు సంస్థలు ప్రకటనల కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. రష్యాలో సిగరెట్ల మార్కెట్‌ విలువ 1.4 లక్షల కోట్ల పైమాటే.

తక్కువ తాగే దేశాలు ..
ఘనా, ఇథియోపియా, నైజీరియా, ఎరిత్రియా, పనామా.. ఈ ఐదు దేశాలూ అతి తక్కువగా పొగ తాగే దేశాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఆఫ్రికాలో 14 శాతం మంది మాత్రమే పొగ తాగుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచ సగటు 22 శాతం. ఆ దేశాల్లో పొగ తాగే వాళ్లలో దాదాపు 85 శాతం మంది పురుషులే.

యువతే టార్గెట్‌గా..
పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలు పొగాకు ఉత్పత్తులపై 100 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించడానికి యువతే లక్ష్యంగా, వినూత్నమైన ప్రకటనలతో ఆకర్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం మరణించే వారు / పొగాకు వాడకాన్ని విడిచిపెట్టే 10 లక్షల మంది వినియోగదారులను భర్తీ చేసే ఎత్తుగడలో భాగంగానే యువతను టార్గెట్‌ చేసుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, రకరకాల ఉత్పత్తులు అందుబాటు ధరల్లో ఉన్నాయని నిర్ధారించడానికి సడలింపు నియంత్రణతో సహా, యువతను ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడానికి పొగాకు పరిశ్రమ పనిచేస్తుంటుంది. ఈ పరిశ్రమ పిల్లలు, యువతను ఆకర్షించే ఉత్పత్తులు, ప్రకటనల వ్యూహాలను క్రియేటివ్‌గా అభివృద్ధి చేస్తున్నది. సోషల్‌ మీడియా, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్స్‌ ద్వారా యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటోంది. ప్రభుత్వాలను లొంగదీసుకుంటుంది కూడా!
ప్రపంచవ్యాప్తంగా 13-15 సంవత్సరాల వయస్కులైన కనీసం 3.7 కోట్ల మంది యువకులు- 2022 డేటా ప్రకారం పొగాకును ఉపయోగిస్తున్నారు. డబ్లుహెచ్‌ఓ యూరోపియన్‌ రీజియన్‌లో 13-15 ఏళ్ల వయస్సు గల అబ్బాయిలలో 11.5 శాతం, బాలికలలో 10.1 శాతం (40 లక్షల) మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.

పర్యావరణానికి దెబ్బ..
పొగాకు పెంపకానికి పురుగుమందులు, ఎరువులు చాలా అవసరం. ఈ విషపూరిత మూలకాలలో కొన్ని నీటి సరఫరాలోకి ప్రవేశించగలవు. కానీ నష్టం అక్కడితో ఆగదు. తయారీ ప్రక్రియలో 20 లక్షల టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సృష్టించడంతో పాటు 43 లక్షల హెక్టార్ల భూమిని వినియోగిస్తుంది. ఇది ప్రపంచంలోని అటవీ నిర్మూలనలో రెండు శాతం నుంచి నాలుగు శాతం మధ్య దోహదపడుతుందని అంచనా వేయబడింది.


రైతులకు ప్రత్యామ్నాయం..
నోటి క్యాన్సర్లలో 80 శాతానికి, క్షయ వ్యాధి విజృంభణలో 40 శాతానికి ధూమపానమే ప్రధాన కారణమవుతున్నప్పుడు పైపూత చికిత్సలకే ప్రభుత్వాలు పరిమితం కావడం అసంబద్ధం. ధూమపాన వ్యసనం, ఇతరత్రా పొగాకు ఉత్పత్తుల వినియోగం ఉచ్చు నుంచి బాధితుల్ని బయట పడేయటం ఎంత ముఖ్యమో, పొగాకు రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్ళించడమూ అంతే కీలకం. ఉత్పత్తి కర్మాగారాల మూసివేత, దిగుమతులపై నిషేధంతో పాటు పొగాకు సంబంధిత జీవనాధారం కలిగినవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అణ్వాయుధాల ఉత్పాతం కన్నా అత్యంత ప్రమాదకారిగా మారుతున్న పొగాకు ఉత్పత్తులపై నిషేధం అమలు జరిగితేనే ప్రజారోగ్యం కుదుటపడుతుంది!
పొగాకును మజా కోసమే మన మధ్యకు తెచ్చుకున్నా.. అందుకు ఎన్నడో కొలంబస్‌ బాధ్యుడైనా, ఆ తర్వాత పోర్చుగల్‌ వ్యాపారి ఎవరో పొగ మొక్కను మనదేశం తెచ్చినా.. ఇప్పుడు ఆ పొగపై పగ పట్టని దేశాలే లేవు. కొంత ఆలస్యంగానైనా మనమూ అదే బాటలో సాగుతున్నాం. ధూమపానం కంటే చిత్తశుద్ధి రాహిత్యానికి మనం బానిసలం కనుక, సిగరెట్‌ పెట్టెల మీద ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అని మాత్రం రాసుకుని ఊరుకున్నాం. ఆ మాటలు చదివి, ఆ పెట్టెను విసిరికొట్టి ధూమపానానికి ఇక నమస్కారం అంటారని మన ఆశ.
విశ్వవ్యాప్తంగా 17 కోట్లకు పైబడిన కేసులు, సుమారు 35 లక్షల మరణాలకు కారణభూతమైన కరోనా- యావత్‌ మానవాళినీ హడలెత్తించింది. కోవిడ్‌ వంటి వ్యాధుల ముప్పు తీవ్రత పొగ తాగే అలవాటున్న వారిలో 50 శాతం వరకు అధికంగా ఉంటుంది.. పొగాకు వ్యసనాన్ని వదిలిపెట్టడమే పరిష్కారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆ మేరకు మనదేశంతో సహా 29 దేశాల్లో ప్రత్యేక కార్యాచరణనూ ప్రతిపాదించింది. సిగరెట్‌, చుట్ట, బీడీల రూపేణా ధూమపానం, ఖైనీ, గుట్కా, పాన్‌ మసాలా తదితరాల వినియోగానిది- భల్లూకం పట్టు. ప్రత్యక్షంగా పొగాకు వాడకంవల్ల, పరోక్షంగా పొగ పీల్చడం వల్ల ఏటా 82 లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారని లోగడే లెక్కకట్టిన డబ్ల్యూహెచ్‌ఓ ‘క్విట్‌ టొబాకో’ నినాదం ప్రపంచ దేశాలన్నింటా మార్మోగాలని అభిలాషిస్తోంది. ‘పదపడి ధూమపానమున ప్రాప్తము తా నొనగూడు చేటులున్‌/ మొదలు ధనంబు వోవుట, నపుంసకుడౌట, విదాహమౌటయున్‌/ వెదకుచు జాతి హీనులను వేడుట, తిక్కట చొక్కుటల్‌, రుచుల్‌/ వదలుట, కంపుగొట్టుట, కళల్‌ తొలగించుట, రిమ్మ పట్టుటల్‌/ పెదవులు నల్లనై చెడుట, పెద్దకు లొంగుట, బట్ట కాలుటల్‌’ అంటారో కవి. డబ్బు పోతుంది, నీరసం కమ్ముకొస్తుంది, దాహం వేస్తుంది, ఓ సిగరెట్‌ ముక్క అడుక్కోవాలనిపిస్తుంది, నాలుక్కి రుచీపచీ తెలియదు, నోరూ ఊరూ కంపు కొడుతూ ఉంటుంది, పెదవులు నల్లగా వికారంగా తయారవుతాయి.. ఇన్ని అనర్థాలున్న ఆ కంపు సిగరెట్టు తాగక పోతేనేం? ‘సరదా సరదా సిగరెట్టూ.. కంపు గొట్టు ఈ సిగరెట్టూ ..’ అంటూ సిగరెట్‌పై పాట రాసిన మహాకవి శ్రీశ్రీ, ఆ పాట చివర్లో ‘దీన్ని కాల్చకోయి నాపై ఒట్టూ!’ అంటూ ముక్తాయింపు ఇస్తారు. అంతేకాదు, చుట్ట, ప్రాణం ఒక్కటే అనిపించుకున్న ఫైడల్‌ కాస్ట్రో.. తమ దేశంలో ధూమపాన వ్యతిరేకోద్యమం మొదలైన తర్వాత తన ప్రియసఖి అయిన చుట్టను విసిరేశాడట. ఇప్పుడు క్యూబాలో ధూమపానం నిషిద్ధం. చాలా పాశ్చాత్యదేశాలలో ధూమపానానికి వ్యతిరేకంగా పోరాటాలు, ప్రచారాలు, ప్రభుత్వాల సహకారాలు కనిపిస్తున్నా.. మనకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. చీమలు చేరకుండా చక్కెర డబ్బా మీద ‘కారం’ అని రాసేటటువంటి వెర్రితనం నుంచి బయటపడలేకుండా వున్నాం. రకరకాల సిగరెట్లు, చుట్టలు, బీడీలు, ఖైనీలు, జర్దాలతో దేశంలో, రాష్ట్రంలో కార్పొరేట్లకు మరిన్ని లాభాలు తెచ్చిపెడుతూ.. సహస్ర బాహువులతో పొగ మొక్క వర్థిల్లుతున్నా.. మరోవైపున ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ రొటీన్‌గా జరుపుకుంటూనే వున్నాం.

వాస్తవాలు :

  • పొగాకు పొగలో 7,000 కంటే ఎక్కువ రసాయనాలు ఉన్నాయి.
  •  దీనిలోని 69 హానికరమైన రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి.
  •  ప్రస్తుతం యుఎస్‌లో నివసిస్తున్న 560 లక్షల మంది పిల్లలు ధూమపాన సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని అంచనా.
  • అమెరికాలో ధూమపానానికి కారణమైన వ్యాధితో జీవిస్తున్న పెద్దల సంఖ్య 1.6 కోట్లు.
  •  ధూమపానం వల్ల 20వ శతాబ్దంలో మరణించిన వారి సంఖ్య.10 కోట్లు.
  •  ధూమపానం వల్ల 2017లో మరణించిన వారి సంఖ్య 80 లక్షలు.

 

  • రాజాబాబు కంచర్ల
    9490099231
➡️