మా వాడు మారాడు

Nov 26,2023 07:23 #Sneha, #Stories
saikumar sneha stories

‘వాడు ఈ జన్మకు మారడు, ఎన్నిసార్లు చెప్పినా చలనమే లేదు. చెప్పి చెప్పి నా నోరు పడిపోతోందే కానీ వాడికి మాత్రం నా మాటే లెక్కలేదు’ అంటూ ఉదయాన్నే దండకం మొదలెట్టింది సరోజమ్మ.’ఇప్పుడేమైంది పొద్దున్నే వాణ్ణి అలా తిట్టడం మొదలుపెట్టావ్‌!’ అంటూ మెల్లగా వచ్చి, కుర్చీలో కాఫీ కప్పుతో కూర్చున్నాడు పద్మనాభం.’ఇంకా ఏం జరగాలి వయసేమో పెరిగిపోతోంది.. కానీ వాడికింకా బాధ్యతలు తెలియడం లేదు. ఎంతసేపు ఆ సెల్లు పట్టుకొని ఇంట్లో కూర్చోవడమే తప్ప, ఏదైనా పనికి వెళ్లి కాసిన్ని రాళ్లు సంపాదించి.. తల్లితండ్రులకు ఆసరాగా నిలుద్దాం అన్న ఆలోచన వాడికి ఇంకా కలగడం లేదు. ఎంతసేపు నలుగురు కోతి మూకలను వెంట వేసుకొని, రోడ్లన్నీ పచార్లు కొట్టడం.. ఆనక ఇంటికి వచ్చి, చేసి పెట్టింది బాగా వంకలు పెడుతూ తిని, నిద్రపోవడం తప్ప వాడి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మీరు చేసే ఈ చిన్నాచితక ప్రభుత్వ ఉద్యోగంతో బతికేస్తున్నాం. కానీ ఇప్పటివరకు మనకంటూ సొంత ఇల్లు, వాకిలి కూడా లేవు. వీడికి ఇవన్నీ తెలుసొచ్చే సమయానికి మనం ఉంటామో లేదో. వీడు అప్పుడు ఎవరిని ఏడిపించుకుని తింటాడో’ అంటూ కంట్లో నుంచి వస్తున్న నీటి ధారను తన పమిటి చెంగుతో తుడుచుకుంటూ, మెల్లగా భర్త ఒళ్ళోకి వాలింది సరోజమ్మ.భార్య బాధను అర్థంచేసుకున్న పద్మనాభం ‘సమయం వచ్చినప్పుడు దానంతట అవే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు బాధపడి ఏం ప్రయోజనం చెప్పు. వాడు చదువు పూర్తిచేసుకుని, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ప్రయత్నం విఫలమవుతుందో ఏమో కాసింత సమయం ఇచ్చి చూద్దాం. నన్ను పెళ్లి చేసుకోకముందు నేను ఉన్న పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే. మా నాన్న డిగ్రీ చదివిన నన్ను చాలా ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్ళమని బతిమాలేవాడు. కానీ ఆయన మాట నేను ఏనాడూ చెవికి ఎక్కించుకోలేదు. అది చూడటానికి మా అమ్మ బతికి లేదు. నాకు నచ్చిన పని చేస్తానంటూ అనేక వ్యాపారాలు చేస్తూ.. లాభం చేతికొచ్చే సమయానికి భారీ నష్టాలతో జోబి ఖాళీ చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. కానీ అదంతా గమనిస్తున్న మా నాన్న నన్ను ఏనాడూ సరైన విధంగా వ్యాపారం చేయమని తన నిర్ణయాన్ని నాపై రుద్దలేదు. ఏనాడో ఒకరోజు వీడు కచ్చితంగా బాగుపడతాడు అన్న నమ్మకం ఆయనకు నా ప్రయత్నంలో కనబడింది. నేను వ్యాపారం చేసి నాలుగు రాళ్లు వెనకేసి, ఓ స్థలం కొనే సమయానికి మా నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇక అందరూ ”నాన్న గుర్తుగా నీకేం లేదు కదా!” అంటూ వెటకారంగా అంటుంటే.. ఆయన ఉద్యోగం నేను చేస్తూ ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాను. వీడు కూడా ఏదో ఓ రోజు మంచిస్థాయికి చేరుకుంటాడన్న నమ్మకం నాకుంది. నువ్వు కాస్త ఓపిగ్గా ఉండు’ అంటూ సరోజమ్మను చేయి పట్టుకుని లేపి, వంటింట్లోకి తీసుకెళ్లాడు పద్మనాభం.రవి తన ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. కానీ బయట ఉన్న పోటీ పరిస్థితుల్లో అనుకున్న స్థాయిలో సంపాదన వచ్చే ఉద్యోగాలు మొదటే దొరికే అవకాశం లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పైస్థాయికి వెళ్ళాలి తప్ప, ఒకేసారి అందలాన్ని ఎక్కి కూర్చోవాలన్న ఆలోచన కాస్త ఇబ్బందిపెడుతోంది. అతని ప్రతిభ తండ్రికి తెలుసు. కానీ ఈ కాలం ఎవరు ఎంత సంపాదిస్తున్నారన్నదే ముఖ్యం తప్ప.. ఖాళీగా కూర్చున్నవారికి అసలు ఏమాత్రం విలువ లేదు అన్నది అక్షరాలా సత్యం.

బెంగళూరులో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సుదర్శన్‌ పండగని ఊరికి వచ్చాడు. కాస్త సమయం కుదుర్చుకొని, తనకున్న పాత మిత్రులందరికీ ఓచోట కలుద్దామనుకున్నాడు. ఇంతలో అక్కడ వారి మధ్య మొదట చర్చకు వచ్చే అంశం అందరూ ఏం చేస్తున్నారని.. ఇంతలో ఒక్కొక్కరు ఒక్కో పని చెప్పుకుంటూ వచ్చారు. కానీ రవి ఇంకా ఉద్యోగ ప్రయత్నంలోనే ఉన్నానన్నాడు.’ఇంకా ఏం ప్రయత్నం రా! నేనూ నీతో పాటే కదా ఇంజనీరింగ్‌ చదివింది. నేనేమో ఒక పెద్ద కంపెనీలో మంచిస్థాయిలో ఉన్నాను. నువ్వేమో ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నావ్‌.. ఇక నీ ప్రయత్నం ఫలించేది ఎప్పుడు?’ అని సుదర్శన్‌ అనగానే అక్కడున్న వాళ్లందరూ ఫక్కున నవ్వారు. ‘నాకు మీలాగా లౌకిక జ్ఞానం లేదురా. అది ఉంటే మీ దగ్గర ఈ మాట ఎందుకు పడతాను చెప్పండి. నేను ఏదో ఒకనాడు మంచి స్థాయిలో వచ్చి, అప్పుడు ఇలాగే అందరం కలుద్దాం’ అన్నాడు రవి.’కాస్త నీ కోపం తగ్గించి, ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు’ అన్నాడు సుదర్శన్‌.’చేయడానికి ఏం లేదురా నాకు ఒకరి కింద పని చేయడం కన్నా, సొంతంగా ఒక పని చేస్తూ.. వీలైతే ఇంకొకరికి అవకాశం కల్పించడం బాగుంటుందనిపిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లినా అందరూ సలహాలు ఇస్తున్నారే తప్ప, అందుకు ఆర్థికంగా దారి చూపడం లేదు. నన్ను నమ్మి ఎవరూ ప్రోత్సహించడం లేదు’ అంటూ తన మనసులోని మాటలు బయటపెట్టాడు రవి.’అయితే నువ్వు చదివిన వైపు కాకుండా వ్యాపారం చేద్దామనుకుంటున్నావా?’ అన్నాడు సుదర్శన్‌.’అవును’ అన్నాడు రవి.’మీ ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలుసా? తెలిస్తే వాళ్ళ రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఆలోచించావా?’ అన్నాడు సుదర్శన్‌.’నేను తప్పు చేయడం లేదు అలాంటప్పుడు భయమెందుకు’ అన్నాడు రవి’అయితే రేపు నేను వెళ్లేటప్పుడు నువ్వు నాతో పాటు రా! ఒక వారం రోజులు నేను నీకు కొందరిని పరిచయం చేస్తాను. వాళ్ళు నీకేదైనా ఒక అవకాశం ఇస్తారేమో చూద్దాం!’ అంటూ రవిని సిద్ధం చేశాడు సుదర్శన్‌.

‘కాలం రివ్వున తిరుగుతోంది కొడుకు బెంగళూరులో ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చెప్పడు. నెలకోసారి మాత్రం ఇంటికొచ్చేటపుడు మా ఇద్దరికీ ఇష్టమైనవన్నీ తెస్తాడు. ఒక్క రెండురోజులు కూడా ఇక్కడ ఉండటం లేదు. మాములుగా వారానికి రెండు రోజులు సెలవులు వస్తాయి అంటారు. కానీ వీడికి మాత్రం అవేమీ ఉండటం లేదు’ అంటూ తన భాదనంతా పక్కింటి వనజమ్మతో చెప్పుకొచ్చింది సరోజమ్మ.’చేయనంతవరకు వాడేం చేయలేదని మనమే ఎత్తిపొడిచే వాళ్ళం. ఇప్పుడు వాడు ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటే.. ఇంట్లో పట్టించుకోవడం లేదని మనమే అనడం ఎంతవరకు న్యాయం సరోజ? మన బిడ్డపైన మనకు నమ్మకం ఉండాలి. వాడు తప్పు చేయనంతవరకు మన బిడ్డ బంగారం. వాడు కచ్చితంగా ఏదో ఒక మంచి పనే చేస్తూంటాడు. నువ్వు ఎందుకు ఆలోచిస్తావు?’ అంటూ అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, కాసిన్ని వేడినీళ్లు ఒళ్ళు నొప్పులు తీరడానికి ఒంటిపై పోసుకోవడానికి వెళ్తూ..వెళ్తూ.. అన్నాడు పద్మనాభం.ఇద్దరూ రాత్రి కాసింత అన్నం తిని, హాల్లో ఉన్న చెరొక మంచంపై తల పెట్టుకుని, చల్లగా వచ్చే ఫ్యాన్‌ గాలికి తలపై ముసుగు వేసుకుని.. ఆకాశం కనబడని ఇంటి పైకప్పు చూస్తూ ‘నిజంగా మనవాడు ప్రయోజకుడు అవుతాడా?’ అంది సరోజమ్మ.’తల్లికి బిడ్డలపైన ఉండాల్సింది నమ్మకం. మనం వాడి బాగును కోరుకోవాలి. అంతే తప్ప నిరంతరం ఇలా ఆలోచిస్తూ పోతే వాడి ఎదుగుదలకు మనమే మొదటి ఆటంకం అవుతాం తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండు’ అంటూ నిద్రపోమన్నట్లు సైగ చేసి, ఓ గుక్కెడు నీళ్ళు చెంబులో నుంచి తాగి, తలవాల్చాడు పద్మనాభం.

‘ఏం ఈ రోజు ఏమైంది? ఎండ ఇంటి మీద నుండి వెళ్తున్నా ఇంకా ముసుగు తన్ని పడుకున్నారు. ఈ రోజు ఆఫీస్‌ లేదా ఏంటి? ఎప్పుడూ సెలవు పెట్టమన్నా పెట్టరే, అలాంటిది ఇంకా నిద్రపోతున్నారు, లేవండి’ అంటూ పద్మనాభాన్ని తట్టింది ఆమె. అయినా పద్మనాభంలో ఏమాత్రం ఉలుకూ పలుకూ లేదు. దగ్గరికి వెళ్లి కాస్త ముసుగు పక్కకు లాగి ‘మీకే అంటూ పక్కకు జరిపింది’.ప్రశాంతమైన ముఖం, కళ్ళు రెండు మూసుకుని ఉన్నాయి. ఎప్పుడూ శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండే అతని ఛాతీ నిశ్చల ప్రశాంత మైదానంలా ఉంది. ఒక్కసారిగా గుండెలన్నీ నీరు కారిపోయాయి సరోజమ్మకు. మాటలు కరువై, కన్నీటి సముద్రం ఉప్పెనలా రెండు కన్నుల వెంబడి పట్టని దారులలో తన్నుకు వస్తోంది.ఈ విషయం దావానలంలా ఊరంతా వ్యాపించింది. కొడుకు ఆఘమేఘాలపై వచ్చేశాడు. బంధువులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జరగాల్సిన కార్యక్రమం వైపు పరుగులు తీస్తున్నారు. తల్లీ కొడుకుల నోటి నుండి ఏమాత్రం మాట రావడం లేదు. కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా ముగిసిపోయాయి.

ఆయన జ్ఞాపకాలతో ఫోటో చూస్తూ కూర్చున్న అమ్మ దగ్గరకు వెళ్ళాడు రవి. ‘అమ్మా! నేను ఇన్నాళ్లు ఏం చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా, నాన్నలాగా నాకు కూడా మంచి వ్యాపారవేత్త అవ్వాలని ఆశ.. అందుకోసం నిరంతరం ఏదేదో ఆలోచించేవాడిని, ఇంట్లో దీని గురించి చెబితే ఎక్కడ నేను చదువుకుని పనికిరాకుండా పోతానో అన్న సాధారణ తల్లిదండ్రులకు వుండే భయం తెలిసినవాడిగా మీకు నేను ఎదిగే క్రమంలో ఈ విషయం చెబుదామనుకున్నాను. నాన్న నన్ను ఏనాడూ నువ్వు ఫలానా పని చెయ్యమని అడగలేదు. నేను ఈనాడు ఒక వ్యాపారంలో బాగా సంపాదింస్తున్నాను. కానీ.. నాకు ఇక ఆ పని వద్దు, నేను కూడా ఆయన జ్ఞాపకంగా నాన్న ఉద్యోగాన్ని చేస్తూ నిన్ను చూసుకుంటా’ అన్నాడు.’మీ నాన్న గురించి నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన మనసు చంపుకొని చేసిన ఈ పని నీకు ఏనాడూ ఆయన ఇవ్వాలని అనుకోలేదు. తాను కచ్చితంగా రిటైర్మెంట్‌ అయిన తర్వాతే చనిపోతా అంటుండేవారు. నువ్వేమీ ఆయనకు గుర్తుగా ఈ పని చేయక్కరలేదు. నువ్వు మనసు చంపుకొని చేసే ఈ ఉద్యోగం వల్ల ఆయనకు ఏ మాత్రం ఆత్మ శాంతించదు’ అంటుంటే.. ఏదో చెప్పబోతున్న కొడుకును ఆపి, భుజం తట్టింది సరోజమ్మ.’ఏమైంది మీకు.. బంగారంలాంటి గవర్నమెంట్‌ ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు’ అంటూ చుట్టాలంతా అడుగుతుంటే, ‘నా బిడ్డ కన్నా బంగారమా అది’ అంది సరోజమ్మ.ఓ రోజు రాత్రి కలలో కనిపించిన భర్తతో ‘వాడు మారడు.. మారడు అంటూ ఉండేదాన్ని కదా మీతో, కానీ వాడు నిజంగా మీరన్నట్టు వాడు మారాడండి’ అంటూ కళ్ళ చెమ్మ కార్చింది సరోజమ్మ.

– సింగంపల్లి శేష సాయికుమార్‌, 8639635907

➡️