ఇదే కావాల్సింది…

Jan 7,2024 09:15 #Sneha, #Stories
sneha story

నెల్లూరు నుండి విజయవాడకు వ్యాపార నిమిత్తం పనులుంటే కొడుకు శ్రీరామ్‌తో కలసి బయల్దేరాడు రంగనాథం. కారు డ్రైవర్‌ సుందర్‌ మాటిమాటికీ బ్రేక్‌ వేస్తుంటే, రోజువలే విండో నుండి చూచాడు రంగనాథం.

14 ఏళ్ళ కుర్రాడు స్కూటీని వచ్చీరాక, ట్రాఫిక్‌ రూల్స్‌ తెలిసీతెలియక నడుపుతున్నాడు. అతనికి ముందు వెనుక ట్రాఫిక్‌ ఆగిపోయింది. వెనుక ఎక్కడో ‘ఆంబులెన్స్‌’ హారన్‌ పదే పదే మోగుతూనే ఉంది. ఎవరు ముందు దారిస్తారో చూద్దామని ప్రతిఒక్కరూ ఎదురు చూస్తున్నారేగానీ తాము ముందు దారిస్తే సరిపోతుంది గదా! అని ఎవరూ అనుకోకపోవడాన్ని 65 ఏళ్ల రంగనాథం జీర్ణించుకోలేక ఉడుక్కుంటూ నేటి తరాన్ని లోలోపల తిట్టుకుంటున్నాడు. అస్థిమితంగా సీటులో కదులుతున్న తండ్రి అసౌకర్యాన్ని, రోజువారీగా ట్రాఫిక్‌ సమస్యను తిట్టుకునే ఆయన స్వభావాన్ని గుర్తుతెచ్చుకుంటూ, ‘నాన్నా, మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. మనం రోజూ చూస్తున్నదే గదా ఇదంతా! సివిక్స్‌, సెన్స్‌లేని జనాలు పెరిగిపోయారు. మనొక్కరం ఏమి చేయగలం?’ అన్నాడు శ్రీరామ్‌.

**********************************

ట్రాఫిక్‌ పోలీసు అతికష్టం మీద ట్రాఫిక్‌ నియంత్రణ చేయగలిగాడు. అరగంట పట్టింది. ముందు ఆంబులెన్స్‌ను పంపి, తర్వాత క్రమంగా వాహనాలను పంపించాడు. ఇంతలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ చాలాసార్లు సైడు ఇవ్వమని ట్రాఫిక్‌కు అడ్డుగా బైకులను ఆపి వున్న ఇద్దరు వ్యక్తులను హెచ్చరిస్తూ హారన్‌ మోగించసాగాడు. ఆ ఇద్దరు వ్యక్తులకు చాలా కోపం వచ్చింది. ‘వీడు మనల్ని హెచ్చరిస్తాడా.. చూద్దాం పద!’ అనుకుంటూ బైకులను పక్కనపెట్టారు. ఆర్టీసీ బస్సు వెళ్ళిపోయింది. నెల్లూరు పొలిమేరలు దాటుతున్న బస్సును రెండు కార్లు వెంబడించాయి. బస్సుకు అడ్డం వచ్చి కదలకుండా చేసి, కార్ల నుండి పదిమందికి పైగా బస్సెక్కి, డ్రైవర్‌ను కిందికి లాగి, రోడ్డుపై పడేసి, ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ కొట్టసాగారు.

ప్రయాణీకులు భయంతో కేకలు వేస్తుండగా, చుట్టూతా చేరిన ప్రజలు వింతను చూసినట్లు చూస్తుంటే, ఒకరిద్దరు తమ టచ్‌ఫోన్‌తో వీడియో తీయసాగారు. ఎవ్వరూ డ్రైవర్‌ను కొట్టడాన్ని ఆపే ప్రయత్నం చేయడంలేదు. బస్సులోని ప్రయాణీకురాలు జ్యోత్స్న ‘మన సమాజం ఎటుపోతున్నది, కాకులకున్న సంఘీభావం కూడా మెదడున్న మనుషులకు లేదే, దీనినే ‘ప్రేక్షక సంస్కృతి’ అంటారు’ అని పెద్దగా అంది. ఎవరికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమె 100 నెంబర్‌కు ఫోన్‌ చేసింది. గాయాలపాలైన డ్రైవర్‌ స్పహ కోల్పోతుండగా.. జీపులో పోలీసులు వచ్చారు. డ్రైవర్‌ను కొట్టిన దుండుగులు ‘చెప్పుకోరా ఎవరికి చెప్పుకుంటావో’ అంటూ కార్లలో వెళ్లిపోయారు. డ్రైవర్‌ను ఆంబులెన్స్‌ పిలిపించి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరొక డ్రైవర్‌ రాగా బస్సు బయల్దేరింది. డ్రైవర్‌ చేత పోలీస్‌ కంప్లైంట్‌ మీద సంతకం చేయించారు. అన్ని ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాల ప్రతినిధులు విషయాన్నంతా కవర్‌ చేశారు. వీడియో తీసిన వ్యక్తి సోషల్‌ మీడియాకు తాను తీసిన వీడియోను పోస్టు చేయగా, ఆ రౌడీలెవరో గుర్తుపట్టిన పోలీసులు వాళ్ళను వెతికి పట్టుకున్నారు.

బస్సులో ఉన్న జ్యోత్స్న ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. ‘ఆ రోజు తాను గాఢనిద్రలో ఉండగా ‘హెల్ప్‌ హెల్ప్‌! నన్ను రౌడీలు తరుముకొస్తున్నారు. నేను ప్రమాదంలో ఉన్నాను’ అని ఏడుస్తూ అరుస్తున్న అమ్మాయి గొంతు వినబడుతుంటే మెలకువ వచ్చి, కిటికీలోంచి బయటకు చూస్తుంటే, ఒక అమ్మాయిని వెంబడిస్తున్న పదిమంది వరకూ రౌడీ మూక కనబడింది. తనవలెనే ఎదురింటి వారూ కిటికీలో నుండి చూస్తున్నారేగానీ బయటికి వచ్చి, ‘ఎవర్రావాళ్ళూ?’ అనలేదు. ఆ అమ్మాయిని ఎత్తికార్లో కుదేసుకుని తీసుకెళ్లడం కళ్లారా చూసి కూడా తానూ ఏమీ చేయలేకపోయానే అనే బాధ తట్టుకోలేకపోయిన జ్యోత్స్న స్పృహ తప్పిపడిపోయింది. కళ్లుతెరిచేసరికి తాను ఏదో హాస్పిటల్లో ఉన్నానని అర్థమైంది. ‘అమ్మా, రాత్రి ఆ పాపను ఎవరైనా కాపాడారా? ఏమైంది ఆ అమ్మాయికి?’ అంటూ ఏడ్చింది. ‘నువ్వు అవన్నీ మరచిపోవాలి, వాళ్ళను పట్టుకుని పోలీసులు కేసు పెట్టారంటలేమ్మా!’ అని కూతురిని హత్తుకుని, ‘నువ్వేమయిపోతావోనని అమ్మ చూడు ఎంత దిగులు పడుతున్నదో!’ అంటున్న తండ్రి సుబ్బరామయ్యను చూసిన జ్యోత్స్నకు నాన్న ఎందుకు కళ్లనీళ్లు తుడుచుకుంటున్నారో అర్థం కాలేదు.

‘పక్క రూములో పన్నెండేళ్ల పిల్ల. దానిలో ఏమి చూసి పాడు చేశారో ఆ దుర్మార్గులు. పాడుబడిన గుడి వెనుక శవంగా పడున్నదా పిల్ల. అందరూ కిటికీల్లోంచి చూశారేగానీ, ఒక్కసారి నాలుగు ఇళ్లవాళ్లు బయటికి వచ్చి గట్టిగా అరిచి వుంటే, ఆ రౌడీలు పారిపోయేవారు గదా!’ అనే మాటలు జ్యోత్స్నకు వినిపించాయి. ఒక్కసారిగా ‘అయ్యో పాపను ఎవరూ కాపాడ లేదా, ఏ నరకం అనుభవించావో తల్లీ!’ అని అన్నది. పక్కనే ఏడుస్తున్న తల్లి రోహిణి, ‘డాక్టర్‌! పాపను చూడండి’ అని అరిచింది.

అప్పుడు జ్యోత్స్న ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆమె చదువుతున్న కాలేజీలో లెక్చరర్స్‌ అందరూ సామాజిక స్పృహ కలిగించేలా తమ పాఠ్య బోధనను చేసేవారు. ‘మనం మనకోసమే గాక మన సమాజంలో జరిగే సంఘటనలపై మనసు పెట్టి ఆలోచించి, మానవత్వంతో చేయగలిగిన మేలు చేయాలి!’ అని చెబుతుండేవారు. డిగ్రీ కూడా అదే కాలేజీలో చదివింది. పీజీ పెళ్లి తర్వాత చేయవచ్చులే అని బతిమాలిన తల్లితండ్రుల మాట ప్రకారం, స్టేట్‌ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌తో వివాహానికి అంగీకరించింది. ‘ఇప్పుడే పిల్లలు వద్దు, ఎమ్‌.ఎ. చేస్తాను’ అని బతిమాలినా భర్త వినలేదు. పైగా ‘ముందు ప్రకృతి ప్రకారం నడుచుకోవాలి. ఎమ్‌.ఎ. ఎక్కడికీ పోదులే!’ అని ఒప్పించగా ఒక పాపకు తల్లి అయిన జ్యోత్స్న మరో రెండేళ్లకే మరల గర్భవతై, ఇప్పుడు ఐదవ నెలలో పుట్టింటికి వెళుతోంది. ‘వంశానికి వారసుడు పుట్టాకే నీ ఎమ్మే!’ అని మామగారి ఆదేశం!. ఇరుగుపొరుగులను పట్టించుకుంటూ, ఏదైనా అవసరమైన మాట సాయం చేస్తూ, అందరికీ తలలో నాలుకలా ఉంటున్న జ్యోత్స్న అంటే ఆ వీధిలో ఉండే మహిళలకు గురి, గౌరవం ఏర్పడ్డాయి. పెళ్ళైన నాలుగేళ్లలో రెండో బిడ్డ కూడా పుట్టబోతున్నది. ఇంకా కడుపులో ఉంది మగబిడ్డో కాదో తేల్చే పరీక్ష చేయించుకోమని వేధించడం లేదులే అని సరి పెట్టుకోసాగింది. సడన్‌గా బ్రేక్‌ వేయడంతో బస్సు ఆగింది. ఆలోచన్ల నుంచి తుళ్లిపడి, పిల్లను భర్త చేతికి అందించి, సర్దుకుని కూర్చుంది.

బస్సులో తాగగూడదు అని తెల్సినా ఒక ప్రబుద్ధుడు సిగరెట్‌ తాగుతూ రింగులు రింగులుగా పొగ వదులుతున్నాడు. తనకు, పక్కనున్న తోటి ప్రయాణీకులకు, ముఖ్యంగా పసిపిల్లలకు పొగ పీల్చి ఊపిరాడక దగ్గసాగారు. ఇక సహనం కోల్పోయిన జ్యోత్స్న, ‘ఏమయ్యా, చదువుకున్నోడిలా ఉన్నావ్‌, బస్సులో పొగ తాగకూడదని తెలియదా?’ అని గట్టిగా అంది జ్యోత్స్న. ‘అయినా ఏమిటీ మనుషులు, చేయకూడని పనులు చుట్టూతా జరుగుతున్నా వాళ్ళను అలా చూస్తూ భరిస్తారేగానీ, నిలదీయరే!’ అని గొణిగింది.’అందరూ ఓర్చుకుని వుంటే నీవేంటి, పెద్ద లోకోద్ధారణ చేసేలా ఇక్కడ నా పరువుదీస్తూ, ప్రశ్నిస్తున్నావు?’ అన్న భర్త మాటలకు రక్తం ఉడికిపోయింది. ‘అందరూ నాకెందుకులే అనుకుని పట్టనట్లుంటే, ఇలాంటి ఆగడాలు చేసేవాళ్ళు పెరుగుతుంటారనే నేనడిగాను.’ అని ధైర్యంగా చెప్పాను. చుట్టుపక్కల ప్రయాణికులు కలగజేసుకుని ‘అంతేగదయ్యా ఒక చంటిబిడ్డ తల్లి, గర్భవతి ఎంతసేపని ఓర్చుకుంటుంది, ఏమయ్యో ఆ సిగరెట్‌ పడెయ్యి. ఏమి కండక్టరూ, నీకేమీ పట్టనట్లేనా?’ అని, ఒకవైపు నుండి పెద్దాయన అరవడంతో సిగరెట్‌ తాగుతున్న యువకుడు, సిగరెట్‌ ఆర్పి, కిటికీలోంచి బయట పడేశాడు. ఇదీ తను కోరుకునే ప్రతిస్పందన, సంఘీభావం.. అని తృప్తిగా గాలి పీల్చుకుంది జ్యోత్స్న.

రంగనాథం గారి కారు రైల్వేస్టేషన్‌ చేరింది. ఎన్నెన్నో ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించి. రైల్వే స్టేషన్‌లో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం కనిపించింది. ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు కాలువల్లో పడి, మురికినీటిని ప్రవహించకుండా ఆపేశాయి. ఇదంతా చూస్తున్న సామాజిక స్పృహ గల రంగనాథం ఉడుక్కుంటూ ‘ఏమిటీ ప్రజలు, వద్దన్న పనులే చేస్తున్నారు. ఎప్పటికి మాతరం ఆశించే మార్పులు వస్తాయి? ప్లాస్టిక్స్‌ వాడవద్దు. గుడ్డసంచులు వాడండి’ అని శాస్త్రీయతను తమ ఊపిరిగా భావించే వారి ప్రచారాలు, గుడ్డసంచుల పంపిణీ.. చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్లుంది’ అనుకున్నారు రంగనాథం. ‘చదువుకున్నా లేకున్నా, బుర్రకెక్కించుకుని పాటించరే!’ అని వాపోయాడు రంగనాథం. ‘మనం ఎక్కాల్సిన ట్రైన్‌కు అనౌన్స్మెంట్‌ ఇచ్చారు, పదండి.’ అని కొడుకు శ్రీరామ్‌ తండ్రి చేయి పట్టుకుని అవతలివైపు ప్లాటుఫారమ్‌కు వెళ్ళడానికి బ్రిడ్జి ఎక్కసాగాడు. ‘ఏంటోరా, ముసలాళ్లంటే ప్రభుత్వానికి ఒక లెక్కాపక్కా ఉండదు. మా ఎల్డర్స్‌ క్లబ్‌ నుండి ముసలివారు, పిల్లతల్లుల కోసం ‘స్టేషన్‌లో లిఫ్ట్‌’ పెట్టించమని అర్జీ ఇచ్చినా, పట్టించుకోరు. బ్రిడ్జి ఎక్కలేక నాతోపాటు ఎందరు ఇబ్బంది పడుతున్నారో చూడు!’ అంటున్న రంగనాథాన్ని, కొడుకు శ్రీరామ్‌ చిన్నగా బ్రిడ్జి ఎక్కించి, అవతలి మూడో నంబరు ప్లాట్‌ఫారం వైపుకు తీసుకుని వచ్చాడు. ట్రైన్‌ రానే వచ్చింది. తాము రిజర్వ్‌ చేసుకున్న బోగీలోకి ఎక్కి, తమ సీటు నెంబర్‌లో కూర్చున్నారు. డ్రైవర్‌ వారిని ఎక్కించి, కారు తీసుకుని వెళ్ళిపోయాడు. ట్రైన్‌ కదిలింది. కాసేపు న్యూస్‌పేపర్‌ తిరగేస్తూ కూర్చున్న రంగనాథమ్‌ విసుగ్గా ఫోన్‌లో మాట్లాడుతున్న ఒక వ్యక్తి కనిపించాడు. ‘ఏమిటితను, సభ్యతా సంస్కారం లేకుండా అంత పెద్దగా మాట్లాడతాడు. ఫోన్‌ ఉందెందుకు, ఏదైనా ముఖ్య సమాచారాన్ని అందించేందుకు గదా, తమ సంభాషణ ఇతరుల చెవుల కర్ణభేరి పగిలిపోయేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? కాసేపు ఓపిగ్గా చూశాడు రంగనాథమ్‌. అదే గొంతుతో మాట్లాడుతూనే ఉన్న ఆ వ్యక్తితో, ‘ఏమి బాబూ ఫోను కాల్‌ చేసుకోవచ్చు, రిసీవ్‌ చేసుకోవచ్చు. ఇంతసేపు అంత బిగ్గరగా, నాలుగు కంపార్టుమెంట్లకు చేరేలా మాట్లాడుతున్నావేమిటి?’ అన్నాడు.’అవునండీ, అయితే ఏంటి, మీకు నచ్చినట్లు నేనెందుకుండాలి, నా ఫోను.. నా ఇష్టం! నేనెంతసేపు ఎలా మాట్లాడుకోవాలో నీవెవరు చెప్పడానికి? మేమూ నీవలెనే టిక్కెట్‌ రిజర్వు చేసుకునే ట్రైన్‌ ఎక్కాము.’ అని వాదనకు దిగాడు ఫోనులో మాట్లాడుతున్న వ్యక్తి. అతని ధోరణికి ఆశ్చర్యపోయిన రంగనాథమ్‌.. ‘ఏంటయ్యా తప్పుచేసింది గాక, వయసును కూడా చూడక ఎదిరించి, రెట్టించి మాట్లాడుతున్నావు. కనీస మర్యాద ఇవ్వకుండా’ అన్నాడు. చుట్టూతా ఉన్న ప్రయాణీకులు వింతను చూసినట్లు చూస్తున్నారేగానీ యువకుడిని వారించడం లేదు . ‘ప్రతిచోటా ఇదే పోకడ! నేనేమీ చెయ్యలేని ఒక అసమర్థునిలా సహించాలనేనా?’ నిస్సహాయంగా చూస్తూ తనలో తాను గొణుక్కుంటున్న తండ్రిని చూసిన శ్రీరామ్‌.. ‘ఊర్కో నాన్నా, సంస్కారం, సభ్యత లేనివారిని ప్రశ్నించడమే మన తప్పు! అటువంటి వ్యక్తులతో వాదనకు దిగడం వృథా!’ అన్నాడు.’నీవు ఎన్నిసార్లు నన్నిలా ప్రతిదానికీ అదుపుచేస్తావు శ్రీరామ్‌.. నాకు తలవంపులుగా ఉంది.’ ఉద్వేగంతో అన్నాడు రంగనాథమ్‌. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినలేకపోయాడు రంగనాథం. ‘శ్రీరామ్‌, మనం పక్క కంపార్టుమెంటుకు మారుదాంరా, నాకు బీపి పెరిగేలా వుంది’ అంటూ పక్కకు తూలాడు రంగనాథం!’ ‘నాన్నా, కాస్త తమాయించుకుని కొంచెం మంచినీళ్లుతాగండి’ అంటూ తాము తెచ్చుకున్న బాటిల్‌లోని నీటిని తాగించాడు శ్రీరామ్‌. తానూ లేచి నిలబడి, తండ్రి ఆనుకుని కూర్చునే ఏర్పాటుచేసి, పక్క కంపార్ట్మెంట్‌లో ఉన్న టీటీఈతో మాట్లాడి, తండ్రిని నడిపించుకుని తీసుకువెళ్లాడు. అక్కడ ఒక బెర్త్‌ ఖాళీ ఉంటే, దానిపై పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు రంగనాథం. పక్క సీటులో కూర్చుని వున్న ఒక మహిళ ‘ఎవరు మీ నాన్నగారా? ఏమయింది ఆయనకు?’ అనడిగింది. ‘అవును మేడం.. ఆయన మా నాన్నగారు’ అంటూ తాము కంపార్ట్మెంట్‌ ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పాడు.

**********************************

ఇంతలో విజయవాడ స్టేషన్‌ రానే వచ్చింది. ఎవరిపాటికి వాళ్ళు దిగిపోయారు. జ్యోత్స్న పుట్టింటికి చేరింది. భార్యను పుట్టింట్లో దింపేసి, ఆ రాత్రికే ఊరికి ప్రయాణమౌతూ ప్రభాకర్‌, ‘అత్తగారూ మీ అమ్మాయికి కడుపులో మగబిడ్డో కాదో పరీక్ష చేయించి చెప్పమన్నారు మా నాన్న!’ అన్నాడు. వింటున్న జ్యోత్స్న ‘మోసేదీ, కనేదీ నేను, ఎవరైనా నాకొక్కటే.. నేనుగా పరీక్ష చేయించుకోను’ అని నిక్కచ్చిగా చెప్పేసింది.

‘చూశారా మీ అమ్మాయి పొగరు. నీవు ఆడపిల్లనే మళ్ళా కంటే, ఇక నా వద్దకు రానవసరం లేదు’ అని చెప్పి, అత్తమామలు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ప్రభాకర్‌.

‘వద్దంటే పెళ్లి పెళ్లి అని మీ ముచ్చట తీర్చుకున్నారు. ఒకటే మగపెత్తనం అక్కడ. ఎమ్మే చేయనవసరం లేదట. వంశోద్ధారకుడిని కంటేనే నేను ఎమ్మే అనే నా కల తీర్చుకునేది అంటున్నారు’ అని కన్నీళ్లతో కుర్చీలో కూలబడింది జ్యోత్స్న.

సుబ్బరామయ్య, రోహిణీ ముఖాముఖాలు చూసుకుని ‘లేమ్మా, ముందు వెళ్లి స్నానం చేసి వచ్చి, ఎంగిలి పడు. తర్వాత అన్నీ ఆలోచిద్దాం’ అన్నారు.

నాలుగు నెలల తర్వాత పండంటి మగబిడ్డను కనింది జ్యోత్స్న. భర్త చెప్పినట్లు పరీక్షలేవీ చేయించుకోలేదు. ‘ఆడపిల్ల పుట్టింది’ అని ఫోన్‌ చేసి చెప్పింది జ్యోత్స్న.

‘చూద్దాం చూడ్డానికైనా వస్తారో లేదోనని’. ప్రభాకర్‌ గానీ, అతని తల్లితండ్రులుగానీ మాటా పలుకు లేక, వచ్చి పుట్టిన బిడ్డను చూసుకోక మౌనంగా ఉన్నారు. భర్తకు తెలియకుండా ఎమ్మే ప్రైవేట్‌గా చేయడం ఎప్పుడో ప్రారంభించింది. ఎమ్మే ఫైనల్‌ పరీక్షలను చంటిబిడ్డతోనే చదువుకుని, రాసిన జ్యోత్స్న ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యింది. ఫోను పలకరింపు కూడా లేకుండా, రాకపోకలు లేకుండా ఉన్న ప్రభాకర్‌, అత్తమామల మొండిధోరణి జ్యోత్స్నలో పట్టుదల పెంచింది. పాపను అంగన్‌వాడీ స్కూల్లో చేర్చి, బాబును తల్లి, చెల్లి చూసుకుంటుంటే, ఒక ప్రైవేట్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా చేరింది. ఒక్కపూట మాత్రమే క్లాసులు తీసుకుంటానని చెప్పింది. కాలేజీలో విద్యార్థినులకు ఆత్మస్థైర్యం నూరిపోస్తూ పాఠాలు చెప్పేది. విద్యార్థులకు సామాజిక స్పృహ, చైతన్యం, సామాజిక-జీవిత విలువలు, ప్రేక్షకపాత్ర వహించడం వలన సమాజానికి జరిగే నష్టాలు, సంఘీభావం మొదలైన విషయాలను ఉదాహరణలతో చెప్పేది. తానూ డిగ్రీ చేసిన కాలేజీ లెక్చరర్స్‌ చూపిన బాటలో నడుస్తూ, భావిపౌరులైన విద్యార్థులను ఆ బాటలోనే నడిచేలా తీర్చిదిద్దసాగింది. దానిలోనే సంతృప్తికరంగా జీవించసాగింది. ఇంటివద్ద ఇరుగుపొరుగు మహిళలను పిలిచి, అప్పుడప్పుడు చిన్నచిన్న సమావేశాలను సందర్భాన్నిబట్టి నిర్వహిస్తూ, స్త్రీలకు ముగ్గులపోటీ, ఆటలు-పాటల పోటీలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటుచేసి, వారిలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలుగజేసి, వారితో ఒక చిన్న హోమ్‌ ఫోర్స్‌ సంస్థను స్థాపించింది.

ఒకరోజు వీధిలో ఒకడిని స్థంభానికి కట్టేసి ‘జ్యోత్స్నా ఇటురా, వీడేమిచేస్తే మేము ప్రేక్షక పాత్రను వదలి, ఇలా కట్టేశామో వచ్చి చూడు.’ అని పిలిచింది పక్కవీధి జమీమ్‌.

జరిగింది ఏమిటో తెలుసుకోడానికి బయటకు వచ్చిన జ్యోత్స్న, ఒక కరెంటు స్థంభానికి 40 ఏళ్లుండే వ్యక్తిని కట్టేసున్నారు. చుట్టూ రెండువీధుల్లోని మహిళలూ పురుషులూ చేరివున్నారు. ‘ఏమి జరిగింది?’ అడిగింది జ్యోత్స్న. ‘ఈ వెధవ మా ఇంట్లో ఊయలూగుతున్న ఏడేళ్ల మహిని మాయమాటలు చెప్పి..ఏడ్చేసిందామె! మిగతా విషయాలు గుమిగూడిన వారు చెప్పగా, వాడు ఆ పాపను లైంగికంగా వేధించి, అత్యాచారయత్నం చేయబోయాడని అర్థమైంది.

‘ఆ పాపను పిలిచి ‘చెప్పుదెబ్బలు కొట్టమ్మా నీ కసితీరా’ అని కొట్టించి, ‘చెంపల మీద కొట్టండి వాడిని’ అని అరిచింది.

ఈ సంఘీభావమే మనకు కావాల్సిందంటూ.. పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి ఆ దుండగుడిని పట్టించింది. సాక్షి సంతకాలను పెట్టడానికి ఎందరో ముందుకు రావడం జ్యోత్స్నకు సంతోషం కలిగించింది.

కాలేజీలో ఓ రోజు మణిపూర్‌లో జరిగిన ఘోరాలపై పెద్ద ర్యాలీ జరిపింది. ఈ వార్త అన్ని మీడియాల్లో ప్రముఖంగా వచ్చింది. జ్యోత్స్నతో పత్రికల్లో, టివీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు వచ్చాయి. జ్యోత్స్న తన జీవిత విశేషాలనూ మీడియాతో ఆమె పంచుకుంది. టివీలో వార్తలు చూస్తున్న ప్రభాకర్‌ తల్లి, ‘ఒరే ప్రభా, ఇటురా, ఇదిగోరా నా కోడలు’ అంటే..’పక్కన పాపతోపాటు ఉన్న బాబుకు అచ్చు నా పోలికలే!’ అని ప్రభాకర్‌, అతని తండ్రి హాలులోకి వచ్చి,

టివి లో మాట్లాడుతున్న జ్యోత్స్నను, పక్కన ఇరువైపులా నిలుచున్న కూతురును, కొడుకును చూశారు. ‘అయితే జ్యోత్స్న మనతో అబద్ధం చెప్పింది. అబ్బాయి పుట్టినా, అమ్మాయేనని చెప్పి, పుట్టింట్లోనే ఉండి.. ఇదంతా చేస్తున్నది’ అన్నాడు ప్రభాకర్‌.

‘అయితేనేంటిరా నా కోడలు ఎంత పట్టుదల మనిషో! అనుకున్నవి సాధించింది. ఎమ్మే చదివి, లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరడం.. అమ్మాయి అని చెప్పి పుట్టింట్లో ఉండటం వల్లే సాధ్యమైంది.’ అనింది ప్రభాకర్‌ తల్లి.’అంతేనా ఉద్యమాలు చేస్తూ ఊర్లు కూడా తిరుగుతూ వుందిగా’ అన్నాడు మామగారు.’

అయితే ఏమిలే నాన్నా, మనింటి పాతపద్ధతులతో పెరిగిన నేను ఆధునిక యుగంలో కూడా మీరు నడచిన దారిలోనే నడచి, జ్యోత్స్నను నొప్పించాను. ఈ పోకడల నుండి మనం మారాలి నాన్నా, దేశ స్వాతంత్య్రానికి ముందున్నట్లు మీరున్నారా? 76 ఏళ్లకు ముందున్నట్లు సమాజముందా?’ మొదటిసారి నోరువిప్పి అడిగాడు ప్రభాకర్‌.

మనస్ఫూర్తిగా తన పొరబాట్లు తెల్సుకుని, జ్యోత్స్న ఇప్పుడు ప్రభుత్వ కళాశాల లెక్చరర్‌గా నెల్లూరుకు వచ్చిందని తెల్సి, ఆమె తనబిడ్డలతో ఉన్న ఇంటి అడ్రసు కనుక్కుని వెళ్లాడు. ‘ఇక నుండి నేనూ మీతోనే ఉంటాను నాన్నలూ’ అంటూ కూతురు జ్యోతిని ఎత్తుకున్నాడు. కొడుకు దీపక్‌ అమ్మ వెనుక దాక్కున్నాడు.. వచ్చిందెవరో తెలియక.

‘దీపూ మీ నాన్నగారు.. వెళ్లి ముద్దివ్వు’ అని తండ్రి వద్దకు కొడుకును పంపింది జ్యోత్స్న.

తన ఆశయాలబాటలోనే పిల్లలనూ పెంచుతూ సమాజం కోసం పనిచేయడం పరిపూర్ణ జీవితంలో భాగంగా ముందుకు నడిచింది జ్యోత్స్న.

 

  • చాకలకొండ శారద 9440757799
➡️