దుర్వాసన

Jan 21,2024 07:02 #Children, #Health Awareness, #Sneha
story on mouth smell

పిల్లలంతా కంప్యూటర్‌లో పెయింటింగ్‌ చేస్తున్నారు. కంప్యూటర్‌ సార్‌ అటూ ఇటూ తిరుగుతూ పిల్లల సందేహాలకు సమాధానాలు చెప్తున్నారు. అంతలో విరాజ్‌ రాథోడ్‌, రాజశేఖర్‌కి గొడవ జరిగి కొట్టుకున్నారు. అది గమనించిన కంప్యూటర్‌ సార్‌ పిల్లలిద్దరినీ నిలబెట్టి ‘ఎందుకు కొట్టుకున్నారని’ అడిగాడు. ‘చూడండి సార్‌, విరాజ్‌ను దూరంగా కూర్చోమంటే పక్కనే కూర్చుంటున్నాడు.’ రాజశేఖర్‌ దురుసుగా అన్నాడు.

విరాజ్‌ వైపు చూస్తూ ‘వాడి దగ్గరకు ఎందుకు వెళ్లావు? ఏమ్మన్నావు వాడిని?’ అని సార్‌ అడిగాడు. ‘లేదు సార్‌, నేనేమీ వాడి దగ్గరికి వెళ్ళలేదు. నా కంప్యూటర్‌లో ఎరేజర్‌ సరిగా పనిచేయడం లేదు. అందుకే ఒకసారి చూడమని అడిగాను. దానికే వాడు నన్ను ముసిలోడా, తొర్రివాడా అన్నాడు’ బాధగా ముఖం పెట్టాడు. ‘ఎందుకన్నావు రా’ సార్‌ కోపంగా చూశారు.

‘రాజశేఖర్‌ నోటి నుండి మాట రాలేదు.”చెప్తావా? తన్నులు తింటావా?’ గొంతు పెంచి అడిగారు.

‘నా నోట్లో పళ్ళు ఊడిపోయాయని అలా అంటున్నాడు. అది మాత్రమే కాదు నా నోట్లో నుండి దుర్వాసన వస్తోందని, నాతో ఎవరూ మాట్లాడకూడదని అందరికీ చెప్తున్నాడు.

‘ విరాజ్‌ ఏడుస్తూ చెప్పాడు. ‘పళ్ళు ఊడిపోతే ముసిలోడు అనకూడదు. వాడికి మాత్రమే కాదు ఇక్కడున్న అందరికీ పళ్ళు ఊడిపోతాయి. మీ వయసులో ఉన్నప్పుడు నాకు కూడా పళ్ళు ఊడిపోయాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉన్నాయో అంటూ తన అందమైన పంటి వరుసను చూపించారు. పుట్టిన వెంటనే ఎవరికీ పళ్ళు రావు. తొమ్మిది నెలల తర్వాత పళ్ళు వస్తాయి. కానీ అవి దృఢంగా ఉండవు. అయితే పళ్ళు మొత్తం ఒకేసారి రావు, పోవు. మొదట కొన్ని పళ్ళు వస్తాయి. ఆ తర్వాత నిదానంగా పెద్దవాళ్లు అయ్యేకొద్ది 32 పళ్ళు వస్తాయన్న మాట.

పళ్ళు అందంగా, వరుసగా, పళ్ళ మధ్యలో సందులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే చక్కగా బ్రష్‌ చేసుకోవాలి. బ్రష్‌ సరిగా చేసుకోకపోతే నోటి నుండి దుర్వాసన వస్తుంది. దానికి కారణం ఏమిటంటే.. పళ్ళ మధ్య పాచి పేరుకోవటం. ఆహార పదార్థాలు నోటిలో చిక్కుకుపోవడం వల్ల, చిగుళ్ల సమస్యలు లాంటివి అనేక కారణాల వల్ల నోటి నుండి దుర్వాసన వస్తుంది.

అది మాత్రమే కాదు మీరు ఉపయోగించే బ్రష్‌ కటువుగా కాకుండా మెత్తగా ఉండాలి. బ్రష్‌తో గట్టిగా పళ్ళను తోముకోకూడదు. ఒక పధ్ధతి ప్రకారం మెల్లగా, పైకి కిందకి అంటూ పళ్ళు శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా కటువుగా చేసుకుంటే నోటి చిగుళ్లు దెబ్బతిని రక్తం వస్తుంది. దాని వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.

వీలైతే రాత్రి పడుకునే ముందు రెండు నిమిషాల పాటు మరొకసారి బ్రష్‌ చేసుకుంటే మంచిది. అప్పటికీ మీ నోటి నుండి దుర్వాసన వస్తే అమ్మానాన్నలకు చెప్పి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ గారి దగ్గర చూపించుకోవాలి. పళ్ళు పోతే ముసిలోళ్లు అయ్యారని, ఇక మళ్లీ పళ్ళు రావని అనుకోవద్దు. మన స్నేహితులలో ఎవరైనా నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటే వారికి ఇటువంటి సూచన చేయాలి. దురుసుగా మాట్లాడకూడదు’ అని సార్‌ పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. రాజశేఖర్‌.. విరాజ్‌కి సారీ చెప్పు. ఇద్దరూ హగ్‌ చేసుకోండి అనగానే పిల్లలిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమగా హత్తుకున్నారు. ఏడుస్తూ కూర్చున్న విరాజ్‌ని పిలుచుకొని బయటకు వెళ్లి, నిజంగా విరాజ్‌ నోటి నుండి దుర్వాసన వస్తోందో లేదోనని పరిశీలించి.. రేపు మీ నాన్నను స్కూల్‌కి రమ్మన్నానని చెప్పమన్నారు. విరాజ్‌ తల్లిదండ్రులు మరుసటి రోజు కంప్యూటర్‌ సార్‌ను కలిశారు. నిన్నటి రోజున జరిగిన విషయాన్ని చెప్పాడు.’ఇలాంటి విషయాలు పిల్లల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి.

ఎన్ని రోజుల నుండి ఈ సమస్యతో బాధపడుతున్నాడో! ఇది చిన్న సమస్యే కదా! అని వదిలేయకుండా వైద్యులను సంప్రదిచండి. మంచి బ్రష్‌, పేస్టు వాడండి. పిల్లల సమస్యను మొదట గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని గుర్తించుకోండి’. అని చెప్పారు.తప్పకుండా సార్‌! వాడి సమస్యను మేము గమనించలేకపోయాము. వెంటనే వాడి బ్రష్‌, పేస్టు మార్చి చూస్తాను. అప్పటికీ సమస్య అలానే ఉంటే డాక్టర్‌ దగ్గరికి వెళ్తామన్నాడు విరాజ్‌ నాన్న. వారం రోజుల తర్వాత విరాజ్‌ పళ్ళు తళతళా మెరుస్తూ ఉండటం, రాజశేఖర్‌, విరాజ్‌ కలిసి కంప్యూటర్‌లో పెయింటింగ్‌ చేస్తూ ఉండటం చూసి కంప్యూటర్‌ సార్‌ గుండెల నిండుగా గాలి పీల్చుతూ సంతృప్తి చెందారు.

– జాని తక్కెడశిల (అఖిలాశ), 72595 11956

➡️