అమాయక తాబేలు

Jun 16,2024 08:14 #Children, #Sneha, #special story, #Stories

నరసింహపురం సమీపంలోని పెద్ద చెరువులో కొన్ని చేపలు ఉండేవి. ఒకసారి ఒక తాబేలు కొత్తగా వచ్చి ఆ చెరువులో చేరింది. అది ఇది వరకున్న చెరువులో కాలుష్యం పెరిగింది. అందువల్ల ఈ చెరువు శుభ్రంగా ఉండడం చూసి అది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఇక్కడకు వచ్చింది. ఆ చెరువు చేపలు చాలా తెలివిగలవి. తాబేలు చాలా అమాయక ప్రాణి.
ఇలా ఉండగా ఆ చెరువు సమీపంలో గల అడవిలో ఉన్న ఒకే ఒక్క కొలనును అక్కడి జంతువులు కాలుష్యం చేశాయి. దానితో ఆ జంతువులు కూడా తమ దాహాన్ని తీర్చుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లసాగాయి. మృగరాజు సింహం కాలుష్యం చేసిన ఆ జంతువులపై కోపించి మరో కొలను తవ్వించడానికి నడుం కట్టింది. అంతవరకు ఆ జంతువులను దప్పిక తీర్చుకొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లమని అది ఆదేశించింది. ఒకరోజు ఆ అడవిలో ఉండే ఒక నక్కకు దప్పిక కలిగింది. ఈ నీటి కోసం వెతుక్కుంటూ ఈ చెరువుకు వచ్చింది. దాన్ని చూసిన ఒక పెద్ద చేప ఆ నక్క జిత్తులమారి అన్న సంగతి తెలిసి అది చేపలన్నింటినీ దాక్కొమ్మని హెచ్చరించింది. అవి అన్నీ అలాగే చేశాయి.
ఆ నక్క చెరువు వద్దకు వచ్చి నీటిని తాగి అక్కడున్న తాబేలుతో ‘ఓ తాబేలా! ఇక్కడ చేపలు లేవా.?’ అని ప్రశ్నించింది. అప్పుడు ఆ అమాయక తాబేలు ‘లేకేం! ఉన్నాయి!’ అని అంది. అప్పుడు నక్క ‘మరి అవి పైకి కనబడడం లేదే..?’ అని అడిగింది. అప్పుడు ఆ తాబేలు ‘అవన్నీ నిన్ను చూసి లోపల దాక్కున్నాయి!’ అని జవాబు చెప్పింది. వెంటనే నక్క ‘ఇది అమాయక తాబేలు అని గ్రహించి దానితో ‘నేను నక్కను కాను. కుక్కను. ఆ చేపలను పైకి రమ్మను’ అని అంది. అప్పుడు ఆ తాబేలు చేపలతో ‘ఓ చేపలారా..! ఈ నక్క నక్క కాదట..! కుక్కనట..! అలా మీతో చెప్పమంది’ అని అంది. దాని మాటలకు నక్క తల పట్టుకుంది. అది తాబేలుతో ‘అయ్యో..! నేను నక్కనుగాను. కుక్కను..!’ అని తిరిగి అంది. అప్పుడు తాబేలు చేపలతో ‘మిమ్మల్ని చూడడానికి ఒక కుక్క వచ్చింది. అది నక్క కాదట. కుక్కనట’ అని తిరిగి అంది. తాబేలు మాటలకు ఆ చేపలు ‘అది కుక్క అయితే భౌ, భౌ మని మొరగడం లేదేమిటి..?’ అని అన్నాయి. అప్పుడు ఆ నక్క వాటి మాటలను విని తెలివిగా మరో కుక్క వస్తే మొరుగుతాను. ఒంటరిగా నేను ఉన్న ఎలా మొరుగుతాను. వాటిని పైకి వచ్చి చూడమని చెప్పు’ అని అంది. అది విన్న తాబేలు అవే మాటలను ఉన్నది ఉన్నట్లు ఆ చేపలకు చెప్పింది. చేపలకు ఆ నక్క ఎత్తు అర్థం అయ్యింది.
ఇంతలో ఆ నక్క దురదృష్టం కొద్దీ అక్కడికి ఒక కుక్క వచ్చింది. అది నక్కని చూసి భౌ, భౌమని మొరగసాగింది. నక్కకు కుక్క అరుపు అరవ రాలేదు. అది కోపంతో గట్టిగా ఊళ పెట్టసాగింది. అది గమనించిన చేపలు అది నక్కనే అని నిర్ధారించుకున్నాయి. వెంటనే అవి తాబేలుతో ‘ఓ తాబేలా..! సందేహం లేదు. అది నక్కనే’ అని అన్నాయి. అప్పుడు తాబేలు కూడా ‘ఔను..! అది నక్కే’ అని గట్టిగా అంది. తర్వాత చేపలు ‘శభాష్‌ తాబేలా! మాతో ఉండడం ద్వారా నీకు కూడా తెలివి పెరిగింది. అందువల్లే నీవు ఆ నక్క అరపును గుర్తించావు. చూశావా ఆ నక్క మోసం’ అని అన్నాయి. వెంటనే నక్క తన ఎత్తు పారనందుకు అక్కడి నుంచి పారిపోయింది. చేపల మాటలకు తాబేలు సంతోషించి ఆ నక్క వెళ్లిపోయింది పైకి రమ్మని పిలిచింది. అందుకే తెలివిగలవారితో స్నేహం చేస్తే మనకు కూడా తెలివి పెరుగుతుంది.

  • సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535
➡️