రాజెవరు ?

May 26,2024 09:50 #chirumuvallu, #Sneha

అనగనగా ఒక అడివి. ఆ అడివికి రాజుగా సింహం ఉండేది. మిగతా జంతువులకి ఇష్టం వున్నా లేకపోయినా సింహం ఏది చెబితే అదే చెయ్యవలసి వచ్చేది.
ఒకరోజు సింహం చనిపోయింది.
జంతువులన్నీ ఒక కొండమీద సమావేశం అయ్యాయి.
మళ్ళీ రాజు చేద్దామంటే ఆ అడవిలో ఇంక సింహాలు లేవు.
‘ఎవరు ఇప్పుడు అడవికి రాజు?’ అని జంతువులన్నీ చర్చించుకుంటున్నాయి.
పెద్దపులి లేచి నిలబడింది.
‘సింహం తర్వాత నాకే అంతటి బలమూ, ధైర్యం ఉన్నాయి.. నన్ను చూస్తేనే అందరూ భయపడతారు. మీ అందర్నీ కాపాడే శక్తి నాకే ఉంది.. ఇకమీదట నేనే మీ అందరికీ రాజు’ అని గట్టిగా గాండ్రించింది.
భయంతో అన్నీ గబగబా తలాడించాయి.
ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్న గ్రద్ద ఒకటి రివ్వుమంటూ కిందకి దిగి.. చటుక్కున అక్కడే గెంతులేస్తున్న పులిపిల్లని తన కాళ్ళతో బంధించి.. ఎగరేసుకుపోసాగింది.
పులితో సహా అన్ని జంతువులు ఎంత అరిచినా, పరుగులు తీసినా లాభం లేకపోయింది.
చెట్టు మీద నుంచి అంతా చూస్తున్న ఒక కాకి వెంటనే రెక్కలాడిస్తూ..
ఒక్క ఉదుటన ఎగిరి, గ్రద్ద వెంటపడి.. కళ్ళల్లో బలంగా ముక్కుతో పొడిచింది.
బాధగా అరుస్తూ, పులిపిల్లని వదిలేసి ఎగిరిపోయింది గ్రద్ద.
కాకిని జంతువులన్నీ అభినందించాయి.
గ్రద్ద శక్తి, కాకి తెలివి ముందు తన బలం ఎందుకూ పనికిరాలేదని తెలుసుకుని.. పులి సిగ్గుపడిపోయింది.
‘నా పిల్లని కాపాడిన కాకిని గానీ, లేకపోతే నాపిల్లనే ఎత్తుకెళ్ళిన గ్రద్దని గానీ రాజుగా చెయ్యండి!’ అని తలవంచుకుని పులి అంది.
అన్ని జంతువులూ అయోమయంగా చూస్తున్నాయి.
వయసులో పెద్దదైన తాబేలు మెల్లగా ముందుకు వచ్చింది.
‘ఇక్కడ వున్న మనందరిలోనూ కావలసినంత తెలివి, ధైర్యం ఉన్నాయి. అవసరం, అవకాశం వచ్చినపుడు అవి బయటపడతూ ఉంటాయి. కాబట్టి కేవలం ఒకర్నే రాజుగా ఎంచుకోవడం.. అందరూ అతనికింద అణిగిమణిగి ఉండడం న్యాయం కాదు. ఇకమీదట మనందరం కలసిమెలసి ఉందాం. ఎవరికి వారే రాజులా స్వతంత్రంగా ఉందాం’ అంది.
అన్ని జంతువులూ ఆనందంగా తమ అంగీకారాన్ని తెలియజేశాయి.
ఆ రోజు నుంచి ‘స్వేచ్ఛే’ అడవిలో రాజ్యమేలింది. జంతువులన్నీ ఆనందంగా జీవనం సాగిస్తున్నాయి.

స్వర్ణ శైలజ
8500632936

➡️