పరివర్తన

Jun 16,2024 10:19 #Sneha

ఒకరోజు హేమంత్‌ అనే అబ్బాయి తన స్నేహితులతో మార్కుల గురించి మాట్లాడుతున్నాడు. ‘ఒరేరు రవీ! నీకు ఎన్ని మార్క్స్‌ వచ్చాయి?’ అని అడిగితే, ‘నాకు తొంబై ఐదు’ అని చెప్పాడు రవి. అలా అందరి మార్క్స్‌ అడిగి తెలుసుకున్నాక, తనకంటే, తన స్నేహితులందరికీ ఎక్కువ మార్క్స్‌ వచ్చాయని తెలుసుకున్నాడు. ఆ బాధతో ఇంటికి తిరిగివచ్చాడు హేమంత్‌.
‘ఇంకోసారి బాగా ప్రిపేర్‌అయి, మంచిమార్కులు తెచ్చుకుందువులే!’ అని అమ్మ హేమంత్‌కి ధైర్యం చెప్పింది. హేమంత్‌ బాగా చదువుకోవాలనుకున్నాడు. కానీ, వాళ్ళ టీచర్‌ క్లాస్‌ చెప్తున్నప్పుడు తనకు తెలియకుండానే, పక్కనున్న స్నేహితులతో మాట్లాడేవాడు. ఈ పద్ధతి నచ్చక టీచర్‌ క్లాస్‌ బయట కూర్చోబెట్టేది. బయట నుండీ కూడా ఏమాత్రం శ్రద్ధ పెట్టేవాడు కాదు. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు చెప్పడం పైనే దృష్టిపెట్టేవాడు. అలానే ఏ మార్పూ లేకుండానే ఒక సంవత్సరం గడిచిపోయింది. హేమంత్‌కి మంచి మార్కులు రాలేదని వాళ్ల అమ్మ ఎంతో బాధపడింది.
తర్వాతి సంవత్సరంలో ఒకరోజు వాళ్ల స్కూల్‌కి ఒక మేజిషియన్‌ వచ్చాడు. తన మాయాజాలంతో అందరి చప్పట్లు పొందాడు. తర్వాత అతను పిల్లలతో మాట్లాడాడు. తనుకూడా చిన్నప్పుడు చదువుపై శ్రద్ధపెట్టక, స్నేహితులతో మాట్లాడడానికే ప్రాధాన్యత ఇచ్చేవాడినని, అందుకనే ఈరోజు బతుకుతెరువు కోసం కనికట్టు చేస్తూ ఉరూరా తిరుగుతూ ఉన్నానని, మీరు జాగ్రత్తగా బుద్ధిపెట్టి చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, గొప్ప స్థానానికి వెళ్లొచ్చని చెప్పాడు.
ఆ రోజు నుంచీ హేమంత్‌లో మార్పు వచ్చింది. ‘విద్యార్థిగా ఉన్నప్పుడు చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదనీ, సమయం ఎంతో విలువైనదనీ, దానిని కాలక్షేపం కోసం, ముచ్చట్ల కోసం, వీడియోగేమ్స్‌ కోసం వృథాచేయకుండా బాగా చదువుకోవాలనే’ టీచర్‌గారి మాటలు, మెజిషియన్‌ మాటలవల్ల ఎంత నిజమో తెలిసివచ్చింది.
అప్పట్నుంచి తను బాగా చదువుకోవడం, ఎవ్వరితోనూ అనవసరపు ముచ్చట్లు లేకుండా, క్లాసులు శ్రద్ధగా విని మంచి మార్కులు తెచ్చుకొని, అమ్మకి సంతోషం కలిగించాడు.
సి. లలిత్‌ శ్రీ విష్ణు శరవణ్‌,
7వ తరగతి, శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్‌, గుంటూరు
8985052188

➡️