మహిళ స్టార్టప్‌లకు నిధుల కరువు

Mar 9,2024 21:05 #Business

75 శాతం సంస్థలకు ఫండింగ్‌ కష్టాలు

ఒత్తిడిలో 6వేల మంది ఔత్సాహికవేత్తలు

న్యూఢిల్లీ : భారతదేశంలో మహిళ ఔత్సాహికవేత్తలు తమ వ్యాపారాలను కొనసాగించడానికి నిధుల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేశంలో దాదాపు 8,000 మహిళల స్టార్టప్‌ల ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ సంస్థలు 23 బిలియన్‌ డాలర్ల (రూ.1.90 లక్షల కోట్లు)ను సమీకరించాయని ట్రాక్సన్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. అయితే 6,000 వేల స్టార్టప్‌లకు నిధులు అందలేదు. ఇందులో 590 సంస్థలు 30,000 డాలర్ల (రూ.24 లక్షలు)పైగా రెవెన్యూ సాధిస్తున్నవి ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛ, సాధికారతల కోసం పోరాడుతున్న మహిళలు అన్ని రంగాల్లోనూ ఆంత్రప్రెన్యూర్స్‌గా దిగుతున్నారు. అయితే ఇప్పుడు వీరందరికీ నగదు లభ్యత ఓ ప్రధాన సవాల్‌గా ఎదురవుతుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండిస్టీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డిపిఐఐటి) గణంకాల ప్రకారం దేశంలో 1,17,254 స్టార్టప్‌లు ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో నిధుల సమీకరణ అడ్డంకులను ఎదుర్కొంటున్నామని 75 శాతం మహిళా ఔత్సాహికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల సమీకరణ సవాల్‌గా పరిణమిస్తున్నదని పేర్కొన్నారు.

2021లో 6.5 బిలియన్‌ డాలర్ల (రూ.53వేల కోట్లు) నిధులు సమకూరగా.. 2023లో కేవలం 1.1 బిలియన్‌ డాలర్ల (రూ.9వేల కోట్లు)నిధులు మాత్రమే పొందగలిగారు. ప్రస్తుత ఏడాది తొలి రెండు మాసాల్లో 112 మిలియన్‌ డాలర్ల నిధులు అందగా.. గతేడాది ఇదే కాలంలో 123 మిలియన్‌ డాలర్లను సమీకరించారు.’అత్యుత్తమ సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం 2021తో పోల్చితే 2023లో 21 నుంచి 26 శాతానికి పెరిగిందని మరో పరిశోధనలో పిక్‌మైవర్క్‌ సహ వ్యవస్థాకురాలు కాజల్‌ మాలిక్‌ తెలిపారు. సామాజిక, ఆర్థికపరమైన అవరోధాలను అధిగమించేలా మరింత చేయూతనందిస్తే మహిళా ఉద్యోగులు మరెన్నో విజయాలను సాధించగలరని అని గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా సిఇఒ యశస్వినీ రామస్వామి అన్నారు.

మహిళా ఉద్యోగులను కంపెనీలు కూడా ప్రోత్సహించాలని యెస్‌మేడమ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆంకాక్ష వైష్ణోరు పేర్కొన్నారు. మరోవైపు గడిచిన ఐదేళ్లలో దేశంలోని ఆయా కంపెనీల్లోని బోర్డుల్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య క్రమేణా పెరిగిందని డెలాయిట్‌ పేర్కొంది. ఈ క్రమంలోనే గత ఏడాది 18.3 శాతానికి వచ్చినట్టు తెలిపింది. 2018లో ఇది 13.8 శాతంగానే ఉందని తెలిపింది. అనేక మంది మహిళ ఔత్సాహికవేత్తలు మదుపరుల విశ్వాసాన్ని చూరగొనడం, వారి నుంచి నిధుల సమీకరణ పొందడంలో అనేక అడ్డంకుల్ని చవి చూస్తున్నారు. దీంతో పోటీ వ్యాపార ప్రపంచంలో మహిళా ఔత్సాహికవేత్తల సాధికారతకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

➡️