రాష్ట్రానికి నిరాశే- కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు

– వైజాగ్‌ స్టీల్‌, పోర్టులకు కోతా విభజన హామీల ఊసేలేదు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిలింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు, కేంద్ర విద్యా సంస్థలకు ఎటువంటి కేటాయింపులు లేవు. విభజన హామీల ఊసేలేదు. పైగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ పోర్టుకు కేటాయింపులు తగ్గించారు. గతంలో కేటాయించిన అరకొర నిధుల్లోనే, ఈసారి కోత విధించారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు 2023-24 బడ్జెట్‌లో రూ.683 కోట్లు కేటాయిస్తే, 2024-25 బడ్జెట్‌లో రూ.620 కోట్లు కేటాయించారు. విశాఖ పోర్టు ట్రస్ట్‌కు 2023-24 బడ్జెట్‌లో రూ.276 కోట్లు కేటాయిస్తే, 2024-25 బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించారు. వైజాగ్‌ పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కూడా రూ.168 కోట్లు కేటాయించి, సవరించిన అంచనాల్లో దాన్ని కాస్తా రూ.90 కోట్లకు కుదించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీకి కేటాయింపులు ఏమీ లేవు. సెంట్రల్‌ యూనివర్సిటీకి గత బడ్జెట్‌లో రూ.112.08 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపులేమీ లేవు. అలాగే గిరిజన యూనివర్సిటీకి గత బడ్జెట్‌లో రూ.40.67 కోట్లు కేటాయించగా, ఈసారి ఏమీ కేటాయించలేదు. కేంద్ర విద్యా సంస్థలు ఐఐటి, ఐఐఎం, ఎన్‌ఐటి, ఐఐఎస్‌ఇఆర్‌, ట్రిపుల్‌ ఐటి, ఎయిమ్స్‌ వంటి వాటికి కేటాయింపులు లేవు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమ, దుగ్గిరాజపట్నం పోర్టు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం వంటి వాటికి మొండి చెయ్యే మిగిలింది. వైజాగ్‌, విజయవాడ మెట్రోలకు సంబంధించి బడ్జెట్‌లో ఊసేలేదు. వెనుకబడిన జిల్లాల నిధుల గురించి కనీసం ప్రస్తావనే లేదు.

➡️