కష్టాల్లో కొబ్బరి రైతు

Feb 17,2024 07:49 #Coconut, #Farmers Problems, #Stories
A coconut farmer in trouble
  • మందగించిన ఎగుమతులు
  • పడిపోయిన ధర

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : జాతీయ మార్కెట్‌లో కొబ్బరి ధర భారీగా పతనం కావడంతో రాష్ట్రంలోని కొబ్బరి రైతు రైతులు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం అంబాజీపేట మార్కెట్‌లో కొత్త కొబ్బరి వెయ్యి కాయలు రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్యలో రైతుల నుంచి కొనుగోలు జరుగుతోంది. గతేడాది ఈ సీజన్‌లో రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకూ ధర పలికింది. ధర కనీసం రూ.13 వేలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. కురిడీ కొబ్బరి వెయ్యి కాయలు పాత గండేరా ధర ప్రస్తుతం రూ.12 వేలు ఉంది. గతేడాది ఈ సీజన్లో రూ.13 వేలు పలికింది. గండేరా గటగట రకం కొబ్బరి కాయలను గతేడాది రూ.11 వేలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.9 వేలకు మించి కొనుగోలు జరగడం లేదు. కురిడీ చిట్టి కాయలను గతేడాది వెయ్యి కాయలను రూ.5,500 చొప్పున కొనుగోలు జరగగా, ఈ ఏడాది రూ.4 వేల మించి ధర లభించడం లేదు. రైతులకు నేరుగా మేలు చేసే నీటి కాయల ధర భారీగా పడిపోయింది. వెయ్యి కాయలకు రూ.8 వేలు చొప్పున మాత్రమే ధర లభిస్తోంది. గతేడాది పరిమాణాన్ని బట్టి వ్యాపారులు వెయ్యి కాయలను రూ.11 వేల నుంచి రూ.13 వేలకు చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల నుంచి కొబ్బరి కాయలు కొనుగోలు చేసి వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తుంటారు. దేశీయ మార్కెట్లో డిమాండ్‌ లేకపోవటంతో పెళ్లిళ్ల సీజన్‌లోనూ వ్యాపారులు కొబ్బరి కొనుగోలుకు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో ధరలు పడిపోయని, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో దిగుబడులు భారీగా రావడంతో దేశీయ మార్కెట్లో కోనసీమ కొబ్బరికి డిమాండ్‌ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ ఎకరాకు 700 కాయలు దిగుబడి రాగా, కోనసీమ జిల్లాలో 400 కాయలకు మించి దిగుబడి రావడంలేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బహిరంగ మార్కెట్లో కాయ సైజును బట్టి రూ.25 నుంచి రూ.30 వరకూ విక్రయాలు జరుగుతున్నాయి. రైతుకు ఇందులో 50 శాతం ధర కూడా లభించడం లేదు. తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు కొబ్బరిని ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. అంబాజీపేట మార్కెట్‌ నుంచి ఫిబ్రవరి, మార్చిలో రోజుకు 25 నుంచి 30 లారీలు ఎగుమతులు జరిగేవి. ఈ ఏడాది ప్రస్తుతం పది లారీలకు మించి ఎగుమతులు జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. మరో 20 వేల ఎకరాలకు సరిపడా చెట్లు ఇళ్ల వద్ద, పొలాల గట్ల వెంబడి, కాలువ గట్లపైన సాగులో ఉన్నాయి. ఏటా 105 కోట్ల కొబ్బరి కాయల దిగుబడి వస్తుందని అంచనా. కొన్నేళ్లుగా కొబ్బరి సాగులో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రైతులు నిలకడలేని ధరలతో నిరాశ చెందుతున్నారు. గత ఐదేళ్లుగా కొబ్బరి చెట్లకు ఎర్రనల్లి, తెల్లదోమ, ఆకుతేలు, ఎండాకు తెగులు సోకుతున్నాయి. దీంతో, ఆకులు ఎండిపోయి చెట్లు జీవం కోల్పోతున్నాయి. పూతకు వచ్చిన గెలల్లో కాయలు తొలిదశలోనే రాలిపోతున్నాయి. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో దిగుబడి అవుతున్న కాయలతో పోల్చితే ఇక్కడి కాయల సైజు తక్కువగా ఉండడంతో జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గిపోతోంది. కొబ్బరి కాయల దిగుబడి తగ్గిపోవటానికి రొయ్యల చెరువులు, వినియోగిస్తున్న రసాయనాల ప్రభావం కూడా మరో కారణమని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. వెయ్యి కాయలు రూ.7 వేలకు మాత్రమే అమ్ముడవుతున్నాయి. దింపుడు, ఇతర ఖర్చులకు రూ.3 వేలు అవుతోంది. రైతుకు మిగిలేది రూ.4 వేలు మాత్రమే. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే ఆదుకోవాలి.

– ఎం.రమేష్‌ కొబ్బరి రైతు, అంబాజీపేట

పెట్టుబడి ఖర్చులూ రావడం లేదు

గండేరా కురిడీ కాయలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ.18 వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.12,500 మించడం లేదు. పెళ్లిళ్ల సీజన్‌లోనూ ధరలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడి ఖర్చులు కూడా రాక కొబ్బరి రైతులు కుదేలవుతున్నారు.

– కె.సత్యనారాయణ, కొబ్బరి రైతు, వాకల గరువు, అంబాజీ పేట

 

➡️