అసమానతల తొలగింపునకు సంపన్నులపై పన్ను

May 26,2024 08:16 #Business
  • పరిశోధనా పత్రంలో థామస్‌ పికెటి సూచన

ప్రజాశక్తి – బిజినెస్‌ డెస్క్‌ : సంపన్నులపై అతి తక్కువ స్థాయిలో పన్ను వేస్తే భారత్‌లోని ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చునని థామస్‌ పికెట్టి తదితర ఆర్థిక వేత్తల నేతృత్వంలోని వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ పేర్కొంది. రూ.10 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద కలిగిన వ్యక్తులపై వార్షిక పన్ను (ప్రోగ్రెసివ్‌ వెల్త్‌ టాక్స్‌, కాంప్రహెన్సివ్‌ టాక్స్‌) 2శాతం విధించాలని, రూ.10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్‌లపై 33 శాతం వారసత్వ పన్ను (ఇన్‌హరిటెన్స్‌ టాక్స్‌) వేయాలని సూచించింది. ఈ పన్నులు పెంచితే స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 2.7 శాతం రాబడి పెరుగుతుందని వివరించింది. ప్రధాని మోడీ పదేళ్ల పాలనాకాలంలో దేశంలో పేదలు, సంపన్నుల మధ్య భారీగా పెరిగిన అంతరాలను వివరిస్తూ… ల్యాబ్‌ ఈ సూచన చేసింది. ”ఇన్‌కం అండ్‌ వెల్త్‌ ఇన్‌ఈక్వాలిటీ ఇన్‌ ఇండియా 1922-2023” పేరుతో ల్యాబ్‌ విడుదల చేసిన నివేదికలోని వివరాలు…
దేశంలోని ఒక్క శాతం సంపన్నులపై అదనంగా వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా పేదల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చునని, సామాజిక వ్యయాన్ని పెంచడానికి ఉపయోగించవచ్చని రచయితలు, ఆర్థికవేత్తలు నితిన్‌ కుమార్‌ భర్తి, లూకస్‌ చాన్సెల్‌, థామస్‌ పికెట్టి, అన్మోల్‌ సోమంచి సూచించారు. అత్యంత సంపన్నుల కోసం సమగ్రమైన, ప్రగతిశీల సంపద పన్ను ప్యాకేజీని ప్రవేశపెట్టడం ద్వారా భారత్‌లో పెరుగుతున్న ఆదాయం, సంపద అసమానతలను పరిష్కరించవచ్చన్నారు.

రూ.100 కోట్ల ఆదాయంపై 4% పన్ను
ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత జనాభాలో అత్యంత సంపన్నులైన ఒక్క శాతం మంది దేశ ఆదాయంలో 22.6 శాతం, సంపదలో 40.1 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు. మనదేశంలో అసమానతలు అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ కంటే అధికంగా ఉన్నాయని నివేదిక వివరించింది. 2014-15 నుంచి 2022-23 మధ్య మన దేశంలో భారీగా అసమానతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ నివేదికలో నిపుణులు ‘కోటీశ్వరుల పన్ను’ను ప్రతిపాదించారు. 2022-23లో రూ.10 కోట్లు దాటిన వారు మాత్రమే చెల్లించేలా చూడాలన్నారు. ఈస్థాయి వారు దేశంలో కేవలం 0.04 శాతం పెద్దలు మాత్రమే ఉన్నారని అంచనా వేశారు. పన్ను ప్యాకేజీలో బేస్‌లైన్‌, మోడరేట్‌, అంబీషస్‌ పేర్లతో మూడు రకాల పన్నులను ప్రతిపాదించారు. బేస్‌లైన్‌ వేరియంట్‌లో రూ.10 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులపై వార్షిక పన్ను 2శాతం విధించాలి. రూ.10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్‌లపై 33 శాతం వారసత్వ పన్ను (ఇన్‌హరిటెన్స్‌ టాక్స్‌) వేయాలి. ఇది ఒక్కటే జిడిపిలో 2.7 శాతం రాబడిని పెంచుతుంది.
మోడరేట్‌ వేరియంట్‌ కింద రూ.10 కోట్ల నుండి రూ.100 కోట్ల మధ్య నికర విలువ కలిగిన వ్యక్తులపై పన్నును 4 శాతానికి పెంచాలి. ఈ విలువ కలిగిన ఎస్టేట్‌లపై 33 శాతం వారసత్వ పన్ను వేయాలి. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్‌లకు, వారసత్వ పన్నును 45 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ఈ పన్ను విధానం భారత జిడిపిలో 4.6 శాతానికి సమానమైన ఆదాయాన్ని ఆర్జించగలదు. అంబీషస్‌ పన్ను విధానంలో వ్యక్తులపై పన్ను రేట్లను 3 శాతం నుండి 5 శాతం మధ్య, ఎస్టేట్‌లపై వారసత్వాలకు 45 శాతం నుండి 55 శాతం మధ్య పన్ను పెంచాలని ప్రతిపాదించింది. దీంతో స్థూల జిడిపిలో పన్ను రాబడులు 6.1 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది.

విద్య, వైద్యం కోసం ఖర్చు..
గత 15 ఏళ్లుగా విద్యపై వ్యయం 2.9 శాతంగానే ఉంది. తాము సూచించిన పన్నులు వేస్తూ.. విద్యారంగానికి నిధులను రెట్టింపు చేస్తూ… నూతన విద్యావిధానంలో పేర్కొన్నట్టు ఆరు శాతం నిధులను కేటాయించవచ్చునని ఆ నివేదిక వివరించింది. ”సంపన్నులపై వేసే పన్నులతో వచ్చే ఆదాయాన్ని పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, విద్య, వైద్యం, ఇతర సామాజిక రంగాలలో ఖర్చు చేయాలి. తద్వారా పునః పంపిణీ విధానాలలో పెట్టుబడి పెట్టవచ్చు. తమ ప్రతిపాదిత సంపద పన్ను ప్యాకేజీలు సామాజిక రంగ వ్యయాన్ని విస్తరించడానికి, వ్యాపార అవకాశాలను సృష్టించడానికి దోహదం చేస్తాయి. బేస్‌లైన్‌ వేరియంట్‌ సంపద, వారసత్వ పన్నుల ద్వారానే ప్రస్తుత ప్రభుత్వ విద్యా వ్యయాన్ని దాదాపు రెట్టింపు చేయడానికి వీలుంది. అదే విధంగా మోడరేట్‌ వేరియంట్‌ టాక్స్‌ ద్వారా ఉమ్మడి ఆరోగ్యం, విద్యా బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేయవచ్చు.” అని రిపోర్ట్‌ పేర్కొంది. అంబీషస్‌ వేరియంట్‌ పన్నుల ద్వారా ఆరోగ్యం, విద్య, ప్రభుత్వ సంయుక్త బడ్జెట్‌ను రెట్టింపు చేయడానికి వీలుంది. పైగా అదనంగా మిగులు కూడా ఉంటుంది. ఈ పన్నుల విధానం దేశంలోని కేవలం 0.04 శాతం మంది పైనే ప్రభావం చూపుతుంది.
అగ్ర కులాలదే ఆధిపత్యం
భారత్‌లోని ఆర్థిక అసమానతలు కులాలతోనూ ఎలా సంబంధం కలిగి ఉందో ఈ రిపోర్ట్‌ విశ్లేషించింది. ”దేశంలోని అగ్ర కులాలు జాతీయ సంపదలో గణనీయమైన అసమాన వాటాను కలిగి ఉన్నాయి. భారతీయ బిలియనీర్లు ఎక్కువగా ఉన్నత కులాల క్లబ్‌గా ఉన్నారు. ఒక ప్రగతిశీల సంపద పన్ను ప్యాకేజీ విధానం తక్కువ సంఖ్యలో ఉన్న అతి సంపన్న, ఉన్నత కుల కుటుంబాలపై మాత్రమే కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ప్రతిపాదిత పన్ను విధానంతో అట్టడుగు కులాలు, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. దీని ద్వారా విపరీతమైన సంపద అసమానతలను పరిష్కరించడమే కాకుండా.. భారత్‌లోని సామాజిక, ఆర్థిక అసమానతల మధ్య దృడమైన సంబంధాన్ని బలహీనపరచడంలో ఇటువంటి పన్నులు కీలక పాత్ర పోషించనున్నాయి.” అని వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది.

➡️