వ్యవసాయ నిధులు రూ.లక్ష కోట్లు వెనక్కి : అకౌంట్స్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌ నివేదిక వెల్లడి

Jan 19,2024 10:02 #Agriculture, #Fund, #Report
  • రైతులకు, వ్యవసాయ రంగానికి తీరని ద్రోహం : ఎఐకెఎస్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్లపరంగావించడమే కార్యక్రమంగా పెట్టుకున్న మోడీ సర్కార్‌ అసలు నైజం బయటపడింది. దేశంలోని రైతుల దుస్థితి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో వుందో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖే రూపొందించిన అకౌంట్‌ ఎట్‌ గ్లాన్స్‌ నివేదిక చూస్తే అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ఈ నివేదిక ప్రకారం వ్యవసాయ మంత్రిత్వశాఖ గత ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా నిధులను ఖర్చు చేయకుండా మురగబెట్టి ఖజానాకు సరెండర్‌ చేసింది. 2022-23కు సంబంధించి ‘అకౌంట్స్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌’ పేరుతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఈ నివేదిక తయారుచేసింది. వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటిపారుదల విస్తరణ, లాభసాటి ధరలను నిర్ధారించడానికి, పరిశోధన, మద్దతు ధర కోసం రైతులు డిమాండ్‌ చేస్తున్న ఈ సందర్భంలోనే ఇంత భారీ మొత్తంలో నిధులు సరెండర్‌ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధులను తిరిగి అప్పగించిన ప్రభావం ఈశాన్య రాష్ట్రాల, షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక, షెడ్యూల్డ్‌ తెగల ఉప ప్రణాళికపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యవసాయం, పశుసంవర్ధకం, ఆహార ప్రాసెసింగ్‌పై స్టాండింగ్‌ కమిటీ ఎత్తి చూపింది. గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే సమస్య తీవ్రత అర్థమవుతుంది.

‘2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్న హరిత విప్లవం ఒక ప్రధాన పథకంగా ప్రచారం చేసింది. 2021-22లో రూ.6,747 కోట్ల కేటాయింపులు, 2022-23, 2023-24 బడ్జెట్‌లలో సున్నా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు కేటాయింపులు రూ.10,433 కోట్ల నుంచి రూ.7,150 కోట్లకు తగ్గాయి. ప్రధాన మంత్రి కిసాన్‌ సించారు యోజన కోసం 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో రూ.12,954 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2023-24 బడ్జెట్‌లో రూ.10,787 కోట్లకు తగ్గించారు. ఎంతో ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కూడా 2022-23 బడ్జెట్‌ నుంచి పెరగలేదు. కేటాయింపు రూ.60,000 కోట్లు. దాదాపు 12 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన ప్రభుత్వ వాదనను తీసుకుంటే కనీసం రూ.72,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనపై కూడా 2022-23 బడ్జెట్‌ అంచనాలు రూ.15,500 కోట్లతో పోలిస్తే 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.13,625 కోట్లు కేటాయించారు. 2022-23 సవరించిన అంచనాలలో రూ.1,500 కోట్లుగా ఉన్న ముఖ్యమైన మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ అండ్‌ ప్రైస్‌ సపోర్టు స్కీమ్‌ కోసం 2023-24 బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన కనిపించలేదు. వ్యవసాయ పరిశోధన కోసం ఉద్దేశించిన రూ.842 కోట్లకు పైగా సరెండర్‌ చేశారు.

సరెండర్‌ చేసిన మొత్తాన్ని తిరిగి కేటాయించాలి : ఎఐకెఎస్‌

గత ఐదేళ్లలో మురగబెట్టిన రూ.లక్ష కోట్లకు పైగా నిధులను తిరిగి రైతుల సంక్షేమానికి వినియోగించాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజూ కృష్ణన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ రైతులు, వ్యవసాయ ప్రయోజనాలకు ద్రోహం చేసే ఇటువంటి నేరపూరిత చర్యను క్షమించలేమని పేర్కొన్నారు. ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపదలో ఉన్న రైతుల పట్ల పూర్తి వ్యతిరేకతను, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలనే వారి అసలు ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తుందని విమర్శించారు. ఎఐకెఎస్‌ ఈ అసంబద్ధ విధానాన్ని ఖండిస్తుందని, తిరిగి నిధులను రైతుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ‘ఆపదలో ఉన్న రైతుల ఆత్మహత్యలు నిరాటంకంగా కొనసాగుతున్న తరుణంలో ఈ నేరపూరిత చట్టం వచ్చింది. వరి ఉత్పత్తిలో పెద్దయెత్తున తగ్గినట్లు నివేదికలు వస్తున్నాయి. సాధారణంగా వ్యవసాయం, అట్టడుగువర్గాల రైతుల సంక్షేమం కోసం సరెండర్‌ చేసిన మొత్తాన్ని తిరిగి కేటాయించాలి. వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

➡️