అందరి చూపు ‘పిఠాపురం వైపే’

Mar 25,2024 09:49 #Pithapuram, #YCP
  • పవన్‌ను ఓడించేందుకు వైసిపి ప్రణాళికలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతల దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతో పవన్‌కల్యాణ్‌ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఆరు నూరైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో జనసేన ఉంది. రెండు, మూడు రోజుల్లో పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి వారాహి యాత్రతో ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఇదే సందర్భంలో ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్‌కల్యాణ్‌ను ఓడించి తీరాలని వైసిపి తమ శక్తియుక్తులను కూడగట్టే పనిలో నిమగమైంది. అందులో భాగంగా అదే సామాజిక తరగతికి చెందిన ఎంపి వంగా గీతను పిఠాపురం నుంచి వైసిపి బరిలో దించింది. ఎన్‌డిఎ కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం జనసేనకు కేటాయించడం, అందులోనూ ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ స్వయంగా పోటీ చేస్తుండటంతో ఆ స్థానానికి ప్రాధాన్యత పెరిగింది. ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక తరగతికి చెందినవారు కావడంతో పోటీ రసవత్తరంగా మారినట్లేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి నుంచి పిఠాపురం టిడిపి ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ పోటీలో ఉంటారని భావించినప్పటికీ పొత్తుల నేపథ్యంలో ఆయన పోటీలో ఉండే అవకాశం లేకపోయింది. టిడిపి శ్రేణులు తీవ్ర నిరసనలు తెలపడంతో స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలిపించుకుని ఎమ్మెల్సీగా ఇస్తామని, తొలివిడతలోనే అంతకంటే ముఖ్యమైన పదవి ఇస్తామని హామీనివ్వడంతో వర్మ మెత్తబడ్డారని సమాచారం. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌తో ఆదివారం కాకినాడ, అమలాపురం, రాజమండ్రి టిడిపి పార్లమెంటు ఇన్‌ఛార్జి సుజయకృష్ణ రంగారావు, పిఠాపురం టిడిపి ఇన్‌ఛార్జి వర్మ భేటీ అయ్యారు. పిఠాపురంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పవన్‌కల్యాణ్‌కు వివరించారు. అలాగే వైసిపి సిటింగ్‌ ఎమ్మెల్యే దొరబాబుకు ఆ పార్టీ సీటు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపింది. ఆయన కొంతకాలంగా వైసిపికి అంటీ అంటనట్లుగా వ్యవహరించారు. తాజాగా దొరబాబును సిఎం వైఎస్‌ జగన్‌ సిఎంఒకు పిలిపించుకుని మాట్లాడారు. వంగా గీతను గెలిపించుకురావాలని, భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌ను ఓడించేందుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ముద్రగడ పద్మనాభంలకు బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం.

➡️