కార్యాచరణ కొరవడిన మ్యూనిచ్‌ సభ

Feb 24,2024 07:09 #Editorial

                   తోడేళ్లు-గొర్రెలను ఒక దగ్గర చేర్చి భద్రత గురించి చర్చ పెడితే ఏం జరుగుతుంది? గొర్రెలను తినేందుకే తాము పుట్టామని తోడేళ్లు, వాటి నుంచి రక్షణ కోసమే తాము ఇక్కడకు వచ్చినట్లు గొర్రెలు చెబుతాయి. ఏకీభావం కుదిరేదేనా? ఫిబ్రవరి 16-18 తేదీలలో అలాంటి ప్రహసనమే అరవయ్యవ మ్యూనిచ్‌ భద్రతా మహాసభలో జరిగింది. ప్రతి ఏటా జర్మనీలో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ఈ సమావేశాలలో అనేక దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు, రాజకీయవేత్తలు, అధికారంలో ఉన్న వారు పాల్గొంటారు. ఈ సమావేశాల తీరు తెన్నులు చూసిన వారు మ్యూనిచ్‌ నిబంధన అని సరదాగా ఒక అంశాన్ని చెప్పారు. అదేమంటే భాగస్వామిగా మారు, అందరితో సంభాషించు. అంతేగాని ఉద్బోధలు చేయకు, ఎవరినీ అలక్ష్యం చేయకు. తాజా సమావేశాల తీరు అలాగే ఉంది. ప్రపంచం నలుమూలలా భద్రతకు ముప్పు తెస్తున్న అమెరికా మొదలు తాజాగా దాని దుర్మార్గానికి, అసలు ఉనికికే ముప్పు పొంచి ఉన్న పాలస్తీనా ప్రతినిధుల వరకు ఈ సమావేశాల్లో భద్రత గురించి మాట్లాడారు. కొందరు ఉపన్యాసాలు చెబితే మరికొందరు ఆవేదన వెFలిబుచ్చారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ను గానీ ప్రపంచ వ్యవహారాల్లో నాయకత్వ పాత్రను గాని వదులుకోబోమని సెలవిచ్చింది. పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా మారి రష్యా ఉనికికే ముప్పు తెచ్చేందుకు పూనుకున్న జెలన్‌స్కీ, అతగాడికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న దేశాల ప్రతినిధులందరూ మ్యూనిచ్‌ సమావేశాల్లో కొలువు తీరి సానుభూతి ఒలకపోశారు. తమకు ప్రపంచమంతా ఆయుధాలు, అన్ని రకాల సాయం చేయాలని జెలెన్‌స్కీ ప్రసంగాలు చేశాడు. ఉక్రెయిన్‌ మిలిటరీ దగ్గర మందుగుండు సామగ్రి నిండుకుందని, రష్యా మరికొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోనుందని చెప్పటం తప్ప రెండు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని చెప్పిన వారు లేరు. తాము తటస్థులమని, స్వచ్ఛంద సంస్థ అని చెప్పుకుంటున్న ఈ సమావేశాల నిర్వాహకులు రష్యా, ఇరాన్‌లను అసలు ఆహ్వానించనేలేదు. ఏమిటంటే ఆ దేశాలకు ప్రపంచ భద్రత గురించి పట్టదు, శ్రద్ధ లేదు, అర్ధవంతమైన చర్చల మీద ఆసక్తి లేదు అని సాకులు చెబుతున్నారు. భద్రతా మండలిలో ఇజ్రాయిల్‌ దుర్మార్గాలను సమర్ధిస్తూ వీటోలు చేస్తున్న అమెరికాకు పట్టిందా? అసలు ఆ దేశాల వారేం చెబుతున్నారో వినాల్సిన అవసరం లేదా? ఈ వివక్షలోనే నిర్వాహకుల మొగ్గు ఎటువైపు ఉందో, వారిని తెర వెనుక నుంచి ఆడిస్తున్నది ఎవరో స్పష్టం అవుతోంది.

ప్రస్తుతం రష్యా జరుపుతున్న సైనిక చర్యతో ఉక్రెయిన్‌లో జనం ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం, వారికి శాంతి కావాలి. అక్కడి జనాల మీదే కాదు, దాని ప్రభావం ఏదో విధంగా ప్రపంచం మొత్తం మీద పడుతోంది. పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలు, డబ్బుతో రష్యా సేనల మీద జెలెన్‌స్కీ సేనలు పోరుతున్నాయి. గాజాలో జరుగుతున్న మారణకాండ, పాలస్తీనియన్లను పూర్తిగా అంతం చేసే దిశగా సాగుతున్న ఇజ్రాయిల్‌ దుర్మార్గం, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. భద్రత ఉక్రెేనియన్లతో పాటు పాలస్తీనా వారికి కూడా కావాలి కదా? ఎందుకీ వివక్ష? తనకు తలపెట్టిన ముప్పును తప్పించే చర్యలు తీసుకున్న మరుక్షణమే దాడులను నిలిపివేస్తామని రష్యా ఇప్పటికి ఎన్నోసార్లు ప్రకటించింది. అలాంటి మాట ఇజ్రాయిల్‌ వైపు నుంచి రాదేం. తమ దేశం మీద దాడులు చేసిన హమాస్‌ సాయుధులను అంతం చేసే పేరుతో అన్నెం పున్నెం ఎరుగని నిరాయుధులైన మహిళలు, పిల్లలను చంపివేస్తున్నారు, మొత్తం నివాసాలను నేలమట్టం చేస్తున్నారు, జనాల్ని అటూ ఇటూ తరుముతూ ఆకలి, రోగాలతో మాడ్చి చంపుతున్నారు. తాను ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహును వ్యతిరేకిస్తాను అదే సమయంలో గాజాల్లో జరుపుతున్న దాడులను సమర్ధిస్తాను అని ఇజ్రాయిల్‌ నుంచి వచ్చిన ప్రతినిధి చెబితే తప్పన్నవారు ఒక్కరూ లేరు. ఒక్క గాజానే కాదు, సూడాన్‌ తదితర ప్రాంతాల్లో తలెత్తిన ఏ సంక్షోభమూ ఈ సమావేశాల్లో చర్చకే రాలేదు. వచ్చామా, తిన్నామా, తాగామా ముందే నిర్ణయించుకున్న ప్రకారం కొందరి మీద రాళ్లేశామా అన్నట్లుగా వచ్చిన వారి తీరు ఉంది అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాల దుష్ట క్రీడలతో ప్రపంచంలో రోజూ ఏదో ఒక మూల అశాంతి, అభద్రత తలెత్తుతూనే ఉంది. రోజు రోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. నిజంగా ప్రపంచ భద్రతను కోరుకుంటున్న దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ మొత్తం మీద ధోరణిని వర్ణిస్తూ ఇది వరుస తప్పిన ప్రపంచ సమావేశం అన్న ఒకరి వ్యాఖ్య ఎంతో సముచితంగా ఉంది.

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️