బాబోయ్ చదువు ‘కొన’లేం..!

Apr 16,2024 08:19 #AP Education
  • స్కూల్‌, ఇంటర్‌ ఫీజులపై తల్లిదండ్రుల ఆందోళన
  • ఎల్‌కెజి ఫీజు సైతం రూ.30 వేలు పైనే
  • ఇంటర్‌ డేస్కాలర్‌కు రూ.70 వేలు, హాస్టల్‌కు రూ.2.50 లక్షలు
  •  ఏ స్కూల్లోనూ కనిపించని ఫీజుల డిస్‌ప్లే బోర్డు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వెయ్యి వరకూ ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యనందించడంలో పాలకులు విఫలమవ్వడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్లలో చేర్చేందుకు మక్కువ చూపుతున్నారు. ఇదే అదునుగా ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యం దోపిడీకి అంతూపొంతూలేకుండా పోయింది, సాధారణ కాన్వెంట్‌లో సైతం ఎల్‌కెజికి రూ.20 వేలుపైనే వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ స్కూళ్లలో అయితే ఎల్‌కెజికి రూ.50 వేల వరకూ గుంజుతున్న పరిస్థితి. తరగతులు పెరిగే కొద్దీ ఫీజుల బాదుడు పెరుగుతోంది. స్కూల్‌ స్థాయిలోనే ఐఐటి అంటూ భారీగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలకు చదువు కోసం ఏడాదికి తక్కువగా లెక్కించినా రూ.రెండు లక్షల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి పిల్లల చదువులు పెనుభారంగా మారాయి. ప్రతిస్కూళ్లలోనూ ఫీజులకు సంబంధించిన వివరాలను డిస్‌ప్లే చేయాలని నిబంధన ఉన్నప్పటికీ ఎక్కడా అది జరగడం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల నుంచి రూ.వేలు, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రయివేటు స్కూళ్లలోని సౌకర్యాలపైనే అధికారుల తనిఖీలు అనేవి లేకుండా పోయాయి. బుక్స్‌, బెల్టు, బ్యాగులు వంటివిసైతం స్కూళ్లలోనే విక్రయిస్తున్నారు. స్కూళ్లలో విక్రయించే వస్తువులనే కొనుగోలు చేయాలన్న నిర్బంధం పెడుతున్నా అడిగేనాథుడే లేకుండా పోయాడు. ఇదంతా బహిరంగానే జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రయివేటు స్కూళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజానీకం తమ పిల్లలను చదివించుకునేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. చదువుల కోసం ఉన్న ఇల్లు, బంగారం వంటి వాటిని తెగనమ్ముకోవాల్సి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలల్లో నాణ్యమైన విద్యనందిస్తే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేది. కానీ పాలకులు అటువైపు కనీసం దృష్టి సారించని పరిస్థితి నెలకొంది. ప్రయివేటు స్కూళ్ల దోపిడీపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇంటర్‌ విద్యలో ఫీజుల దోపిడీ
ఇంటర్‌ విద్య పేరుచెబితే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లో ఫీజులు చూసి ఖంగుతింటున్నారు. డేస్‌ కాలర్‌కు కనీసంగా రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, ఇతర ఫీజుల పేరుతో మరో రూ.20 వేల నుంచి రూ.30 వేలు లాగేస్తున్నారు. డేస్‌ కాలర్‌గా చదివిస్తే విద్యార్థికి ఏడాదికి రూ.లక్షల వరకూ ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హాస్టల్లో చేరితే రూ.రెండున్నర లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఇందులో ఎంసెట్‌, జెఇఇ మెయిన్స్‌, ఐఐటి అంటూ ఫీజుల బాదుడు కొనసాగిస్తున్నారు. బాగా చదివే విద్యార్థులను తక్కువ ఫీజుకు చేర్చుకుని వారు సాధించిన ర్యాంకులను ప్రచారం చేసుకుంటూ భారీగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంత పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు ఉంటున్నాయో కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంటర్‌ విద్యను చెప్పించాలంటే తల్లిదండ్రులు ఉన్న ఆస్తులను సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేయడం కారణంగా ప్రయివేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి జనాన్ని పీడించుకుతింటున్న పరిస్థితి నెలకొంది.

➡️