పందెం కోళ్లు రె’ఢీ’

Dec 31,2023 11:11 #Bet chickens
  • బరుల ఏర్పాటుకు సన్నాహాలు
  • ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ బరులు
  • గతేడాది 200పైనే బరుల్లో పందేలు
  • చేతులు మారిన రూ.250 కోట్లు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి  :   సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జూదరులు కోడిపందేల నిర్వహణకు సై అంటున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో రాజకీయ బరులు రెడీ అవుతున్నాయి. గతేడాది మాదిరిగానే ఎక్కడికక్కడ బరులు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కొన్నిచోట్ల భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతల సమక్షంలో ఈ పందేల నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే కొందరు స్థానిక ఎంఎల్‌ఎలు, నేతల నుంచి నిర్వాహకులు అన్ని రకాలుగా మద్దతు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బరులకు సంబంధించి భారీ మొత్తంలో మామూళ్లు కూడా సమర్పించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, మలికిపురం, సఖినేటిపల్లి, పి.గన్నవరం, రావులపాలెంలో ఈ ఏడాది భారీ బరుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీటికి అనువైన స్థలాలను నిర్వాహకులు ఎంపిక చేసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. కాకినాడ జిల్లాలో పిఠాపురం, గొల్లప్రోలు, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, తొండంగి, కరప, కాజులూరు మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు, కొవ్వూరు, గోకవరం, రాయవరం తదితర ప్రాంతాల్లో బరుల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నూతన సంవత్సర వేడుకలు కూడా కొన్ని ఈ బరుల ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు అనుమతులు తీసుకున్నట్టు సమాచారం.

చేతులు మారనున్న రూ.కోట్లు

సంక్రాంతి పండగ మూడు రోజులూ పలు ప్రాంతాల్లో ప్లడ్‌ లైట్ల వెలుతురులో కూడా కోడిపందాలు జోరుగా సాగుతాయి. ఒక్కో బరి వద్ద రోజుకి 20 రౌండ్లలో కోడి పందేలు జరుపుతారు. ఒక్కో రౌండ్‌కు చిన్న బరుల్లో రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు, పెద్ద బరుల్లో రూ.5 నుంచి 20 లక్షలు, రాష్ట్ర స్థాయి బరుల్లో రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు చేతులు మారతాయి. గత సంక్రాంతికి రూ.250.కోట్లకుపైగా నగదు చేతులు మారింది. గత సంక్రాంతికి భీమవరం, కోనసీమ జిల్లా, హైదరాబాద్‌, బెంగళూరు, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల నుంచి సైతం పందేల్లో పాల్గొనేందుకు  పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాకినాడ రూరల్‌, తాళ్లరేవు బరుల వద్దకు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, సినీనటులు హాజరై పందేల్లో పాల్గొన్నారు.

ఊపందుకున్న పందెం కోళ్ల అమ్మకాలు 

సంక్రాంతి సందర్భంగా పందెం కోళ్ల అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఎక్కువగా జగ్గంపేట, ఏలేశ్వరం, కోటనందూరు, కోనసీమలో రావులపాలెం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తూర్పుగోదావరిలో నిడదవోలు, కొవ్వూరుల్లో ఎక్కువగా పందెం కోళ్ల పెంపకందారులు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం నుంచే ఈ కోళ్ల పెంపకంలో వారు బిజీ అయ్యారు. ప్రస్తుతం సీజన్‌ కావడంతో కోళ్లను విక్రయిస్తున్నారు. ఒక్కో పందెం కోడి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ విలువ చేసేవి ఉన్నాయని పెంపకందారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లోనే ఎక్కువగా కోళ్లు అమ్మకాలు ఉంటాయని, తమ వద్దకు రాజకీయ నాయకులు సైతం పందెం కోళ్ల కోసం వస్తుంటారని నిర్వాహకులు చెబుతున్నారు.

➡️