బిల్లులు..వచ్చేలా లేవు..!

Jan 26,2024 11:29 #Bills
  • చేసిన పనులకు చెల్లింపులు చేయండి మహాప్రభో..!
  • ఎన్నికల్లో గట్టెక్కుతామని వేడుకోలు
  • అధికారులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు
  • ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి మొర

ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : ‘ఎన్నికలొచ్చాయి.. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి… ఇస్తే ఎన్నికల సమయంలో ఖర్చులకైనా వస్తాయి… బిల్లులు చెల్లించండి మహాప్రభో’.. అంటూ ముఖ్య ప్రజాప్రతినిధులే ఫైళ్లు పట్టుకుని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన వచ్చిన సందర్భంగానూ కొంతమంది ఎమ్మెల్యేలు బిల్లులివ్వమని అడగటం గమనార్హం. ఇప్పుడు రాకపోతే ఎన్నికల అనంతరం పరిస్థితి ఏ రకంగా ఉంటుందోనన్న గుబులు పనులు చేసిన నాయకుల్లో నెలకొంది. వైసిపి అధికారంలోకి వచ్చాక చాలా కాలం పనులు ముందుకు నడవలేదు. ప్రధానంగా 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనులు చేశారు. అయితే 2019 ఎన్నికల అనంతరం టిడిపి కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులను నిలిపివేసి ఉన్నారు. ఇప్పటికి వారి బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ తరువాత వైసిపి ప్రభుత్వ హయాంలో రహదారులు, సచివాలయాలు, విలేజ్‌ క్లీనిక్‌లను, రైతు భరోసా కేంద్రాలు ఇలా వివిధ రకాల పనులను వైసిపి నాయకులు, కార్యకర్తలు చేశారు. రహదారులు వంటి పెద్ద పనులైతే నేరుగా ప్రజాప్రతినిధులే చేశారు. వీటి బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒకటి, రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా రానుంది. నోటిఫికేషన్‌ వచ్చాక బిల్లులు చెల్లింపులు దాదాపుగా నిలిచిపోతాయి. ఆ తరవాత ప్రభుత్వంలో ఏదైనా మార్పులు, చేర్పులు జరిగితే బిల్లుల పరిస్థితి ఏమిటన్న గుబులు ఇప్పుడు వైసిపి నేతల్లో నెలకొంది. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలపైనా ఒత్తిడి పెంచుతున్నారు. వెంటనే బిల్లులు మంజూరు చేయించాలని కోరుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. బిల్లులు చెల్లించాలని అధికారులతోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పుట్టపర్తికి విచ్చేసిన సందర్శంగానూ ఇద్దరు ప్రజాప్రతినిధులు కలసి రూ.ఎనిమిది కోట్లు, రూ.50కోట్ల బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అదే విధంగా మరో ఎమ్మెల్యే తాను కాంట్రాక్టు చేస్తున్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల కోసం తిరుగుతూనే ఉన్నారు. టిక్కెట్టు దక్కని మరో ప్రజాప్రతినిధికి సంబంధించి కూడా బిల్లులు పెద్దఎత్తునే పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా వైసిపి నాయకులు, కార్యకర్తల్లో బిల్లుల గుబులు నెలకొంది. కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఆ బిల్లులు రాకపోతే తరువాత పరిస్థితి ఏమిటన్న గుబులు వారిలో కనిపిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు డబ్బులు వెనకేసుకుందామంటే ఈ రకంగా బుక్‌ అవుతున్నామోనని భయడుతున్నారు. వీరి గుబులు చూసి ఎమ్మెల్యేల్లోనూ ఆందోళన నెలకొంది. కార్యకర్తలు తమను నమ్మి పనులు చేశారు. ఇప్పుడు రాకుండాపోతే వారు పూర్తిస్థాయిలో నష్టపోతే తరువాత వారిచేత ఎన్నికల్లో ఏ రకంగా పని చేయించుకోగలమని దిగులు చెందుతున్నారు.

➡️