జనం సొమ్ముతో బిజెపి భజన

May 22,2024 08:57 #BJP bhajan, #people's money

-సిబిసి తీరుపై విమర్శల వెల్లువ
– 113 రోజుల్లో రూ.39 కోట్ల వ్యయం
ముంబయి : కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సిబిసి) సార్వత్రిక సమరం వేళ సంఫ్‌ు పరివార్‌ సేవలో మునిగితేలుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ గొప్పదనాన్ని కీర్తిస్తూ జనం సొమ్ముతో బిజెపికి భజన చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు మోడీ గురించి గొప్పలు చెబుతూ గూగుల్‌ యాడ్స్‌ కోసం సిబిసి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడం విమర్శలకు బలం చేకూర్చుతోంది. గత నవంబరులోనే దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. అదే అదనుగా భావించిన బిజెపి ప్రభుత్వ సంస్థ అయిన సిబిసి ద్వారా భారీ స్థాయిలో రాజకీయ ప్రకటనలు గుప్పించడం ప్రారంభించింది. ‘మోడీ కీ గ్యారంటీ’ అనేది మోడీ వ్యక్తిగత హామీ. కానీ దానికి సిబిసి ప్రచారం కల్పించింది. మోడీ కీ గ్యారంటీ అనే ట్యాగ్‌లైన్‌తో నవంబర్‌ మూడో వారం నుండే గూగుల్‌లో బిజెపి ప్రచారం ప్రారంభించింది. అదే సమయంలో మరో సంస్థ దాదాపు అదే తరహా ప్రచారం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం మొదలు పెట్టింది. దానికి ‘మోడీ సర్కార్‌ కీ గ్యారంటీ’ అని పేరు పెట్టింది. అయితే కొన్ని నెలల పాటు కొనసాగిన ఆ వీడియో ప్రకటనలో మోడీ గ్యారంటీ అనే చెప్పుకున్నారు.
కాంగ్రెస్‌ ఫిర్యాదు
సిబిసి ప్రకటనలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఆ సంస్థ పాలక పక్షం ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ మార్చి 22న ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. బిజెపి ప్రచారం కోసం ప్రజాధనాన్ని ఉపయోగించడంపై అల్‌ జజీరా ఛానల్‌ విచారణ చేపట్టింది.
రికార్డు స్థాయిలో సిబిసి ఖర్చు
సుమారు నాలుగు నెలల వ్యవధిలోనే గూగుల్‌ ప్రకటనల కోసం సిబిసి రూ.38.7 కోట్లు ఖర్చు చేసిందని అల్‌ జజీరా తేల్చింది. నవంబరులో ఆన్‌లైన్‌ వేదికపై ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టిన ఆ సంస్థ మార్చి 15 వరకూ దానిని కొనసాగించింది. అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో ఈ ప్రచారానికి బ్రేక్‌ పడింది. ఆ కాలంలో గూగుల్‌లో ప్రకటనల కోసం అధిక మొత్తం వెచ్చించిన సంస్థగా సిబిసి రికార్డు సృష్టించింది. మొత్తంగా 113 రోజుల పాటు సిబిసి ప్రచారం కొనసాగింది. రెండో స్థానంలో ఉన్న బిజెపి రూ.31.4 కోట్లు ఖర్చు చేసింది. 2018 జూన్‌ నుండి ఈ ఏడాది మార్చి 15 వరకూ…అంటే సుమారు ఆరు సంవత్సరాల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన ప్రకటనల ఖర్చు రూ.27.5 కోట్లతో పోలిస్తే కేవలం 113 రోజుల్లో సిబిసి పెట్టిన వ్యయం 41% అదనం.
మోడీ కీ పరివార్‌ వెనుక…
సిబిసి ఇచ్చిన అనేక ప్రకటనలు నినాదాలతో నిండిపోయాయి. అవన్నీ బిజెపికి ప్రచారం చేసిపెట్టే సందేశాలే. తటస్థంగా ఉండాల్సిన ప్రభుత్వ సంస్థలను బిజెపి తన ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని విమర్శలచ్చినా..మోడీ సర్కార్‌ తన వైఖరి మార్చుకోకుండా హద్దు మీరి ప్రజల సొమ్ముతో తన ప్రచారపర్వం కొనసాగిస్తోంది. ప్రధానికి ఓ కుటుంబం అంటూ ఏదీ లేదని, ఆయన తన భార్యను వదిలేశారని, పిల్లలు లేరని మార్చిలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. సంసారం కష్టాలు ఆయనకు తెలియవని, అందువల్లే ధరలు పెంచేస్తూపోతున్నారంటూ లాలూ అప్పట్లో మోడీకి చురకలంటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆఘమేఘాలపై స్పందించిన బిజెపి నేతలు తమ సామాజిక మీడియా ప్రొఫెల్స్‌ను మార్చేశారు. తమ పేర్ల పక్కన ‘మోడీ కీ పరివార్‌’ (మోడీ కుటుంబం) అని చేర్చారు. ఇప్పుడు ఎన్నికల సమరంలో సిబిసి అదే నినాదంతో మోడీకి, బిజెపికి పరోక్ష ప్రచారం చేస్తుండటం గమనార్హం.
వ్యక్తిగత ప్రకటనల కోసం…
‘మోడీ కీ గ్యారంటీ’ పేరుతో సిబిసి ప్రకటనలు విడుదల చేసింది. యూట్యూబ్‌, గూగుల్‌ యాడ్స్‌లో కూడా ‘మోడీ కీ పరివార్‌’ పేరిట ప్రకటనలు ఇచ్చింది. ఈ వ్యక్తిగత ప్రకటనల కోసం సిబిసి పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. సాయుధ దళాలతో కలిసి మోడీ దీపావళిని జరుపుకున్నట్లు మార్చి 9న ఓ ప్రకటన వచ్చింది. ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రకటన కోసం సిబిసి రూ.5.50 లక్షలు ఖర్చు చేసింది. తొలి దశ పోలింగ్‌కు వారం రోజుల ముందు బిజెపి తన ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. అందులో మోడీ ఫొటో, కాషాయ రంగులు, మోడీ కీ గ్యారంటీ నినాదం ఉన్నాయి. ప్రజాధనంతో సిబిసి ఇచ్చిన ప్రకటనల్లో ఇవన్నీ ఉన్నాయి.
బిజెపి ముందస్తు కుయుక్తులు
ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ ప్రయోజనాలను ప్రచారం చేయకూడదని, అవి విధిగా ప్రభుత్వ కర్తవ్యాలకు సంబంధించినవై ఉండాలని 2015లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ బిజెపి ప్రభుత్వం దీనిని ఖాతరు చేయడం లేదు. 2023 మేలో…అంటే సార్వత్రిక సమరానికి సంవత్సరం ముందు మోడీ ప్రభుత్వం సిబిసి బడ్జెట్‌ను ఏకంగా 275% పెంచేసింది. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు తమ ప్రకటనలు, ప్రచార బడ్జెట్‌లో 40% విధిగా సిబిసి కి ఇవ్వాలని నిర్దేశించింది. తద్వారా ఎన్నికల సంవత్సరంలో ఆ సంస్థ ఆర్థిక వనరులను బాగా పెంచింది. వార్తా పత్రికలు, టీవీ, రేడియో, ఔట్‌డోర్‌ ప్రకటనలకే పరిమితమైన సిబిసి , గూగుల్‌ వంటి డిజిటల్‌ వేదికలను కూడా ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ గత సంవత్సరం నవంబరులో ప్రభుత్వం నూతన డిజిటల్‌ ప్రచార విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో డిజిటల్‌ వేదికల్లో ప్రచార ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇవన్నీ బిజెపి ముందుస్తు కుయుక్తులే.

➡️