బిజెపికే కోట్ల సమర్పణ

Mar 23,2024 11:18 #BJP, #Crores, #offering
  • ఎలక్టోరల్‌ బాండ్లు కొన్న తొలి పది కంపెనీల నుంచి అత్యధిక భాగం కమలం పార్టీకే
  • రూ.34.5 కోట్లు అందజేసిన శరత్‌ చంద్రారెడ్డి, ఆయన కంపెనీ అరబిందో

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపికి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా మొత్తం 487 మంది విరాళాలు ఇవ్వగా, మొదటి 10 మంది రూ. 2,119 కోట్లు ఇచ్చారు. ఇది 2019 ఏప్రిల్‌ నుండి ఎన్‌క్యాష్‌ చేయబడిన రూ.6,060 కోట్ల పార్టీ ఎలక్టోరల్‌ బాండ్లలో 35 శాతం. ఇది అన్ని పార్టీల కంటే అత్యధికం.
అరబిందో నుంచి బిజెపికి నిధులు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శరత్‌ చంద్రారెడ్డి, ఆయన కంపెనీ అరబిందో రూ.34.5 కోట్లు బిజెపికి అందజేసింది. అరబిందో కంపెనీ బిజెపికి రూ.30 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో 2022 నవంబర్‌ 10న అరెస్టు అయిన అరబిందో కంపెనీ డైరెక్టర్‌ పి.శరత్‌ చంద్రా రెడ్డి, తనను అదుపులోకి ఐదు రోజుల్లో (నవంబర్‌ 15) బిజెపి రూ.5 కోట్లు విలువ కలిగిన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేశారు. ఆ మొత్తాన్ని 2022 నవంబర్‌ 21న బిజెపి క్యాష్‌ చేసుకుంది. విడుదల తరువాత 2023 నవంబర్‌ 8న బిజెపికి మరో రూ. 25 కోట్లను అరబిందో కంపెనీ ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసింది.
అరబిందో ఫార్మా కంపెనీ 2021 ఏప్రిల్‌ నుంచి 2023 వరకు రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయగా, అందులో రూ.34.5 కోట్లు (66 శాతం) బిజెపికి వెళ్లాయి. శరత్‌ రెడ్డిని ఇడి అరెస్ట్‌ చేయక ముందు అరబిందో ఫార్మా కూడా బిఆర్‌ఎస్‌కి రూ.15 కోట్లు (29 శాతం), టిడిపికి రూ.2.5 కోట్లు విరాళంగా ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది. శరత్‌ చంద్రారెడ్డి స్టేట్‌ మెంట్‌తోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ను ఇడి అరెస్టు చేసింది.

అత్యధికంగా బాండ్లు కొనుగోలు చేసి, బిజెపికి ఇచ్చిన కంపెనీలు

  • మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌), దాని అనుబంధ సంస్థ వెస్ట్రన్‌ యుపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ రూ.1,186 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. అందులో బిజెపికి 56 శాతం (రూ. 664 కోట్లు) లభించాయి. బిజెపికి వచ్చిన మొత్తం నిధుల్లో దాదాపు 11 శాతం మేఘా నుంచే అందాయి. బిఆర్‌ఎస్‌కి రూ.195 కోట్లు, కాంగ్రెస్‌కి రూ.128 కోట్లు, డిఎంకెకి రూ. 85 కోట్లు, టిడిపికి రూ. 48 కోట్లు, వైసిపికి రూ. 37 కోట్లు, జనసేన పార్టీ (రూ. 14 కోట్లు), జెడియుకి రూ. 10 కోట్లు, జెడిఎస్‌ కి రూ. 5 కోట్లు ఇచ్చింది.
  • రిలయన్స్‌ అనుబంధ క్విక్‌ సప్లై చైన్‌ సంస్థ రూ. 410 కోట్ల విలువైన బాండ్‌లను కొనుగోలు చేసింది. ఆ మొత్తంలో రూ. 375 కోట్లను బిజెపికి విరాళంగా ఇచ్చింది. రూ.25 కోట్లు శివసేనకు, మిగిలిన రూ.10 కోట్లను ఎన్‌ సిపికి విరాళంగా ఇచ్చింది.
  • కలకత్తాకు చెందిన కెవెంటర్‌ గ్రూప్‌, దాని నాలుగు అనుబంధ సంస్థల కెవెంటర్‌ ఫుడ్‌పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, ఎమ్‌కెజె ఎంటర్‌ప్రైజెస్‌, మదన్‌లాల్‌ లిమిటెడ్‌, సస్మాల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.616.92 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో రూ.351.92 కోట్లు (57 శాతం) బిజెపి ఖాతాలోకి వెళ్లాయి. కాంగ్రెస్‌కు రూ.160.6 కోట్లు, టిఎంసికి రూ. 65.9 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ.10 కోట్లు, బిఆర్‌ఎస్‌ కి రూ. 10 కోట్లు, బిజెడికి రూ. 10 కోట్లు, ఆప్‌ కి రూ.7 కోట్లు, జెఎంఎంకి రూ. 1 కోటి, శిరోమణి అకాలీదళ్‌ కి రూ. 0.5 కోట్లు ఇచ్చింది.
  • భారతి గ్రూప్‌, దాని మూడు అనుబంధ సంస్థలు భారతి ఎయిర్‌టెల్‌, భారతి టెలిమీడియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ రూ. 247 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేయగా, బిజెపికి రూ. 236.4 కోట్లు (98 శాతం) విరాళంగా ఇచ్చింది. మిగిలిన రెండు శాతం కాంగ్రెస్‌, జనతాదళ్‌ (యునైటెడ్‌), నేషనల్‌ కాన్ఫరెన్స్‌, రాష్ట్రీయ జనతాదళ్‌, శిరోమణి అకాలీదళ్‌లకు ఇచ్చింది.
  • మైనింగ్‌ మేజర్‌ వేదాంత రూ.400.35 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది, అందులో బిజెపికి రూ.230.15 కోట్లు విరాళంగా ఇచ్చింది. మిగిలినవి కాంగ్రెస్‌కు రూ. 125 కోట్లు, బిజెడికి రూ.40 కోట్లు, జార్ఖండ్‌ ముక్తి మోర్చా రూ. 5 కోట్లు, టిఎంసికి రూ. 0.2 కోట్లు విరాళంగా ఇచ్చింది.
  • ఆదిత్య బిర్లా గ్రూప్‌, దాని అనుబంధ సంస్థలైన ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండిస్టీస్‌, ఉత్కల్‌ అల్యూమినా ఇంటర్నేషనల్‌, బిర్లా కార్బన్‌, బిర్లా ఎస్టేట్స్‌ మొత్తం రూ.476.8 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఇందులో బిజెపికి రూ.230 కోట్లు విరాళంగా ఇచ్చింది. బిజూ జనతాదళ్‌కు రూ. 244.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. కాంగ్రెస్‌, శివసేన మిగిలిన చిన్న మొత్తాన్ని అందుకున్నాయి.
  • డిఎల్‌ఎఫ్‌ గ్రూప్‌ కొనుగోలు చేసిన మొత్తం రూ. 170 కోట్ల విలువైన బాండ్లను బిజెపికే విరాళంగా ఇచ్చింది.
  • అహ్మదాబాద్‌ కి చెందిన టోరెంట్‌ గ్రూప్‌, దాని అనుబంధ సంస్థలైన టోరెంట్‌ ఫార్మా, టోరెంట్‌ పవర్‌ రూ. 184 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో రూ. 137 కోట్లు (75 శాతం) బిజెపికి విరాళంగా ఇచ్చింది. మిగిలిన 25 శాతం ఆప్‌, ఎస్‌పి, ఎన్‌సిపి, కాంగ్రెస్‌, శివసేన, సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డిఎఫ్‌్‌), సిక్కిం క్రాంతికారి మోర్చాలకు ఇచ్చింది.
  • ఆర్‌పి-సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ హల్దియా ఎనర్జీ, ధరివాల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌, క్రెసెంట్‌ పవర్‌, ఆర్‌పిఎస్‌జి వెంచర్స్‌ అనే ఐదు కంపెనీలు రూ.604 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఇందులో బిజెపికి రూ.126 కోట్లు విరాళంగా ఇచ్చింది. టిఎంసికి రూ. 457 కోట్లు, కాంగ్రెస్‌ కు రూ.15 కోట్లు ఇచ్చింది.
  • ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హౌటల్‌ సర్వీసెస్‌ రూ. 1,365 కోట్ల బాండ్లు కొనుగోలు చేయగా, అందులో బిజెపికి రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చింది. టిఎంసికి రూ.542 కోట్లు, డిఎంకెకి రూ.503 కోట్లు, వైసిపికి రూ.154 కోట్లు, కాంగ్రెస్‌కి రూ.50 కోట్లు, సిక్కిం క్రాంతికారి మోర్చా (రూ.11 కోట్లు), సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డిఎఫ్‌) రూ. 5 కోట్లు ఇచ్చింది.
  • ఆర్‌పిఎస్‌జికి చెందిన ఎనిమిది కంపెనీలు రూ. 584 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో టిఎంసికి రూ.419 కోట్లు, బిజెపికికి 126 కోట్లు, కాంగ్రెస్‌ కు రూ.15 కోట్లు ఇచ్చింది.
  • నాలుగు జిందాల్‌ కంపెనీలు రూ.192 కోట్ల బాండ్లను విరాళంగా ఇచ్చాయి. అతిపెద్ద కొనుగోలుదారు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ రూ.123 కోట్లు వెచ్చించింది. బిజెడికి రూ.100 కోట్లు, కాంగ్రెస్‌ రూ.20 కోట్లు, బిజెపి రూ.3 కోట్లు ఇచ్చింది.
  • అదానీ గ్రూప్‌తో అనుసంధానించబడిన నాలుగు కంపెనీలు ఏప్రిల్‌ 2019 నుండి నవంబర్‌ 2023 వరకు మొత్తం రూ.55.4 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేశాయి.
  • రూ. 613.6 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్లు సరిపోలటం లేదు
    సుప్రీం కోర్టు ఆదేశంతో గురువారం సాయంత్రం ఎస్‌బిఐ ఇచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అవి మొదటి రెండు విడతల్లో విడుదల చేసిన డేటాసెట్‌లతో పూర్తిగా సరిపోలడం లేదు. 18,871 బాండ్లను కొనుగోలు చేయగా, రాజకీయ పార్టీలు మొత్తం 20,421 బాండ్లను ఎన్‌క్యాష్‌ చేశాయి. 1,550 బాండ్ల తేడా ఉంది. ఈ బాండ్ల విలువ, అంటే మొత్తం ఎన్‌క్యాష్‌ చేసిన బాండ్ల విలువ (రూ.12,769 కోట్లు) మైనస్‌, కొనుగోలు చేసిన బాండ్ల మొత్తం విలువ (రూ. 12,155 కోట్లు) రూ. 613.6 కోట్లుగా ఉంది. అంటే, రాజకీయ పార్టీలు రూ.613.6 కోట్ల విలువైన బాండ్లను అందుకున్నాయి. అవి ఇప్పటికీ దాతలకు లింక్‌ చేయలేదు. ఈ సరిపోలని బాండ్లలో బిజెపి ఖాతాలో రూ. 466.3 కోట్లు (మూడు వంతుల కంటే ఎక్కువ వాటా) ఉన్నాయి. కాంగ్రెస్‌ వద్ద రూ. 77 కోట్ల విలువైన బాండ్లు ఉన్నాయి. వాటి కోసం కొనుగోలుదారుని గుర్తించడం సాధ్యం కాదు. ఇదిలా ఉండగా, టిఎంసి క్యాష్‌ చేసిన సుమారు రూ.17 కోట్ల విలువైన బాండ్లను దాతలకు లింక్‌ చేయడం సాధ్యం కాదు.
➡️