అంధుల అక్షర ప్రదాత బ్రెయిలీ

Jan 4,2024 07:23 #Braille, #Braille Script, #Profiles
braille script birth anniversary

 

అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ. చిన్నతనంలోనే చూపు కోల్పోయినప్పటికీ ఏ మాత్రం కుంగిపోకుండా తన లాంటి వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని అభివృద్ధి చేశాడు.లూయిస్‌ బ్రెయిలీ 1809 జనవరి 4వ తేదీన పారిస్‌ లోని ‘క్రూవే’ గ్రామంలో మోనిక్‌ బ్రెయిలీ, సైమన్‌ రెనె బ్రెయిలీ దంపతులకు జన్మించాడు. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్లు కోల్పోయి అంధుడిగా మారాడు. పారిస్‌లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలలో ఆయన చదువుకున్నాడు. బ్రెయిలీ తెలివితేటలను చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయారు. పట్టుదలగా ‘లైన్‌ టైపు’ పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమితులయ్యాడు.పగలు పాఠశాలలో చదువు చెప్తూ, రాత్రి సమయంలో అంధులు చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషి చేశాడు. అంధులు పుస్తకాలను స్పర్శతో గుర్తుపట్టి చదివేందుకు వీలుగా చుక్కలు ఉండాలనే నిర్ణయానికి వచ్చాడు. సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు వీలుగా 1821లో ఛార్లెస్‌ బార్బియర్‌ అనే సైనికాధికారి రూపొందించిన 12 ఉబ్బెత్తు చుక్కల లిపిని…బ్రెయిలీ ఆరు చుక్కలకు తగ్గించాడు. ఫ్రాన్స్‌ దేశం బ్రెయిలీ లిపికి అధికారిక గుర్తింపునిచ్చి ఆయనను తమ ముద్దుబిడ్డగా ప్రకటించుకుంది. ఆ కృషి వలనే ప్రపంచ వ్యాప్తంగా అంధులు చదువుకునేందుకు వీలు కల్గింది. అయితే అంధుల కోసం బ్రెయిలీ కనిపెట్టిన లిపికి ఆయన మరణానంతరమే గుర్తింపు వచ్చింది. సంగీతాన్ని కూడా అదే లిపిలో రాయడం ఆయన విశిష్టత. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది అంధులు అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తున్నారు. పిల్లలలో అంధత్వం పెరుగుదలకు…నివసిస్తున్న ప్రాంతం, కుటుంబ సామాజిక, ఆర్థిక పరిస్థితి కారణం అవుతుంది. మన దేశంలో 15 మిలియన్ల మంది అంధులున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి. సామూహిక ప్రాంతాల్లో బ్రెయిలీ లిపి అందుబాటులో ఉంచాలి. అన్ని రకాల అంధత్వం కలిగిన వారికి వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి. ప్రభుత్వ సమాచారం, జీవోలు, చట్టాలు బ్రెయిలీ లిపిలో ముద్రించి అందుబాటులోకి తేవాలి. అంధులకు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

 

– యం. అడివయ్య, ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షులు, సెల్‌ : 9490098713

➡️