సిఎఎపై భయం.. భయం

మైనార్టీల్లో పెరుగుతున్న ఆందోళన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై మైనార్టీ ప్రజానీకంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి కుల, మతాలకు అతీతంగా ప్రజలందరిపైనా ఈ చట్ట ప్రభావం పడుతుంది. అయితే, బిజెపి అమలు చేసే విద్వేష విధానాల కారణంగా మైనార్టీ ప్రజానీకం ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో బిజెపికి పెద్దగా బలం లేనప్పటికీ, తెలుగుదేశం-జనసేనలు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొంత కాలం వరకు లౌకిక విలువలకు పట్టం కట్టిన టిడిపి వాటిని విడిచిపెట్టి, బిజెపి అజెండాను భుజాన వేసుకున్నట్టైంది. దీనికి తగ్గట్టుగానే కొద్దిరోజుల క్రితం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సిఎఎకు గట్టిగా వత్తాసు పలికిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని వ్యతిరేకించడమంటే రాజ కీయం చేయడమేనని అన్న ఆయన ‘ముస్లిం దేశాల్లో మనం ఉండగలమా?’ అని కూడా ప్రశ్నించారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే చిలకలూరిపేట వద్ద ప్రధాని మోడీతో కలిసి నిర్వహించిన సభలో ‘జెండాలు వేరైనా మా అజెండాలు ఒకటే’ అని బాబు అన్నారు. ఈ సభలోనే ప్రసంగించిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ప్రకటించారు.
మోడీ డబుల్‌ ఇంజిన్‌ సరారు వస్తుందన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడటమంటే, సిఎఎతో పాటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేసే అన్ని విధానాలను అమలు చేయడమే! అదే సమయంలో గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు మైనార్టీలను ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్న తీరు, బుల్డోజర్‌ రాజ్‌ పేరుతో ఆస్తులను ధ్వంసం చేసి, రోడ్లమాద పడేస్తున్న తీరుపైనా ప్రస్తుతం ముస్లింలలో చర్చ సాగుతోంది. ఆందోళనలో ఉన్న మైనార్టీ ప్రజానీకానికి భరోసా ఇవ్వడానికి బదులుగా ‘అజెండా ఒకటే’ అని ప్రకటించడం ద్వారా టిడిపి, జనసేనలు వారికి దూరమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి సిఎఎ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం కూడా మైనార్టీ ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో వైసిపి వైపు మొగ్గు చూపిన మైనార్టీలు ఈ సారి డోలాయమానంలో ఉన్నారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బిజెపి జాతీయ నాయకుడు ఒకరు ‘రాష్ట్రంలో ప్రత్యక్ష పొత్తులతో పాటు పరోక్ష పొత్తులుంటాయి’ అంటూ చేసిన వ్యాఖ్యను పలువురు గుర్తు చేసుకుంటు న్నారు. అదే సమయంలో కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సిఎఎను అమలు చేసేది లేదని స్పష్టంగా ప్రకటించాయి. జగన్‌ ప్రభుత్వం ఎందుకలా ప్రకటించడం లేదని ముస్లింలు ప్రత్యేకించి యువతీ యువకులు ఆందోళనగా ఉన్నారు. రాష్ట్రంలో కీలకమైన మూడు ప్రధాన రాజకీయ పార్టీలు భరోసా ఇవ్వడానికి బదులు బిజెపి పట్ల అనుసరిస్తున్న సానుకూల వైఖరి మైనార్టీల్లో ఆందోళనకు కారణమౌతోంది. సిఎఎ విషయంలో వామపక్షాలు అనుసరిస్తున్న వైఖరి కూడా మైనార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి నుండి వామపక్షాలు సిఎఎను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలు నిరసనలు, ఆందోళనలు చేశాయి. కనుక వారే తమకు అండదండగా నిలుస్తారన్న అభిప్రాయం మైనార్టీలలో వ్యక్తమవుతోంది.

➡️