బిజెపి పొత్తుతో టిడిపిలో అసమ్మతి

  • తిరుపతిలో నిరసన గళం
    టికెట్‌ కేటాయించకపోతే రెబల్‌గా పోటీ చేస్తామని హెచ్చరికలు
    నరసరావుపేట మార్కెట్‌ యార్డ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి – యంత్రాంగం : బిజెపి, జనసేనతో పొత్తులో భాగంగా కొన్ని సీట్లను ఆ పార్టీలకు కేటాయించడంతో టిడిపిలో చిచ్చురేపింది. పలువురు ఆశావహులు రోడ్డెక్కారు. పలుచోట్ల నిరసన గళం వినిపించారు. పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను టిడిపి అధినేత చంద్రబాబు దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితో పొత్తు పార్టీకే నష్టమని కార్యకర్తలు వాపోతున్నారు. చంద్రబాబు తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
పొత్తులో భాగంగా తిరుపతి స్థానానికి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుకు కేటాయించారు. దీంతో ఆరణికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆరణి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్‌ కేటాయించకపోతే రెబల్‌గా బరిలో దిగుతానని బుధవారం మీడియా సమావేశంలో సుగుణమ్మ హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు బొజ్జల సుధీర్‌రెడ్డికి టికెట్‌ ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్‌సివి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోటీలో ఉన్నానని, చంద్రబాబు మరోసారి పునరాలోచించాలని మీడియా వేదికగా ఆయన హెచ్చరించారు. వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కుండ్లూరు రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు టికెట్‌ కేటాయించడంతో టిడిపి బిసి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మస్తానయ్య అసహనం వ్యక్తం చేశారు. బిసిలకు సీటు ఇవ్వకపోతే టిడిపి గల్లంతు ఖాయమని ఆయన బహిరంగంగా ప్రకటించారు. వలసొచ్చిన వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి సత్యవేడులో టికెట్‌ ఖరారు చేయడంతో ఆశావాహుడైన జెడి రాజశేఖర్‌ రెబల్‌ బెల్‌ మోగించారు. స్వతంత్రంగానైనా బరిలో దిగేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు.

విశాఖ దక్షిణం సీటుపై జనసేనలో రగడ
విశాఖ దక్షిణం సీటుపై జనసేన నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ను తమ నెత్తి మీద పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఒక గ్రూపు వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంశీకృష్ణకు సీటు వద్దు స్థానికులు ముద్దు అంటూ శ్రీనివాస్‌ ఫొటోలను దక్షిణ నియోజకవర్గ జనసేన నేతలు మూగి శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ మహమ్మద్‌ సాదిక్‌ గ్రూపు నాయకులు తగలబెట్టడంతో వివాదం చోటుచేసుకుంది. వంశీకృష్ణ గ్రూపు చెందిన సుమారు 50 మంది వచ్చి తమ నేత ఫొటోలను ఎందుకు తగులబెట్టారంటూ గొడవకు దిగారు. వివాదం పెద్దది కావడంతో పోలీసులు వచ్చి సర్థి చెప్పారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుకు టికెటు కేటాయించాలని ఆ పార్టీ నేత నరసరావుపేట మార్కెట్‌ యార్డ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పులిమి వెంకటరామిరెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ టికెట్‌ జనసేన పార్టీకి కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

➡️