ధాన్యం కొనుగోళ్లపై ఎన్నికల ఎఫెక్ట్‌

May 19,2024 04:09 #food grains, #Koulu Rythu, #rice crop
  • 70 శాతానికే లక్ష్యం పరిమితం
  •  సిసిఆర్‌సి కార్డులు లేక బయట మార్కెట్‌ను ఆశ్రయిస్తున్న కౌలుదారులు
  •  వాతావరణ మార్పులతో అన్నదాతల్లో ఆందోళన

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంలో తూర్పుగోదావరి జిల్లా వెనుకబడింది. రబీ సీజన్‌ లక్ష్యంలో కేవలం 70 శాతానికే కొనుగోలు పరిమితమైంది. దాదాపు కోతలు పూర్తయినా కొనుగోలు లక్ష్యం ఆమడ దూరంలో నిలిచింది. ఎన్నికల ప్రభావం ధాన్యం కొనుగోలుపై పడింది. నోటిఫికేషన్‌ విడుదల అయినప్పటి నుంచి అధికారులు ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. దీంతో ధాన్యం సేకరణ నిలిచిపోయింది. దీనికి తోడు గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 1.50 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. సుమారు ఐదు లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. 3.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 22,766 మంది రైతుల నుంచి కేవలం 2.24 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 99.8 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. దేవరపల్లి, తాళ్లపూడి, సీతానగరం, గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లో రైతుల వద్ద ఇంకా ధాన్యం నిల్వలు ఉన్నాయి. వరి ఏ-గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.2203, కామన్‌ రకం రూ.2040 ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించింది.ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్‌ 18 నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు ఆ విధుల్లో తలమునకలయ్యారు. దీంతో కొనుగోళ్లపై ఆర్‌బికెల్లో పర్యవేక్షణ కొరవడింది. రైతులు ఆర్‌బికె కేంద్రాలకు వెళ్లినప్పటికీ గోనె సంచులు అందుబాటులో లేకపోవటం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెనుతిరగక తప్పలేదు. తాజాగా వాతావరణంలో నెలకొన్న మార్పులు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. క్వింటాలు ధాన్యం రూ.1800కు ధర మించడం లేదు. 75 కేజీల బస్తా రూ.1400 మించి దళారులు కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ మద్దతు ధరతో పోల్చితే సరాసరిన బస్తాకు రూ.300 వరకూ రైతులు నష్టపోతున్నారు. రైతులు, రైతు సంఘాల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర గతేడాది కంటే క్వింటాలుపై రూ.143లు వరకు పెంచినప్పటికీ ఆ ఫలాలు రైతు దరి చేరలేదు.

కౌలురైతులకు ప్రభుత్వ నిబంధనలు ఆటంకం
కౌలు రైతులకు ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది కౌలురైతులు ఉన్నారు. సిసిఆర్‌సి కార్డులు 57వేలకు మించి పంపిణీ జరగడం లేదు. సిసిఆర్‌సి కార్డులు లేని కౌలురైతులు ఆర్‌బికె సెంటర్లలో ధాన్యాన్ని విక్రయించలేకపోతున్నారు. ఎన్నికల ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధర కన్నా క్వింటాలుకు సుమారు రూ.400 తక్కువ ధరకు దళారులకు విక్రయించి నష్టపోతున్నారు.

ధరలు పెరగడంతోనే..
ఇప్పటి వరకు 2.24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు రూ.259 కోట్లు జమ చేశాము. జిల్లాలో దాదాపుగా ధాన్యం అమ్మకాలు పూర్తయ్యాయి. మరో పదిరోజుల పాటు ఆర్‌బికెలలో కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తాం.
జె.రాధిక, జిల్లా మేనేజర్‌ పౌరసరఫరాల శాఖ

100 కేజీల బస్తా రూ.1800 చొప్పన విక్రయించాను : బి.సత్తిబాబు, రాజానగరం, కౌలు రైతు.
పదెకరాలు కౌలుకు తీసుకుని గత కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎకరాకు 25 బస్తాలు చొప్పున దిగుబడి వచ్చింది. క్వింటాల్‌ బస్తా రూ.1800 చొప్పున వ్యాపారికి విక్రయించాను. నాకు సిసిఆర్‌సి కార్డు లేదు. దీంతో ఆర్‌బికెలో విక్రయించే అవకాశం లేదు. వాతావరణం మార్పుల నేపథ్యంలో తక్కువ ధరకు విక్రయించాను.

➡️