డిపాజిట్లు దక్కడం లేదు!

Mar 20,2024 07:44
  •  కొనేళ్లుగా పెరుగుతున్న ఇలాంటి అభ్యర్థుల సంఖ్య
     ఇప్పటి వరకు వీరి సంఖ్య 71వేలకు పైగానే
     2019 ఎన్నికల్లో ఇది 86 శాతం
    ఎన్నికల సంఘం సమాచారం

న్యూఢిల్లీ : ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు విజయం సాధించకపోయినా.. డిపాజిట్లు దక్కించుకోవటాన్ని ఒక సవాలుగా తీసుకుంటారు. ముఖ్యంగా, ప్రధాన పార్టీల అభ్యర్థులకైతే ఇది పరువుకు సంబంధించిన అంశం. ఒక అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోతే ప్రత్యర్థి పార్టీలు, నాయకులకు విమర్శించే ఆయుధం దొరికినట్టుగా భావిస్తారు. అయితే, దేశంలో జరిగే పలు ఎన్నికల్లో ఇలా డిపాజిట్లు కోల్పోతున్న అభ్యర్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నది. ఎన్నికల సంఘం సమాచారాన్ని విశ్లేషిస్తే ఈ విషయం వెల్లడైంది.
ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం.. దేశంలో 1951లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి పలు పార్టీలు, స్వతంత్రులు 71,000 మందికి పైగా అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం ఆరో వంతు ఓట్లను పొందటంలో విఫలమైనందుకు తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను కోల్పోయారు. 2019 ఎన్నికల్లో 86 శాతం మంది అభ్యర్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. పోలైన మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో కనీసం ఆరో వంతు ఓట్లను పొందటంలో విఫలమైతే.. వారి డిపాజిట్లను ట్రెజరీకి మళ్లించాలని ఎన్నికల సంఘం నిబంధనలున్నాయి.

ఏమిటీ సెక్యూరిటీ డిపాజిట్‌?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద కొంత మొత్తాన్ని ఎన్నికల కమిషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇది జనరల్‌ అభ్యర్థులకు రూ.25వేలుగా, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు రూ. 12,500గా ఉన్నది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం ఆరోవంతు ఓట్లను పొందితే.. వారు తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను పొందగలుగుతారు. లేకపోతే, ఆ డిపాజిట్‌ మొత్తాన్ని అభ్యర్థులు కోల్పోతారు.
మొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పోటీ చేసిన 91,160 మంది అభ్యర్థులలో 71,246 మంది తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను కోల్పోయారు. అంటే, మొత్తం 78 శాతం మంది కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేదు. 1951లో జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు రూ.250 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉండేది. అది ప్రస్తుతం జనరల్‌ అభ్యర్థులకు రూ.25,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500కి పెరిగింది. ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్లను కాపాడుకోవటం గర్వకారణంగా, డిపాజిట్లు జప్తు చేయటం అవమానకరమైనదిగా భావిస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

గత ఎన్నికల్లో బిఎస్‌సి నుంచే అధికంగా
2019 ఎన్నికలలో, ప్రముఖ రాజకీయ పార్టీలలో బిఎస్‌సి అత్యధిక స్థానాల్లో డిపాజిట్లను కోల్పోయింది. ఆ పార్టీ నిలిపిన 383 మంది అభ్యర్థులలో 345 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. ఇక తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 421 మంది అభ్యర్థులలో 148 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఇక బిజెపి నుంచి 51 మంది అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకోవటంలో విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 86 శాతం మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావటం గమనార్హం.

ఆయా లోక్‌సభ ఎన్నికల్లో ఇలా..!
1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 40 శాతం, అంటే 1,874 మంది అభ్యర్థుల్లో 745 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయే ట్రెండ్‌ క్రమంగా పెరిగింది. 1996లో జరిగిన 11వ లోక్‌సభ ఎన్నికల సమయంలో 91 శాతం అంటే 13,952 మంది అభ్యర్థుల్లో 12,688 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఎన్నికల్లో లోక్‌సభ స్థానాలకు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడ్డారు. 1991-92లో, 8,749 మంది అభ్యర్థులలో 7,539 మంది (86 శాతం మంది) తమ సెక్యూరిటీ డిపాజిట్‌ కోల్పోయారు.
2009లో, 8070 మందిలో 6829 మంది అభ్యర్థులు(85 శాతం మంది) అభ్యర్థులు డిపాజిట్లు పొందలేకపోయారు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో పలు పార్టీలు, స్వతంత్రులు 8,251 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో 7,000 మంది (84 శాతం) తమ సెక్యూరిటీ డిపాజిట్‌ను కోల్పోయారు.

జాతీయ పార్టీల ప్రదర్శన ఒకే.. 2009 లోనే దారుణం
జాతీయ పార్టీల అభ్యర్థులు తమ డిపాజిట్లను నిలుపుకోవటంలో ఉత్తమ ప్రదర్శననే కనబరుస్తున్నారు. 1951-52లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు చెందిన 1,217 మంది అభ్యర్థుల్లో 28 శాతం మంది మాత్రమే, అంటే 344 మంది డిపాజిట్లు కోల్పోయారు. 1957లో తదుపరి ఎన్నికలలో 919 మంది అభ్యర్థులలో 130 మంది(14 శాతం) అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. 1977 ఎన్నికల్లో మాత్రం జాతీయ పార్టీలు చక్కని ప్రదర్శననే కనబర్చాయి. ఈ సంఖ్య అతి తక్కువగా 9 శాతంగానే ఉన్నది. ఈ పార్టీలకు చెందిన 1,060 మంది అభ్యర్థులలో 100 మంది మాత్రమే (తొమ్మిది శాతం) డిపాజిట్లు కోల్పోయారు. 2009 సార్వత్రిక ఎన్నికలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. జాతీయ పార్టీల అభ్యర్థులలో దాదాపు ప్రతి రెండో అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు చెందిన 1,623 మంది అభ్యర్థుల్లో 779 మంది డిపాజిట్లు దక్కించుకోలేదు.

‘ప్రజలకు రాజకీయాలపై ఆసక్తి’
ఢిల్లీ యూనివర్శిటీలోని జీసస్‌ అండ్‌ మేరీ కాలేజ్‌లోని పొలిటికల్‌ సైన్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సుశీల రామస్వామి మాట్లాడుతూ… భారత్‌లో రాజకీయ కార్యకలాపాలు చాలా ప్రాథమికమైనవిగా భావించబడుతున్నందున చాలా మంది అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్‌ కోల్పోయినప్పటికీ ఎన్నికలలో పోటీ చేస్తారనీ, ప్రజలు రాజకీయాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారని అన్నారు. మరికొందరు, వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇష్టపడతారని తెలిపారు.
భారత్‌లో 18వ లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్‌ 19 నుంచి ఏడు దశల్లో( ఏప్రిల్‌ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్‌ 1 తేదీలలో) జరగనున్నాయి. జూన్‌ 4 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఆప్‌ వంటి పలు పార్టీల కూటమి ‘ఇండియా’ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నదని ఎన్నికల విశ్లేషకులు చెప్తున్నారు.

➡️