‘సాగు’కు రుణమేదీ..! 

Dec 28,2023 10:04 #bank loans, #Farmers Problems
eluru farmers loan problems in ap

కౌలు రైతులకు రుణాల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం

రెండు జిల్లాల వ్యవసాయ రుణ ప్రణాళిక సుమారు రూ.8 వేల కోట్లు

2023-24లో మంజూరు చేసిన రుణం రూ.424 కోట్లే

3 లక్షల మంది కౌలు రైతులుండగా లక్షా 46 వేల మందికే కౌలు కార్డులు

కౌలు కార్డుదారుల్లోనూ సగం మందికే రుణం

రబీ సాగులోనైనా రుణాలివ్వాలని  కౌలు రైతుల వేడుకోలు

‘ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : సాగు చేసే రైతును పక్కన పెట్టేశారు. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఆసరా లేకుండాపోయింది. గడిచిన రబీ, ప్రస్తుత ఖరీఫ్‌లోనూ వర్షాలకు పంట నష్టపోయిన కౌలురైతులకు ప్రభుత్వ అండ లేకుండాపోయింది. సాగు చేసే రైతులకు పంట రుణాలు కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది. 2023-24లో రెండు జిల్లాల్లోనూ కౌలు రైతులకు ఇచ్చిన రుణాలు, వ్యవసాయ రుణ ప్రణాళికకు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. రబీలోనైనా పంట రుణాలిచ్చి ఆదుకోవాలంటూ కౌలురైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు లక్షల మంది వరకూ కౌలు రైతులు ఉన్నట్లు గతంలో అధికారులు రూపొందించిన లెక్కలే చెబుతున్నాయి. రెండు జిల్లాల పరిధిలోని వ్యవసాయ సాగులో 70 శాతం కౌలురైతులే చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యవసాయ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న కౌలురైతులను మాత్రం ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. బ్యాంకుల నుంచి పంట రుణాల మంజూరులో ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతోంది. బ్యాంకర్ల ప్రతి సమావేశంలో కౌలురైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వాలంటూ ప్రకటనలతోనే సరిపెడుతున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లాలో 89 వేల మంది కౌలురైతులకు సిసిఆర్‌సి (రుణార్హత కార్డులు) మంజూరు చేశారు. ఇప్పటి వరకూ 40 వేల మంది సిసిఆర్‌ కార్డుదారులకు రూ.297 కోట్లు రుణం మంజూరు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏలూరు జిల్లాలో 57 వేల వరకూ సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేశారు. రుణాల మంజూరు మాత్రం 32,948 మంది కౌలుకార్డుదారులకు రూ.127 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. రెండు జిల్లాలవ్యాప్తంగా మూడు లక్షల మంది వరకూ కౌలుదారులు ఉండగా సిసిఆర్‌సి అందుకున్న రైతులు లక్షా 46 వేలు మాత్రమే. దాదాపు మరో లక్షా 50 వేల మందికి కౌలుకార్డులు అందనే లేదు. ఈ ఏడాది లక్షా 46 వేల మందికి కౌలుకార్డులు ఇచ్చినప్పటికీ రుణాలు అందుకున్న రైతులు మాత్రం 73 వేల మంది మాత్రమే. అదీ రెండు జిల్లాల్లోనూ కలిపి రూ.424 కోట్లు మాత్రమే. రెండు జిల్లాల వ్యవసాయ రుణ ప్రణాళిక దాదాపు రూ.ఎనిమిది వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కౌలురైతులకు పంట రుణాల కింద మంజూరు చేసిన రుణం ఒక్క శాతం కూడా లేకుండాపోయింది. కౌలుకార్డులు అందుకున్న రైతుల్లోనూ సగం మందికి పంటరుణాలు అందనేలేదు. గడిచిన రబీ, ప్రస్తుత ఖరీఫ్‌లోనూ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖర్చులు పెరిగిపోయి తీవ్ర నష్టాలను చవిచూశారు. సాగు చేస్తున్న కౌలురైతులకు మాత్రం ప్రభుత్వం పంటరుణాలు ఇవ్వడం లేదు. సాగు చేయని భూయజమానులకు పంటరుణాలు ఇస్తున్న పరిస్థితి ఉంది.

  • పంట నష్ట పరిహారం, బీమా సైతం భూయజమానికే

దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నష్ట పరిహారం, బీమా సైతం కౌలురైతులకు అందడం లేదు. భూయజమాని ఖాతాలోకే చేరుతున్నాయి. ఇ-క్రాప్‌ ఆధారంగా పంటనష్టం నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఇ-క్రాప్‌లో భూయజమానుల పేర్లే ఉన్నాయి. దీంతో పంట నష్టపరిహారం సైతం భూయజమానికే వెళ్తోంది. బ్యాంకులో పంటరుణం తీసుకున్న రైతులకే బీమా పరిహారం చేరుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట నష్టం, బీమాపరిహారంతోపాటు రబీలోనైనా పంటరుణాలు అందించి అదుకోవాలని కౌలురైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

➡️