మండుటెండలో ‘ఉపాధి’

Apr 6,2024 08:31 #upadi, #Upadi Hami Padhakam, #workes
  •  వేతనాల పెంపు సరే.. వసతులేవీ?
  •  ఉపాధి కార్మికుల అవస్థలు పట్టించుకోని సర్కారు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కొలతలు, నిబంధనల ప్రకారం పని చేస్తే ఇప్పటి వరకు రోజుకు రూ.272 వేతనం ఇచ్చేవారు. ఈ నెల 1 నుంచి రూ.28 పెంచుతూ ప్రభుత్వం జిఒ జారీ చేసింది. దీంతో రోజూ వారీ వేతనం రూ.300కి పెరిగింది. అయితే, పని ప్రదేశంలో కనీస వసతులను కల్పించడం ప్రభుత్వం మరిచిందని పలువురు ఉపాధి కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి.రాయవరంలో పనులు చేస్తున్న కార్మికులను వసతుల గురించి ఆరా తీయగా నీడ కోసం కనీసం టెంట్లు కూడా లేవు. మండుటెండలో పనులు చేయాల్సి వస్తోందని ఉపాధి కార్మికులు వాపోయారు. ఈ గ్రామంలో సుమారు 400 మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం వంద మంది పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం టెంట్లు ఇచ్చారని, ఇప్పుడు అవి చిరిగిపోవడంతో చెట్ల నీడన సేదతీరుతున్నామని కార్మికులు శీలం సత్యనారాయణ, పోలినాటి ప్రకాష్‌బాబు, కాటూరి విజయ ప్రసాదరావు తెలిపారు. ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు కూడా అందుబాటులో లేవని చెప్పారు. ప్రథమ చికిత్స కిట్లు ఉన్నప్పటికీ మందులు ఉండడం లేదని వివరించారు.
కాకినాడ జిల్లాలో 2.74 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 4.48 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 3.15 లక్షల మందికి మాత్రమే రెగ్యులర్‌గా పని కల్పిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రెండు రోజులుగా 29 వేల మందికి మాత్రమే పనులు కల్పించారు. ఉదయం 6:30 నుంచి 10 గంటల వరకు పనులు కల్పిస్తున్నారు. వరి కోతలు ప్రారంభం కావడంతో సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో సుమారు 80 వేల మందికి పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఉక్కిరిబిక్కిరవుతున్న కార్మికులు
ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఎండలు ప్రతాపం చూపుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. ఈ ఎండలతో ఉపాధి కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి నేపథ్యంలో గతంలో ఫిబ్రవరి నెల నుంచి జూన్‌ వరకు ప్రతి ఏటా ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేవారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి నుంచి మే వరకు 30 శాతం, జూన్‌లో 20 శాతం వేసవి భత్యం అందించే వారు. ఎన్‌ఐసి సర్వర్‌ ద్వారా పనులు కేటాయించడంతో వేసవి భత్యాన్ని తొలగించారు. గతంలో ప్రతిరోజూ ఒక్కో కార్మికుడికి రెండు లీటర్ల తాగునీటి కోసం రూ.5 వేతనంతో పాటు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదని కార్మికులు తెలిపారు. తట్టకు రూ.3, గునపానికి రూ.5 ఇవ్వడం కూడా నిలిపివేశారని చెబుతున్నారు. ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పూర్తిగా అందట్లేదు.

ఇబ్బందులు పడుతున్నాం : ఎన్‌.ప్రకాశరావు, ఉపాధి కార్మికుడు, తాళ్లరేవు
రెక్కాడితేనేగాని డొక్కాడని పరిస్థితి మాది. ఎండలున్నప్పటికీ పొట్టకూటి కోసం ఉపాధి పనులకు వెళ్లాల్సి వస్తోంది. టెంట్లుగానీ, తాగునీటి సౌకర్యంగానీ కల్పించడం లేదు. ఇంటి నుంచే తాగునీటిని పట్టుకెళ్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే మందులు కూడా ఇవ్వడం లేదు.

ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం : అడపా వెంకటలక్ష్మి, డ్వామా పిడి, కాకినాడ జిల్లా
రెండు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ద్వారా 20 వేల ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాం. ప్రతి మండలానికి వెయ్యి ప్యాకెట్లను పంపిణీ చేశాం. ఎండ వేడిమి తట్టుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడే ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను వినియోగించాలని ఆదేశాలిచ్చాం. అన్ని ప్రాంతాల్లోనూ మంచినీటి టిన్నులను అందు బాటులో ఉంచాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఆదేశాలిచ్చాం. ప్రథమ చికిత్స కిట్లలో మందులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

➡️