Kharif పెట్టుబడి కోసం తిప్పలు

Jun 20,2024 07:49 #Kharif investment, #rice grains, #rythu
  • పేరుకుపోయిన రబీ ధాన్యం బకాయిలు
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.508 కోట్లపైనే పెండింగ్‌

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : అనేక ఒడిదుడుకులను తట్టుకుంటూ సాగు చేస్తున్న రైతన్నలకు నిత్యం కష్టాలు తప్పడం లేదు. రబీ సీజన్‌లో ధాన్యం అమ్మి నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం చేతికందడం లేదు. సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీ భారం ఒకవైపు, ఖరీఫ్‌ సీజన్‌ సాగు కోసం మళ్లీ అప్పుల కోసం రుణదాతలను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.508.79 కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది.
రబీ సీజన్‌లో 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో స్థానిక అవసరాలు మినహా మిగిలిన 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో ఏప్రిల్‌ 4న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఏప్రిల్‌ 20 వరకు కొనుగోళ్లు జరగలేదు. సాధారణ రకం (75 కేజీలకు) రూ.1,637, గ్రేడ్‌-ఎ రకం (75 కేజీలకు) రూ.1,652 చొప్పున మద్దతు ధరను ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలు, ఇతర కారణాల వలన కొనుగోలు కేంద్రాల ద్వారా నామమాత్రంగానే అధికారులు ధాన్యాన్ని సేకరించారు. తేమశాతం, నాణ్యత, వాతావరణ ప్రతికూలతలు చూపి దళారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు.

బకాయిలు.. రూ.508 కోట్లు
ధాన్యం అమ్మిన సొమ్మును 48 గంటల్లోనే జమ చేయాలని మొదట్లో నిర్ణయించారు. ఆ తర్వాత మూడు వారాలకు గడువు పెంచారు. అయినా నిబంధనల మేరకు డబ్బుల చెల్లింపులో నిర్లక్ష్యం చోటుచేసుకుంటుంది. గత నెల 1 నుంచి కొన్ని కారణాల రీత్యా చెల్లింపులు నిలిచినట్లు సమాచారం. ఎన్నికల హడావుడిని సాకుగా చూపి రైతులకు ఇవ్వాల్సిన బకాయిల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లాలో 6.87 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉండగా లక్ష్యం మాత్రం 1.92 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. ఇందులో 3,110 మంది రైతుల నుంచి రూ.57.18 కోట్లు విలువైన 26,180.360 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఇప్పటి వరకు రూ.20.37 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.36.81 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 23,082 మంది రైతుల నుంచి 2.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా రూ.498.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.296.31 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ. 202.41 కోట్లు ఇంకా జమ కావాల్సి ఉంది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో రూ.355.84 కోట్లు విలువైన 1.62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.84.47 కోట్లు చెల్లించగా ఇంకా రూ.270.20 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

తక్షణమే బకాయిలను విడుదల చేయాలి : తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
ధాన్యం అమ్మిన సొమ్ములను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. 21 రోజుల్లోపు జమ చేయాల్సిన సొమ్ములు నెలా, రెండు నెలలు గడిచినా ఖాతాల్లో వేయకపోవడం దారుణం. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయులను విడుదల చేయాలి.

➡️