గోదావరి జిల్లాల లెక్క తేలిందా ?

Dec 19,2023 11:13 #East Godavari, #YCP, #YCP Leaders
  • తాడేపల్లికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును వైసిపి ముమ్మరం చేసింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 11 మంది సిట్టింగ్‌ అభ్యర్థులను మారు స్తూ తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఉభయగోదావరి జిల్లాల్లో కూడా మార్పులు చేపడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ రెండు జిల్లాలకు చెందిన ఎంఎల్‌ఏలు తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయానికి సోమవారం క్యూ కట్టారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఎంఎల్‌ఏలు కూడా సిఎంను కలిశారు. మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్‌లు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లతో పాటు గుంటూరు నుండి మద్దాలి గిరి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్‌, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పీఠాపురం ఎమ్మెల్యే పి దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే రాజు క్యాంప్‌ కార్యాలయంకు చేరుకుని తమ ఆభిప్రాయాలను తెలియచేసినట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలపై ప్రజల్లో అభ్యర్థులకు వున్న అనుకూలత, ప్రతికూలత అంశాలు, పార్టీనాయకులు, కార్యకర్తలతో వున్న సమన్వయం, అవినీతి ఆరోపణలు, ప్రత్యర్థిని డీకొట్టే సామర్థ్యంలాంటి అంశాలతో పలు దఫాలుగా సర్వేలు చేయించుకున్న సిఎం జగన్మోహన్‌రెడ్డి మొహమాటం లేకుండా సిట్టింగ్‌ల సీట్‌పై తేల్చిచెబు తున్నట్లు తెలిసింది. సీట్‌ ఇచ్చేది లేదని ప్రత్యామ్నాయం చూస్తామని హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17, పశ్చిమగోదావరి జిల్లాలో 19 సీట్లు కలిపి 36 నియోజకవర్గాలు ఈ రెండు జిల్లాల్లోనే వుండటంతో ఈ జిల్లాపై వైసిపి అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. అన్ని సర్వేల్లో ప్రతికూలతలు వచ్చిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డి టికెట్‌లపై అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పేసినట్లు తెలిసింది. దీంతో సిట్టింగ్‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం ఉమ్మడి కృష్ణా జిల్లాల సిట్టింగ్‌లకు సమాచారం ఇవ్వడంతో కృష్ణా జిల్లా రాజకీయా ల్లోనూ ప్రకంపనలను సృష్టిస్తోంది. కృష్ణా జిల్లాలో కూడా మంత్రి జోగి రమేష్‌ను పార్లమెంట్‌కు పంపి పెడనలో మరొ కరికి అవకాశం కల్పిస్తారని, అలాగే కీలకమైన విజయవాడ లో వున్న ఇద్దరు సిట్టింగ్‌లను మారుస్తారనే సమాచారంతో సోమవారం గోదావరి జిల్లాల నుండి, కృష్ణా జిల్లాల నుండి వచ్చిన ఎమ్మెల్యేలతో తాడేపల్లి కిటకిటలాడింది. రామచంద్రా పురం నుండి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్‌కు మార్చే ఆలోచన వైసిపి నాయకత్వం చేస్తున్నట్లు సమాచారం. రామచంద్రాపురం సీటును ఎంపి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కుమారునికి ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే మంత్రి విశ్వరూప్‌ స్థానంలో ఆయన కుమారున్ని ఖరారు చేసే అంశాన్ని అధిష్టానం చేస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మొత్తంగా 8మంది సిట్టింగ్‌లను మార్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో సిట్టింగ్‌లలో ఆందోళన మొదలైంది.

➡️