పౌరసరఫరాల శాఖకు భారీగా సర్కారు బకాయిలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పౌర సరఫరాల సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బరదుల్లో కొట్టుమిట్టాడుతోంది. చేసిన ఖర్చులకు నిధులు రాక, ప్రభుత్వం నుంచి సహకారం లేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతోంది. కనీసం ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ నిధులు కూడా రాకపోవడం గమనార్హం. అంతకు మించి భవిష్యత్తులో చేయాల్సిన ఖర్చు, అందుకు కావాల్సిన నిధులు భారీగా ఉండడంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితికి చేరుకుంది. వచ్చే సెప్టెంబర్‌ వరకు ఏకంగా 34,393 కోట్లు అవసరమవుతాయని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే అంత సొమ్ము ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఏలనది, అప్పులకు వెళ్లాల్సివస్తుందని అంటున్నారు.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పలు రంగాలకు పౌర సరఫరాల సంస్థ అందించిన బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పులు వంటి వాటికి ప్రభుత్వం సబ్సిడీ భరించాలి. అయితే ఇప్పటివరకు 380 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రాలేదని అధికారులు చెబుతున్నారు. అలాగే వచ్చే సెప్టెంబర్‌ వరకు మరో 4251 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని వారంటున్నారు. ఇక గత బకాయిలు కూడా భారీగానే ఉన్నాయి. ఇది కాక మరో ఎనిమిది విభాగాల్లో ఏకంగా 22,019 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇందులో బియ్యం సబ్సిడీ బకాయిలు ఏకంగా 12,083 కోట్లు వరకు ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే 2023-24 సంవత్సరానికి కేంద్ర సాయంలో రాష్ట్ర వాటా 105 కోట్లు, పిఎస్‌ గరీబ్‌ కల్యాణ యోజన కిరద 4028 కోట్లు, సంస్థ తీసుకున్న వేస్‌ అండ్‌ మీన్స్‌ బకాయిలు 4326 కోట్లు, ఐసిడిఎస్‌ నుంచి 603 కోట్లు, విద్యాశాఖ నుంచి 578 కోట్లు, తుపానులు, గిరికానుక, కొవిడ్‌ సమయాల్లో చేసిన నిత్యావసరాల సరఫరాకి 112 కోట్లు, ఇతర సంక్షేమ శాఖల నుంచి 183 కోట్లు రావాల్సి ఉందని సంస్థ అధికారులు చెబుతున్నారు.

ధాన్యం సేకరణకే రూ. 4,406 కోట్లు
కాగా ధాన్యం సేకరణ, రవాణా, ఇతర సేకరణ అంశాలకు రూ. 5,425 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో ఒక్క ధాన్యం సేకరణకే 4,406 కోట్లు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగే 2 శాతం మార్కెట్‌ రుసుము, కూలీలకు చెల్లింపులు, రవాణా, వడ్డీలు. మిల్లుల ఛార్జీలు, పాలనా వ్యయం, గన్నీ సంచుల కొనుగోలు, సరుకు నిల్వ వంటి ఇతర రంగాలకు మరికొంత నిధులు అవసరమవుతాయి. గత ధాన్యం సేకరణలో రైతులు, మార్కెటింగ్‌ శాఖ, ఇతర రంగాలకు చెల్లించాల్సింది రూ.2,318 కోట్లవరకు ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు అప్పులే 36 వేల కోట్లు
మొత్తంమీద బకాయిలు రూ.34 వేల కోట్లు దాటిపోవడంపై పౌర సరఫరాల సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే సంస్థ ఇప్పటివరకు తీసుకున్న అప్పులే 36 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఈ రుణాలపై ప్రతి నెలా ఏకంగా 280 కోట్ల రూపాయలను వడ్డీగా చెల్లించాల్సి వస్తోంది.

➡️