చేరికలు.. ఫిరాయింపులు

  •  ‘ప్రకాశం’లో ఉత్కంఠ పోరు

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : ప్రకాశం జిల్లాలో ఈ ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు నెలకొంది. ప్రధాన పార్టీలు గెలుపే ధ్యేయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు సాగుతున్నాయి. చేరికలు.. ఫిరాయింపులు వంటి ఎత్తుగడలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాజకీయ సమీకరణల్లో భారీ మార్పులు లేకపోయినప్పటికీ గత ఎన్నికల నాటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. నువ్వా.. నేనా అన్నట్లుగానే పోటీలు నడుస్తున్నాయి. ప్రచారాలు మొదలు పెట్టారు. షెడ్యూల్‌ ముందున్న పరిస్థితి ఇప్పుడు లేదు. సంక్షేమ ఎజెండాలు కనిపించడం లేదు. అంతా డబ్బుతోనే నడపాలనే భావనకు వచ్చేశారు. నిత్యం విందులు, సమ్మేళనాలు, ఆత్మీయ, వ్యూహాత్మక భేటీల పేరుతో కొనుగోళ్లు నడుస్తున్నాయి. అసంతృప్తి వాదులకు ప్యాకేజీలు కీలకంగా మారాయి. ప్రచారంలో ఎక్కడా జనం ఎజెండా లేదు. ప్రజా సమస్యలు, జిల్లాలో కీలకమైన సమస్యలు, ప్రాజెక్టుల వంటివి ఊసే లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రధానంగా మారాయి. వామపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరి ప్రభావం మిగతా పార్టీలపై తీవ్రంగా పడుతోంది.

నియోజకవర్గాల తారుమారు.. వలస నేతలు
వైసిపి ఒంగోలు మినహా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కొత్తగా పోటీలో పెట్టింది. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను స్థానాలు మార్చారు. కొండపిలో మంత్రి ఆదిమూలపు సురేష్‌, సంతనూతలపాడులో మంత్రి మేరుగ నాగార్జున పోటీ చేస్తున్నారు. వైసిపి నుంచి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు, అక్కడ ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురానికి అభ్యర్థులుగా పెట్టారు. కనిగిరి, వైపాలెం నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు దద్దాల నారాయణ, తాటిపర్తి చంద్రశేఖర్‌ను బరిలోకి దింపారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కరే సిట్టింగుగా బరిలో ఉన్నారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పోటీలో ఉన్నారు. పార్లమెంటు అభ్యర్థిగా చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి రంగంలో ఉన్నారు. టిడిపి ఎంపి అభ్యర్థిగా ఎంపి మాగుంట పోటీలో ఉన్నారు. టిడిపి నుంచి ఒంగోలులో దామచర్ల జనార్ధన్‌, సంతనూతలపాడులో బిఎన్‌ విజరుకుమార్‌, కొండపిలో వీరాంజనేయస్వామి, కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరులో ముత్తుముల అశోక్‌రెడ్డి, మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి, వైపాలెంలో గూడూరి ఎరిక్షన్‌బాబు, దర్శిలో గొట్టిపాటి లక్ష్మి పోటీలో ఉన్నారు. గొట్టిపాటి లక్ష్మి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సోదరుడు కుమార్తె. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. జిల్లాలో జనసేనకు, బిజెపికి ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో గిద్దలూరు నుంచి జనసేన రెబల్‌ అభ్యర్థిగా ఆమంచి స్వాములు పోటీలో ఉంటానని ప్రకటించారు.

పశ్చిమపైనే దృష్టి
జిల్లాలో పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలే ఇప్పుడు వైసిపి, టిడిపికి కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని అన్ని నియోజక వర్గాలూ వైసిపి అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈసారీ అదే వ్యూహంతో ఉన్నారు. అందుకే సిట్టిం గులను మంత్రులతో సహా తారుమారు చేశారు. ఎమ్మెల్యేను మార్చారు. వ్యతిరేకత తగ్గించే యత్నం చేశారు. కనిగిరి, గిద్దలూరు, మార్కా పురం, వైపాలెం, దర్శి ఐదు స్థానాలు వైసిపికే ఉన్నాయి. అందుకే సిఎం జగన్‌ కూడా బస్సు యాత్రలో ఇదే నియోజకవర్గాలను కలుపుతూ వెళ్లారు. అంతకుముందు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నీళ్లులేనందున విమర్శలకు తావిచ్చింది. చంద్రబాబు కూడా మార్కాపురంలోనే ఎన్నికల సభ నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నిర్వాసితులను ఆదుకుం టామన్నారు.

తూర్పు ప్రకాశం స్థానాలపై టిడిపి ఆశలు
తూర్పు ప్రకాశంలోని నియోజకవర్గాలపై టిడిపి ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో జిల్లాలో నాలుగు స్థానాలు టిడిపికి దక్కాయి. అయితే విభజనతో బాపట్లలోనే మూడు స్థానాలున్నాయి. ఈసారి కనిగిరి, గిద్దలూరుతోపాటు సంతనూ తలపాడు, కొండపి, ఒంగోలు, దర్శి స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో సామాజిక బలంతో పాటు కొన్నిచోట్ల సిట్టింగు ఎమ్మెల్యేలే అభ్యర్థులు ఉన్నందున ప్రచారంలో ముందున్నారు.

ఒంగోలు పార్లమెంటులో విచిత్ర పోటీ
ఒంగోలు పార్లమెంటులో విచిత్రమైన పోటీ నెలకొంది. వైసిపి ఎంపి మాగుంటకు టికెట్టు నిరాకరించడంతో టిడిపిలో చేరి పోటీలో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఎంపి అభ్యర్థిగా వైసిపి నిలబెట్టింది. వాస్తవానికి మాగుంట కూడా నెల్లూరు వాసి. వారి కుటుంబం 1990 దశకం నుంచే ఇక్కడ పార్ల మెంటులో నిలబడిపోయింది. మధ్యలో రెండు పర్యాయాలు ఓడిపోయినా ప్రస్తుతం ఎంపీగానే ఉన్నారు.

➡️