కడుపు మండి సమ్మె చేస్తే బ్లాక్‌మెయిలా ?

Jan 8,2024 08:44 #blackmail, #heartburn, #strike

             కడుపు మండిన అంగన్‌వాడీలు తమకు వేతనం పెంచాలనీ, గ్రాట్యుటీ చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే దాన్ని ‘ఎన్నికల ముందు బ్లాక్‌మెయిల్‌ చేసే ఉద్దేశంతో అంగన్‌వాడీలు సమ్మెకు దిగడం’గా సర్కారువారి దినపత్రిక అభివర్ణించడం దారుణం. వేతనాల పెంపుదల, డిమాండ్ల పరిష్కారం తదితర అంశాల్లో పదేపదే చెప్పిన అబద్ధాలనే జనవరి ఏడవ తేదీన మళ్లీ వల్లె వేసింది. అలాగే మున్సిపల్‌ వర్కర్స్‌కు హెల్త్‌ అలవెన్స్‌ను వేతనంతో కలిసి చెల్లిస్తామన్నదే మహా ప్రసాదంలా వర్ణించడం, అన్‌స్కిల్డ్‌ వారికి స్కిల్డ్‌ వర్కర్లతో సమాన వేతనం ఇమ్మని యూనియన్‌ అడిగినట్టు చిత్రించడం ఆ పత్రికకే చెల్లింది.

అబద్ధాలు గుదిగుచ్చి…

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఐక్యంగా గడచిన 25 రోజులుగా సమ్మె చేస్తుంటే ఇప్పుడు హఠాత్తుగా దాన్ని అత్యవసర సర్వీసుగా ప్రకటించి వారిపై ప్రభుత్వం ఎస్మాస్త్రాన్ని ప్రయోగించడాన్ని ఆ ఒక్కటి తప్ప దాదాపు అన్ని దినపత్రికలూ తప్పుబట్టాయి. వాటి వైఖరులనుబట్టి పేజీ, పొజిషన్‌ మారాయేతప్ప అన్నిటి సారాంశం ఒకటే! కానీ ఎస్మాను సమర్ధించి, సమ్మెను బ్లాక్‌మెయిల్‌గా అభివర్ణించింది సర్కారువారి పత్రిక మాత్రమే! ‘వాస్తవంగా దేశంలో అంగన్‌వాడీలకు ఎక్కువ వేతనాలిచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడవ స్థానంలో ఉందని’ కొండంత అబద్ధాన్ని అవలీలగా వల్లె వేసింది. కానీ నిజం ఏమిటంటే అంగన్‌వాడీలను రాష్ట్ర ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి, వారికి వేతనాలిస్తున్నది మన పొరుగునవున్న పాండిచ్చేరి (యానాం)లో. అలాగే నాలుగు నెలలపాటు సుదీర్ఘ సమ్మె చేసిన అంగన్‌వాడీలు హర్యానాలో అత్యధిక గౌరవ వేతనం పొందుతుండగా ఆ తరువాతి స్థానాలు కేరళ, తెలంగాణ రాష్ట్రాలది. ఆ క్రమంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌ పదవ స్థానంలో ఉంది. ప్రతి దానికీ ఫ్యాక్ట్‌ చెక్‌ అని చెప్పేవారు ఈ ఫ్యాక్ట్స్‌ ఎందుకు చెక్‌ చేసుకోరు? అలాగే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఏర్పడిన నాటికి రూ. 10,500గా ఉన్న వేతనాన్ని రూ. 11,500కు అంటే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి, ఎక్కడా లేనివిధంగా సగటు వేతనం అనే లెక్కలు చెప్పి రూ.4,550 పెంచినట్టు అభూత కల్పన సృష్టించింది. ఎవరైనా వేతనం ఎంతనుండి ఎంతకు పెరిగిందని చూస్తారుతప్ప ఇలాంటి తొండి లెక్కలు వెయ్యరు.

అక్కడితో ఆగకుండా ’11 డిమాండ్లలో 10 ఆమోదించి అమలుకు చర్యలు చేపట్టిందని’ మరో అబద్ధం. వేతన పెంపు, గ్రాట్యుటీ చెల్లింపు డిమాండ్లు అలాగే వుండగా ఒక్కటి మాత్రమే అపరిష్కృతం అన్నట్టు ఎలా రాస్తారు? అంతేగాక కీలకమైన వేతన పెంపు నిరాకరిస్తే చేసిందేమిటి? అలాగే మినీ సెంటర్లన్నిటినీ మెయిన్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని చర్చల్లో అంగీకరించినా ఇప్పటివరకూ జీవో జారీ చెయ్యలేదు. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వ కొత్త మంత్రిగా సీతక్క తొలి సంతకం చేసిన తరువాతనైనా ఈ సర్కారు స్పందించలేదు. ఇదేనా అమలుకు చర్యలు చేపట్టడం? ఈ విషయాలన్నీ ఉద్యమిస్తున్న అంగన్‌వాడీలకు తెలుసు కనుక వారేమీ ప్రభావితం కారు. కానీ అంగన్‌వాడీ సమ్మె న్యాయమైనదని భావించి వారికి అన్నివిధాలా అండదండలిస్తున్న లబ్ధిదార్లను, సామాన్య ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఆ పత్రిక అసలు ఉద్దేశాన్ని అందరూ అర్ధం చేసుకోవాలి.

తిరకాసు వాదనలు

పారిశుధ్య కార్మికులకు ప్రస్తుతం వేతనంగా రూ.15,000, హెల్త్‌ అలవెన్సుగా రూ.6,000 విడివిగా చెల్లిస్తుండగా శనివారంనాటి చర్చల్లో ఈ రెంటినీ కలిపి ఒకేసారి రూ.21,000 చెల్లిస్తాం దాంతో పండుగ చేసుకోండి అని మంత్రులు చెబితే అదే గొప్ప వరంలా ఆ పత్రిక రాసింది. వేతనాలు మినహా అన్ని డిమాండ్లు వెంటనే పరిష్కరించి జీవోలు పది రోజుల్లో జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంలోనే తిరకాసు ఉంది. నిజంగా పరిష్కరిస్తే జీవో జారీకి పది రోజులెందుకు? అలాగే సమ్మెలో వేతన డిమాండ్‌ పరిష్కరించకపోతే ఆ సమ్మెందుకు? అన్నది చిన్నపిల్లవాడు కూడా అడుగుతాడు. ఆమాత్రం తెలియదా ఈ పెద్దలందరికి? తిమ్మిని బమ్మిని చేసే తిరకాసు వాదనలతో ప్రజలను, పాఠకులను తప్పుదారి పట్టించే యత్నాలను ఆ పత్రిక మానుకోవాలి.

– గిరిపుత్ర

➡️