జేసీబీలు, బుల్‌డోజర్లే ఆయుధాలు

Feb 12,2024 11:46 #bulldozers, #JCBs, #Weapons
  • ముస్లిం ఆవాసాలు, ఆస్తులు లక్ష్యంగా విధ్వంసం
  • ప్రార్థనా స్థలాలనూ వదలని పాలకులు
  • బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రహసనంగా మారిన కూల్చివేతలు
  • దేశీయ, అంతర్జాతీయ చట్టాలు బేఖాతరు : నిగ్గు తేల్చిన అమ్నెస్టీ

న్యూఢిల్లీ : దేశంలో…ముఖ్యంగా బీజేపీ పాలిత అసోం, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ముస్లింలు, వారి ఆస్తులపై యధేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీ ఆప్‌ పాలనలో ఉన్నప్పటికీ అక్కడ పెత్తనం అంతా బీజేపీదే. ఆ రాష్ట్రంలో సైతం మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు సాగిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో జేసీబీలు, బుల్డోజర్లు ప్రయోగించి చట్టవిరుద్ధంగా, కక్షపూరితంగా ముస్లింల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ జరిపిన విచారణలో తేలింది. ఈ రాష్ట్రాల్లో 128 నిర్మాణాల కూల్చివేతలు జరగ్గా వాటిలో 63 ఘటనలపై అమ్నెస్టీ విచారణ జరిపింది. వీటిలో కనీసం 33 సందర్భాలలో ముస్లింల ఆస్తుల్ని కక్షపూరితంగా నేలమట్టం చేశారు.

మైనారిటీ ఆస్తుల విధ్వంసానికి సంబంధించి అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ రెండు నివేదికలు రూపొందించింది. ముస్లింల నివాసాలు, వ్యాపార సంస్థలు, ప్రార్థనా స్థలాలను జేసీబీలు, బుల్‌డోజర్లు, ఇతర యంత్రాలతో చట్టవిరుద్ధంగా ధ్వంసం చేశారని ఆ నివేదికలు తేల్చాయి. ఈ విధ్వంసకాండను వెంటనే నిలిపివేయాలని అమ్నెస్టీ డిమాండ్‌ చేసింది. ఆస్తులు కోల్పోయి రోడ్డున పడ్డ వందలాది మందిని, న్యాయ నిపుణులను, పాత్రికేయులను, మత పెద్దలను అమ్నెస్టీ ఇంటర్వ్యూ చేసింది. సంఘటనా స్థలాలను సందర్శించి, బహిరంగ విచారణ జరిపింది. విధ్వంసానికి సంబంధించి అందుబాటులో ఉన్న 78 వీడియోలు, ఫొటోలు వాస్తవమా కాదా అనే విషయాన్ని పరిశీలించింది. వీటిలో 69 వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల నుండి సేకరించగా మిగిలినవి బాధితులు అందజేశారు. ఉపగ్రహ చిత్రాలు, గూగుల్‌ ఎర్త్‌, మాపిల్లరీ వంటి వేదికల ద్వారా కూడా అమ్నెస్టీ సమాచారాన్ని సేకరించింది.

పోలీసుల సాక్షిగా…

ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలను, వారి ఆస్తులను కూల్చివేతలకు లక్ష్యాలుగా ఎంచుకున్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ముస్లింల ఆవాసాలకు సమీపంలో ఉన్న హిందువుల ఆస్తుల జోలికి మాత్రం వెళ్లలేదు. ఈ దారుణాలను అనేక మంది రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు ‘బుల్డోజర్‌ న్యాయం’గా అభివర్ణించాయి. ఇవి సుపరిపాలనకు మోడల్స్‌ అని వ్యాఖ్యానించాయి. కూల్చివేతల కారణంగా కనీసం 617 మంది గూడును, జీవనోపాధిని కోల్పోయారు. పురుషులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులను బలవంతంగా నివాసాల నుండి ఖాళీ చేయించారు. వారిని భయపెట్టి వేధించారు. పోలీసులు చట్టవిరుద్ధంగా దాష్టీకం ప్రదర్శించి, జరిగిన విధ్వంసానికి సాక్షిగా నిలిచారు.

బాధితులు కనీసం తమ వస్తువులను తీసుకోవడానికి కూడా అనుమతించకుండా పోలీసులు 39 ప్రాంతాల్లో బలప్రయోగం చేశారు. పోలీసులు తమపై దాడి చేసి, అవమానించారని 14 మంది బాధితులు అమ్నెస్టీకి తెలిపారు. ‘పోలీసులు అమర్యాదకరంగా ప్రవర్తించారు. తలుపులు పగలగొట్టి ప్రజల్ని ఇళ్ల నుండి బయటికి లాగారు. లాఠీలతో చితకబాదారు’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బాధితురాలు వాపోయారు. ఆ రాష్ట్రంలోని సెంధ్వా ప్రాంతంలో 60 సంవత్సరాల వృద్ధురాలి ఇంటిని కూడా కనికరం లేకుండా కూల్చేశారు.

అధికార పరిధిని అతిక్రమించి…

                కూల్చివేతల్లో బ్రిటన్‌ కంపెనీకి చెందిన జేసీబీలను విచ్చలవిడిగా ఉపయోగించారని అమ్నెస్టీ ఆరోపించింది. కూల్చివేతల్లో చట్టబద్ధత ఉన్నదా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడంలో భారతీయ మీడియా విఫలమైందని తెలిపింది. మీడియా సైతం ముస్లింల పట్ల వివక్ష చూపిందని వేలెత్తి చూపింది. అధికార పరిధిని అతిక్రమించి కూల్చివేతలకు పాల్పడ్డారని, వీటిని అంతర్జాతీయ చట్టాలు నిషేధించాయని వివరించింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిని బాధ్యులను చేయాలని, బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది.

అమ్నెస్టీ ఏం చెప్పింది ?

               అక్రమ కట్టడాలు, ఆక్రమణల పేరు చెప్పి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక కూల్చివేతలు జరిగాయని అమ్నెస్టీ తేల్చింది. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల ప్రోద్బలంతో ఈ విధ్వంసం సాగిందని తెలిపింది. ముస్లింలపై బుల్డోజర్లు ప్రయోగించాలని అనేక రాష్ట్రాల్లో అధికారులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సూచనలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌పై ‘బుల్డోజర్‌ బాబా’ అనే ముద్ర కూడా ఉంది. 2022 ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో బీజేపీ పాలనలోని అసోం, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ, అమ్‌ఆద్మీ పాలనలోని ఢిల్లీలోనూ మత ఘర్షణలు, నిరసనలు జరిగిన తర్వాత కక్షసాధింపు చర్యలుగా కూల్చివేతలు చోటుచేసుకున్నాయని అమ్నెస్టీ వివరించింది. బుల్‌డోజర్లతో విధ్వంసం జరపడం ఆటవికమని, భయానకమని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ అగేస్‌ కల్లామార్డ్‌ వ్యాఖ్యానించారు. ఈ చర్యలు న్యాయసమ్మతం కావని, చట్టవిరుద్ధమైనవని, వివక్షతో కూడినవని తెలిపారు. కూల్చివేతల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని చెప్పారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం ద్వారా అధికారులు చట్టాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. విద్వేషాలను రెచ్చగొడుతూ, వేధింపులకు పాల్పడుతూ, హింసాత్మక చర్యల ద్వారా అధికారులు ఈ దురాగతాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాలను తుంగలో తొక్కి…

              కూల్చివేతల సమయంలో దేశీయ, అంతర్జాతీయ చట్టాలను ఎక్కడా అనుసరించలేదని అమ్నెస్టీ తన విచారణలో తేల్చింది. కనీసం ముందస్తు సంప్రదింపులు జరపలేదని, బాధితులకు నోటీసులు ఇవ్వలేదని, వారికి ప్రత్యామ్నాయ పునరావాస సౌకర్యం కల్పించలేదని, చివరికి రాత్రి సమయాలలో కూడా కూల్చివేతలు కొనసాగించారని వివరించింది. తాజాగా గత నెలలో ముంబయిలోని మహ్మద్‌ అలీ రోడ్డులో మత ఘర్షణలు జరిగిన తర్వాత 40 నిర్మాణాలను కూల్చివేశారు. అయోధ్యలో జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన అనంతరం ఈ ఘర్షణలు చెలరేగాయి. బాధితులను బలవంతంగా ఖాళీ చేయించి కూల్చివేతలకు పాల్పడ్డారని, ఇలా చేయడాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, అంతర్జాతీయ ఒప్పందం (ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు) నిషేధించాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తెలిపింది. ‘కూల్చివేతల కోసం జేసీబీలనే కాదు. అనేక ఇతర యంత్రాలను కూడా ఉపయోగించారు. వీటిని తరచుగా వినియోగించడంతో పలు కంపెనీలు ఆర్థికంగా ప్రయోజనం పొందాయి’ అని పేర్కొంది. కొన్ని జేసీబీలను కొనుగోలు చేయడం కూడా జరిగింది.

➡️