జీ హుజూర్‌…!

May 20,2024 08:16 #Interview, #PM Modi
  • కీలక అంశాలపై ప్రశ్నలే లేవు
  • అబద్ధం చెప్పినా ‘ఐతే ఓకే’
  • అసత్యాలు, ప్రత్యారోపణలతో సరి
  • ఎదురు దాడితో తప్పించుకునే ప్రయత్నం
  • ఇదీ మోడీ ఇంటర్వ్యూల తీరు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 31 నుండి ఈ నెల 14 వరకూ వివిధ పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌కు 41 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో ఆయనకు ఎదురైన క్లిష్టతరమైన ప్రశ్నలు చాలా తక్కువ. న్యూస్‌ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ఓ క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో జరిగిన ర్యాలీలో ముస్లిములకు వ్యతిరేకంగా మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న అది. ‘అధిక సంతానం’ అనే మాట తాను కేవలం ముస్లిములను ఉద్దేశించి మాత్రమే చెప్పలేదని ప్రధాని బదులిచ్చారు. ‘అన్ని పేద కుటుంబాలలోనూ సంతానం ఎక్కువగానే ఉంటుంది. వారు తమ పిల్లలను విద్యావంతులను చేయలేరు. పేదరికం ఎక్కడ ఉంటుందో అధిక సంతానం అక్కడ కన్పిస్తుంది’ అని సెలవిచ్చారు. తాను హిందువులు లేక ముస్లింలు అని చెప్పలేదని బుకాయించారు. చొరబాటుదారులంటే ఎవరని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగే సాహసం చేయలేదు. మోడీ చెప్పనూ లేదు.

ఈ అంశాలపై ప్రశ్నలేవి?
పాత్రికేయులతో ముచ్చటించేటప్పుడు మోడీ ఎక్కువగా తన ‘మూడో పదవీకాలం’ గురించే కాకుండా 2047 నాటికి భారత్‌ విజన్‌పై కూడా మాట్లాడారు. పది సంవత్సరాల పాలనలో మీ ట్రాక్‌ రికార్డు ఏమిటని ఒక్క పాత్రికేయుడు కూడా ప్రశ్నించలేదు. ప్రధాని 41 ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మోడీ అసమర్ధ నిర్వాకాన్ని గురించి అడిగిన వారు లేరు. దేశంలో ముస్లిములపై జరుగుతున్న హింసను కూడా వారు ప్రస్తావించలేదు. ‘అస్సాం ట్రిబ్యూన్‌’ పత్రిక ఇంటర్వ్యూలో మాత్రం మణిపూర్‌ హింసపై ప్రశ్నించారు.

స్థానిక సమస్యల పైనా అంతే
తంతి టీవీ, ఎఎన్‌ఐ, రాజస్థాన్‌ పత్రిక, దివ్య భాస్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల బాండ్ల వివాదంపై మోడీని ప్రశ్నించారు. ఇక జెడిఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అత్యాచాల వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మోడీ 29 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రజ్వల్‌ వ్యవహారంపై కేవలం మూడు ఇంటర్వ్యూల్లో మాత్రమే (టైమ్స్‌ నౌ ఛానల్‌, హిందీ పత్రిక హిందుస్థాన్‌, ఆంగ్ల పత్రిక హిందుస్థాన్‌ టైమ్స్‌) ప్రశ్నించారు. ప్రాంతీయ మీడియా సంస్థలు తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తడంలో విఫలమయ్యాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన స్థానిక హిందీ పత్రికలు అమర్‌ ఉజాలా, హిందుస్థాన్‌ వివాదాస్పద అగ్నిపథ్‌పై ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఈ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున యువత సైన్యంలో చేరుతుంది. అసోం, బెంగాల్‌ రాష్ట్రాల్లో సిఎఎ కీలకమైన ఎన్నికల అంశంగా మారింది. గుజరాత్‌కు చెందిన ఆరు వార్తా సంస్థలు మోడీని ఇంటర్వ్యూ చేశాయి. రాష్ట్ర బిజెపిలో నెలకొన్న విభేదాలపై ఒక్కరు కూడా ఆయన్ని ప్రశ్నలు అడగలేదు.

తప్పని చెబితే ఎదురు దాడే
ఇంటర్వ్యూల్లో మోడీ తప్పుడు వాదనలు వినిపించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా పాత్రికేయులు వాటిని ఎలాంటి పరిశీలన చేయకుండా గుడ్డిగా క్యారీ చేశారు. ప్రజ్వల్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తే అలాంటి వాటిని తాను సహించబోనని చెబుతూనే కాంగ్రెస్‌ పార్టీ గతంలో ప్రజ్వల్‌ రేవణ్ణ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నదని సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేశారు. జెడిఎస్‌తో పొత్తు విషయంలో బిజెపి నేతలు చేస్తున్న హెచ్చరికలను కూడా ఎవరూ ప్రస్తావించలేదు.

అబద్ధాలు… అభాండాలు
మత ప్రాతిపదికన విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ప్రమాదకరం కాదా? అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే ఈ అంశం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఉన్నదని అబద్ధం చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బిజెపి 400కు పైగా స్థానాలు కోరుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణను టివి9 నెట్‌వర్క్‌ పాత్రికేయులు ప్రస్తావించినప్పుడు మోడీ సుదీర్ఘమైన సమాధానం ఇస్తూ రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ అనేక సందర్భాల్లో నీరుకార్చిందని ఆరోపించారు. అత్యధిక మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని నలుగురు బిజెపి నాయకులు బాహాటంగా చెప్పడాన్ని ఎవరూ గుర్తు చేయలేదు. ఎన్నికల బాండ్లపై కేవలం నాలుగు ఇంటర్వ్యూల్లో మాత్రమే మోడీని ప్రశ్నించగా, ఆయన ఆ పథకాన్ని సమర్ధించారు. ఎన్నికల బాండ్ల పథకం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు, బిజెపి మధ్య చోటుచేసుకున్న క్విడ్‌ప్రోకో సంబంధాలపై మోడీని ఎవరూ ఏమీ అడగలేదు.

అది ప్రజల నినాదమేనట
మోడీ ఇంటర్వ్యూల్లో తరచూ వినిపించిన మరో పదం ‘400 ప్లస్‌’. బిజెపి కార్యకర్తలకు ఆత్మసంతృప్తి కలిగించేందుకే మోడీ ఈ నినాదాన్ని ఎత్తుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పుకొచ్చారు. ఎన్డీయేకు ఇప్పటికే 400కు పైగా స్థానాలు ఉన్నాయని అంటూ ‘2019లో ఎన్డీయే సుమారు 359 స్థానాలు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు మా వైపే ఉన్నాయి. అంటే మరో 35 స్థానాలు కలిశాయి. ఈశాన్య ప్రాంతం ఎంపీలు కూడా మా పక్షానే ఉన్నారు’ అని వివరించారు.

దక్షిణాదిపై ఫోకస్‌
మోడీ తన ఇంటర్వ్యూల్లో దక్షిణాది మీడియా సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఏడు సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. గుజరాత్‌ తర్వాత ఆయన ఎక్కువగా దృష్టి సారించింది దక్షిణాది పైనే.

➡️