కూటమిలో కలహాలుశ్రీ పెరిగిన అసంతృప్తులు

Apr 21,2024 03:35

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపి స్థానంలో సమీకరణలు రోజురోజుకూ మారుతున్నాయి. బిజెపితో పొత్తు టిడిపి కేడర్‌లో అసంతృప్తిని నింపింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో సైకిల్‌ పార్టీ నాలుగు అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవ్వడంపై టిడిపి శ్రేణులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. 2014లో ఏడు అసెంబ్లీ స్థానాలతోపాటూ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ పరిస్థితి గడిచిన పదేళ్లలో పూర్తిగా తలకిందులైంది. రాజమండ్రి పార్లమెంటు సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించిన విషయం తెలిసిందే. ఇక్కడ్నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. వైసిపి నుంచి ప్రముఖ వైద్యులు గూడూరు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనియర్‌ నేత గిడుగు రుద్రరాజు పోటీలో ఉన్నారు.
జిల్లాలో రెండు ఎస్‌సి నియోజకవర్గాలు ఉన్నాయి. రాజమండ్రి అసెంబ్లీ స్థానంలో ముస్లిములతో పాటూ బిసిలు, మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన పదేళ్లలో దళితులపైనా, ముస్లిములు, మైనార్టీలపైనా దాడులు పెరిగాయి. కొన్ని ఘటనలు ప్రధాన వార్తా స్రవంతిలో రానప్పటికీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో దళితులు, ముస్లిముల్లో బిజెపిపై వ్యతిరేకత పెరిగింది. ఎన్నికల ముందు కేంద్రంలో బిజెపి సర్కారు సిఎఎ నోటిఫికేషన్‌ జారీ చేయడం కూడా వారిని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో బిజెపిపై ముస్లి ములతో పాటూ, ఎస్‌సి, బిసిలు కూడా బహిరంగంగానే వ్యతి రేకించారు. పార్టీల కతీతంగా మీడియా ముందుకు వచ్చి సైతం ఖం డించారు. ఇప్పుడు అదే పార్టీతో టిడిపి పొత్తుకు వెళ్లడాన్ని ఆయా తరగతులకు చెందిన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రధాన ప్రత్యర్థిగా ‘గిడుగు’
రాజమండ్రి పార్లమెంటు స్థానంలో బిజెపి అభ్యర్థి పురందేశ్వరికి ప్రత్యర్థులుగా వైసిపి నుంచి గూడూరి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నుంచి గిడుగు రుద్రరాజు ఉన్నారు. వైసిపి అభ్యర్థి ఎన్నికలకు కొత్తముఖం కావడం, వైసిపి కూడా లోపాయికారిగా బిజెపికి తొత్తుగా ఉండటంతో గూడూరు అంత పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ బిజెపి అభ్యర్థికి ప్రధాన ప్రత్యర్థిగా గిడుగు రుద్రరాజు నిలిచే అవకాశం ఉంది. రుద్రరాజు జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్‌ హయాంలో చక్రం తిప్పిన నేత. కేంద్రంలో బిజెపి సర్కారు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, మతతత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బిజెపి వస్తే జరిగే అనర్థాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇండియా వేదికలో భాగంగా ఉన్న సిపిఐ, సిపిఎం, ఆప్‌ ఇతర పార్టీలు సైతం ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. రోజురోజుకూ ప్రజల మద్దతు కూడగడుతూ ప్రధాన ప్రత్యర్థిగా బిజెపిని ఢకొీనేందుకు రుద్రరాజు సిద్ధమవు తున్నారు. గతంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్న కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్‌, అనపర్తి, గోపాలపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆయన పర్యటించారు.

అనపర్తిలో అయోమయం
అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎవరు అనేది అనుమానంగా ఉంది. మొదట టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మొదటిగా ప్రకటించిన అభ్యర్థి రామకృష్ణారెడ్డి. అనంతరం కూటమిలో బిజెపి చేరడంతో ఈ నియోజకవర్గాన్ని పట్టు లేని బిజెపికి కేటాయించారు. మాజీ సైనికుడు శివకృష్ణంరాజును బిజెపి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అసంతృప్తికి గురైన రామకృష్ణారెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటూ నియోజకవర్గం మొత్తం కలియతిరిగారు. అనంతరం పురందేశ్వరితో రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి తిరిగి ఈ సీటును నల్లమిల్లికి కేటాయిస్తారనే వార్తలు వచ్చాయి. అలాగే ఈ నెల 19న టిడిపి అభ్యర్థి తన నామినేషన్‌ను రామకృష్ణారెడ్డి భార్యతో వేయించారు. ఆయనకు టిడిపి బి-ఫామ్‌ ఇస్తుందా లేదా స్వతంత్రంగానే పోటీలో ఉంటారనే దానిపై ఇంకా ఉత్కంఠ సాగుతోంది.

సైకిల్‌ సింబల్‌ మాయం
పొత్తు నేపథ్యంలో నిడదవోలు, రాజానగరం నియోజకవర్గాలను జనసేనకు, అనపర్తి నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన నిడదవోలులో 2009, 2014లో టిడిపి నుంచి బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జనసేన పోటీ చేయటంతో అసెంబ్లీ స్థానానికి గాజు గ్లాసుకు పార్లమెంటు స్థానానికి కమలానికి వేయాలంటూ టిడిపి కార్యకర్తలు ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజానగరం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2009, 2014లో టిడిపి అభ్యర్థి పెందుర్తి వెంకటేష్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఈ సీటును జనసేనకు కేటాయించటంతో అక్కడ కూడా సైకిల్‌ సింబల్‌ కనుమరుగైంది. అనపర్తి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించడంతో ఇక్కడ కూడా సైకిల్‌ సింబల్‌ మాయమైంది.

➡️