కొంప ముంచుతున్న మద్యపానం

liquor effects on health

ఈ మధ్య కాలంలో ఆల్కహాలు తాగే వారు ఫ్యాటీ లివర్‌, లివర్‌ సిర్రోసిస్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ముఖ్యంగా మద్యపానం మితిమీరి సేవించే వారికి వారి కాలేయం అత్యంత త్వరితగతిన దెబ్బతినడం ఖాయం. దీనినే లివర్‌ సిర్రోసిస్‌ అంటారు. దీని బారిన పడిన వారిని కాపాడటం కష్టం అని, కొన్ని సార్లు కాలేయ మార్పిడి సైతం చేయాల్సి వస్తుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు సెలవిస్తుండటం ఎంతైనా ఆలోచించాల్సిన విషయం. అంతేకాదు మద్యపానానికి బానిసయిన వారికి శరీరంలో కొవ్వు శాతం పెరిగి గుండె జబ్బులకు దారితీయడం, అధిక రక్తపోటుకు గురికావడం, నాడీ మండల వ్యాధుల బారినపడటం, నరాలు కండరాలు పటుత్వాన్ని కోల్పోయి చివరకు లివర్‌, పాంక్రియాస్‌ క్యాన్సర్లకు దారితీస్తుందని ఇటీవల పలు అధ్యయనాలు, సర్వేలు తెలియజేయడాన్ని బట్టి మానవాళికి ఈ మద్యపానం మూలాన ఎంతటి నష్టం వాటిల్లుతున్నదో ఇట్టే ఊహించవచ్చు. అదేపనిగా ఓ వేళా పాళా లేకుండా మద్యం సేవించడం మూలాన అది మెదడుపై, గుండెపై తీవ్ర ప్రభావం చూపడమే కాదు, దీనివల్ల మానవాళి రోడ్డు ప్రమాదాల బారిన పడటం అధికమవ్వడం, క్రమంగా ఈ సమాజం నుంచి దూరమవ్వడం వంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మత్తు అలవాటును వదులుకోకపోతే మాత్రం మద్యపాన ప్రియుల బతుకులు అథోగతిపాలే. వారు చేజేతులారా అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడంతో పాటు తమ శరీరాన్ని అత్యంత వేగవంతంగా గుల్ల చేసుకోవడమే తప్ప మరేమీ కాదు. అడ్డు అదుపు లేకుండా మద్యాన్ని మంచి నీళ్లలాగా తాగుతూ పోతే వారి ప్రోటీన్‌ లెవెల్స్‌ తక్కువయి విపరీతమైన అలసటకు గురికావడం, వారి శరీరంతో పాటు కాళ్లలో వాపు వచ్చి, పొత్తి కడుపులో ద్రవాలు పేరుకుపోవడం, కొన్ని సార్లు రక్తంతో కూడిన వాంతి అవ్వడం, మలం కూడా నల్లటి రంగులో రావడం, వారి కళ్ళు మాత్రం ముదురు పచ్చరంగులోకి మారి చివరకు అది వారి ప్రాణ నష్టానికి సైతం దారితీసే పరిస్థితులు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే బదులు ముందుగానే మద్యానికి గుడ్‌ బై చెప్పాలి. లేకపోతే వారి ప్రమాదం. ఈ అమూల్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి. ఏది ఏమైనా మద్యపానం సేవనం మన పాలిట ఓ పెనుభూతం, శాపం అని వీలయినంత త్వరగా గ్రహించాలి. ఈ తాగుడు అనే వినాశకర అలవాటును ఆమడ దూరంలో ఉంచగలిగితే వారి ఆరోగ్యం పది కాలాల పాటు వర్థిల్లుతుంది. లేకపొతే ఆస్పత్రి బారిన పడి అటు ఆర్థికంగా, ఇటు ఆరోగ్యపరంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే వివేకంతో అలోచించి డాక్టర్ల సలహాలను పాటించి మద్యపానం అనే దురలవాటుకు స్వస్తి చెప్పాలి. అప్పుడే తమ జీవితాలను బాగుచేసుకోవటంతో పాటు, తమను నమ్ముకున్న కుటుంబ సభ్యులను సైతం రక్షించిన వారవుతారు.

 

– బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల, నంద్యాల

➡️