భూగర్భ వనరులను కొల్లగొడుతూ ప్రకృతికి ‘మెగా’ పాతర

May 1,2024 00:57 #'Megha' bribes..
  •  సొంత క్రషర్లతో కాలుష్యం
  •  బ్లాస్టింగ్‌లతో ఇళ్లకు బీటలు
  •  ప్రాణాలుపోతున్నా పట్టని వైనం
  •  బాధిత గ్రామాల ఆందోళన

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి/తొట్టంబేడు : జాతీయ రహదారి పనుల విస్తరణ పేరిట ప్రముఖ మెగా సంస్థ ప్రకృతిపై పగబట్టింది. భూగర్భ వనరులను కొల్లగొడుతోంది. ఆ సంస్థ స్వార్థానికి చెరువులు, భూములు, రహదారులు ఛిద్రమవుతున్నా, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా మొండిగా ముందుకే వెళ్తుంది. నాయుడుపేట-తిరుపతి మార్గంలో జాతీయ రహదారిని పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చన్న మానవతా దృక్పథంతో ప్రజలు తమ భూముల్లో, చెరువుల్లో మట్టిని, గ్రానైట్‌ను తవ్వుకునేందుకు అవకాశమిచ్చినందుకు వారి ప్రాణాలకే ఎసరు పెట్టింది. పరిమితికి మించి తవ్వకాలు, బ్లాస్టింగుల వల్ల పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తోంది. ప్రశ్నించే వారిపై అధికార బలంతో ఉక్కుపాదం మోపుతోంది. మెగా సంస్థ అక్రమాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. మెగా యాజమాన్యానికి స్థానిక అధికార పార్టీ నేతల అండ, పోలీసుల, ప్రభుత్వ యంత్రాంగం ఆశీస్సులు మెండుగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సొంత క్రషర్లు, క్వారీలు, తారు ప్లాంట్లతో కాలుష్యం
నాయుడుపేట- మదనపల్లి జాతీయ రహదారిని 170 కిలోమీటర్ల మేర విస్తరించే సమయంలో మెగా సంస్థకు రాయి, మట్టి, కంకర, గ్రానైట్‌, తారు తదితరాల అవసరం ఉంది. రహదారి అంచనా వ్యయం సుమారు రూ.5 వేల కోట్లులోనే వీటన్నింటినీ నమకూర్చు కోవాలి. మెగా సంస్థ రైతుల వద్ద బలవంతంగా భూములు లాక్కుని తానే స్వయంగా తారు, క్రషర్‌, క్వారీలను జాతీయ రహదారికి సమీపంలోని గ్రామాల వద్ద ఏర్పాటు చేసుకుంది.
దీంతో, సమీప ప్రజలకు, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం లింగమనాయుడుపల్లి వద్ద ఆ గ్రామానికి అనుకునే సొంత తారు, క్వారీ, క్రషర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంది. నిత్యం తవ్వకాలు, బ్లాస్టింగులులతో లింగమనాయుడుపల్లితోపాటు సమీప గ్రామాల ప్రజలు కాలుష్యం బారినపడుతున్నారు. బ్లాస్టింగ్ల కోసం కంప్రెషర్లతో కాకుండా పవర్‌ బోర్లతో రంధ్రాలు వేస్తుండడంతో ఇళ్లల్లో వైబ్రేషన్లు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. లింగమనాయుడుపల్లి, కురవకనేరి, గుమ్మడిగుంట, క్రైస్తవమిట్ట, దొమ్మరపాళెం, తాటిపర్తి, మల్లిగుంట, రౌతు సూరమాల గ్రామాల్లోని పలు దాబా ఇళ్లు బ్లాస్టింగుల వల్ల బీటలు వారాయి. గాలి, నీటి కాలుష్యం కావడంతో దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో ఆయా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. లింగమనాయుడు పల్లిలో కలుషిత నీటి వల్ల పలువురు కిడ్నీ రోగాల బారినపడ్డారు. గడిచిన ఆర్నెల్లలో లింగమనాయుడుపల్లిలో రత్నయ్య, సురేంద్ర, వెంటకనుబ్బయ్య, లోకనాథంనాయుడు కిడ్నీ ఫెయిల్యూర్‌తో మృతి చెందారు. ముకుంద అనే బాలుడు ప్రాణాలు నిలుపుకునేందుకు ఆస్పత్రిలో పోరాడుతున్నాడు.

బాధితుల నిరసన
వెంటనే పనులు ఆపాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్‌ చేస్తూ లింగమనాయుడుపల్లి, కురవకనేరి గ్రామస్తులు మంగళవారం మెగా ప్లాంట్ల వద్ద నిరసనకు దిగారు. కాలుష్యం వల్ల 30 ఏళ్లకే కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడువుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్‌ బోర్లతో డ్రిల్లింగ్‌, బాంబ్‌ బ్లాస్టింగుల వల్ల భూకంపం వచ్చినట్లు భయంతో గడుపుతున్నామని వాపోయారు. బ్లాస్టింగ్‌ కారణంగా ఇళ్లన్నీ బీటలు వారాయనీ, రేపో మాపో కూలిపోయేలా ఉన్నాయనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా యాజమాన్యం నుంచి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను అడ్డుకున్నారు. నిరసన విరమించకుంటే కేసులు పెడతామని బెదిరించి వారితో బలవంతంగా ఆందోళన విరమింపజేశారు.

➡️