‘స్టార్’ రేటింగ్తోనే కొత్త పంపుసెట్లు

Jan 20,2024 09:47 #pump sets, #Star rating

• విద్యుత్ ఆదాపై ఇంధనశాఖ నిర్ణయం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : మున్సిపాల్టీలు, అమరావతి పంచాయతీల్లో వినియోగించే తాగునీటి పంపుసెట్లను ఇకపై అత్యంత నాణ్యత కలిగిన వాటినే వినియోగించాలని ఇంధన శాఖ నిర్ణయించింది. పురాతన, చెడిపోయిన వాటిని వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. పాత వాటిని మార్పు చేసి, కొత్త పంపు సెట్లను ఏర్పాటుచేసే సమయంలో స్టార్ రేటింగ్స్ ఉన్నవాటినే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని శాఖలకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 239 పంపు సెట్లను మార్పు చేయాల్సి ఉంటుందని ఇటీవల నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎలక్ట్రికల్ ఆడిట్ నిర్వహించిన ఒక సర్వేలో గుర్తించినట్లు ఇంధనశాఖ వివరించింది. వీటిని మార్పు చేయడం వల్ల ఏటా 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదా విలువ రూ.20 కోట్లుగా ఉంటుందని వివరించింది. అలాగే కొత్త పంపుసెట్ల మార్పుకోసం అయ్యే వ్యయం 17.5 కోట్లు ఉంటుందని తన సర్క్యులర్లో వివరించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పాత పంపుసెట్లను 205 ఉపయోగిస్తున్నారని, ప్రధానంగా మున్సిపాల్టీ, పంచాయతీరాజ్శాఖలో మరింత ఎక్కువగా ఈ సమస్య ఉందని ఇంధన శాఖ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 90 వేల ప్రభుత్వ భవనాల్లో పాత తరహా పంపుసెట్లనే వినియోగిస్తున్నట్లు వివరించింది.

➡️