కడపలో రాజకీయ కాక

Apr 10,2024 04:00 #2024 elections, #ap election, #Kadapa
  •  సీట్లు నిలబెట్టుకొనేందుకు వైసిపి పావులు
  •  కూటమికి తప్పని అభ్యర్థుల మార్పులు
  •  సానుభూతి ఎజెండాతో వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి-కడప ప్రతినిధి : వైఎస్‌ఆర్‌ జిల్లా ఏడు అసెంబ్లీ, కడప పార్లమెంటు స్థానాన్ని కలిగి ఉంది. కడప వైసిపి తరపున డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా, టిడిపి తరపున ఆర్‌ మాధవి, కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం తేలలేదు. కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి ఖలీల్‌బాషా కుమారుడు సోహైల్‌, ప్రముఖ సంఘ సేవకుడు సలావుద్దీన్‌ పోటీ చేసే అవకాశం ఉంది. కడప అసెంబ్లీలో 2.72 లక్షల ఓటర్లలో 90 వేలు ముస్లిములు, 10 వేలు దూదేకుల ఓటర్లు మూడింట ఒక వంతుకుపైగా ఉన్నప్పటికీ ముస్లిమేతర టిడిపి అభ్యర్థి ఆర్‌ మాధవి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. కమలాపురంలో టిడిపి అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి, వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్‌రెడ్డి, సిపిఐ పోటీ చేసే అవకాశం ఉంది. టిడిపి తరపున బరిలో దిగుతున్న పుత్తా చైతన్యరెడ్డి స్థానంలో ఆయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి బరిలో దిగుతారనే ఊహాగానాలు ఉన్నాయి. టికెట్‌ మాత్రం పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి కేటాయించారు. ఇటీవల చోటుచేసుకున్న ఫ్యాక్షన్‌ నేపథ్యంలో టిడిపి నాయకుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ వైసిపిలో చేరడంతో చైతన్యరెడ్డికి ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. మైదుకూరులో వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, టిడిపి తరపున టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి, టిడిపి తరపున సీనియర్‌ నాయకులు నంద్యాల వరద రాజులరెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ తరపున అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎదురుగాలి ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇటీవల ఎమ్మెల్యే బంగారు దుకాణాలపై ఐటి దాడులు చేయించారనే ఆరోపణల నేపథ్యంలో వ్యాపారులందరూ టిడిపి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయినప్పటికీ హోరాహోరీ పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. జమ్మలమడుగులో వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంవి సుధీర్‌రెడ్డి, కూటమి తరపున బిజెపి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
ఓటు బదిలీపైనే కూటమి ఆశ
టిడిపి ఓట్ల బదిలీపై జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్యాక్షన్‌ నియోజకవర్గమైన జమ్మలమడుగులో వైసిపి, టిడిపి గుర్తులపైనే ఓటర్లకు అవగాహన ఉంది. ఉన్నఫళంగా టిడిపికి వృద్ధులు, వీరాభిమానుల ఓట్లు బదిలీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా కమలం గెలుపునకు తీవ్రంగా శ్రమించాల్సి రావొచ్చు. టిడిపి టికెట్‌ విషయంలో చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, బాబారు మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డితో చివరి వరకు పోటీ పడ్డారు. కూటమి బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును ప్రకటించింది. అయినప్పటికీ భూపేష్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలనే ఊగిసలాట నడుస్తోంది. పులివెందులలో వైసిపి తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టిడిపి తరపున బి.టెక్‌ రవి, కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. వేంపల్లి మండల టిడిపి నాయకులు ఎస్‌వి సతీష్‌రెడ్డి వైపిపిలో చేరారు. టిడిపి అభ్యర్థి బి.టెక్‌ రవి గెలవలేనిపక్షంలో వైఎస్‌ జగన్‌ మెజార్టీని గణనీయంగా తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో ఎంతో కొంత సఫలత ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్‌ తరపున పార్లమెంటుకు వైఎస్‌ షర్మిల, అసెంబ్లీ స్థానానికి వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశాలు ఉండటంతో సెంటిమెంట్‌ ఓటు ఏ మేరకు నమోదవుతుందో వేచి చూడాల్సి ఉంది.
బద్వేల్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధ, కూటమి తరపున బిజెపి అభ్యర్థి రోశన్న పోటీ చేయనున్నారు. బలమైన వైసిపి అభ్యర్థిని కూటమి తరపున బరిలో దిగుతున్న కొత్త అభ్యర్థి రోశన్నకు ఏ మేరకు సాధ్యమవుతుందో తెలియడం లేదు. కాంగ్రెస్‌ తరపున గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మూడు వేల ఓట్లకుపైగా సాధించిన ఎన్‌డి విజయజ్యోతి నిలబడుతున్నారు.
ఎజెండాపైకి వివేకా హత్య
వైసిపి, కూటమి అభ్యర్థులిద్దరిలో మెరుగైన వ్యక్తిత్వం కావడంతో కాంగ్రెస్‌ ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. పార్లమెంటుకు వైసిపి తరపున సిట్టింగ్‌ ఎంపి వైఎస్‌ అవినాష్‌రెడ్డి, టిడిపి తరపున చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరపున వైఎస్‌ షర్మిల పోటీ చేయనున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బద్వేల్‌ మినహా మిగిలిన కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్‌ తరపున కడప పార్లమెంటు బరిలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల పోటీ చేస్తుండటమే కారణమని తెలుస్తోంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో బలమైన అభ్యర్థులు బరిలో నిలిపితే ఓటింగ్‌ పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశం, ఇండియా ఫోరంలో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

➡️