బిల్లులు ఇంకెప్పుడు చెల్లిస్తారో!

Jan 18,2024 07:55 #Housing, #Pending Dues, #srikakulam
ntr housing scheme pending bills incomplete
  •  ఎన్‌టిఆర్‌ గృహ పథకం కింద లక్షలాది మందికి ఇళ్లు 
  • ఆరేళ్లుగా అందని బిల్లులు 
  • రెండుసార్లు తనిఖీలు చేసినా తేల్చని వైసిపి ప్రభుత్వం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : గత టిడిపి ప్రభుత్వ హయాంలో గృహాలు మంజూరైన వారు బిల్లుల కోసం నేటికీ ఎదురు చేస్తున్నారు. ఇళ్లు నిర్మించి ఆరేడు సంవత్సరాలు కావస్తున్నా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చవిచూస్తున్నారు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తనిఖీ చేసి డబ్బులు ఇస్తామని ప్రకటించినా, ఇప్పటివరకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు. రెండు ప్రభుత్వాల తీరుతో గృహ నిర్మాణ లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2017-19 కాలంలో ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద సుమారు నాలుగు లక్షల మందికి గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 1.50 లక్షల స్కీమ్‌ ఒకటి కాగా, మరొకటి రూ.రెండు లక్షల పథకం. వాటిలో ఇళ్లు మంజూరై ఒక్క రూపాయి కూడా రానివారు, కొంతమేర డబ్బులు వచ్చిన వారు ఉన్నారు. ఇళ్లు పూర్తయిన వాటికి బిల్లులు చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పడం, అప్పటికి ఇంకా ఎవరూ ఇళ్లను పూర్తి చేయలేకపోవడంతో లబ్ధిదారుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేయలేదు. లబ్ధిదారులు తమ సొంత డబ్బులతో పునాదులు, రూఫ్‌ లెవల్‌ పనుల వరకు చేపట్టారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు మధ్యలో ఆపేశారు. వారిలో కొందరికి పునాదులకు రూ.10 వేలు, 15 సిమెంట్‌ బస్తాలు ప్రభుత్వం ఇచ్చింది. వారు పునాదులు వేసి ఆర్థిక ఇబ్బందుల పనులు నిలిపివేశారు. బిల్లుల కోసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో మిన్నకున్నారు. గత ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ఆ తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు తొలుత నిరాకరించడం వంటి సమస్యలతో లబ్ధిదారులకు అవస్థలే మిగిలాయి.

తనిఖీల పేరుతో హడావుడి

టిడిపి హయాంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు చెల్లించేందుకు తొలుత వైసిపి ప్రభుత్వం నిరాకరించింది. లబ్ధిదారుల నుంచి ఒత్తిళ్లు, ప్రజాప్రతినిధుల వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు ఆ తర్వాత అంగీకరించింది. టిడిపి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను తనిఖీ చేయాలని నిర్ణయించింది. అర్హులను గుర్తించేందుకు 2022 డిసెంబర్‌లో గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సర్వే చేయించింది. వారంతా అర్హులేనని అధికారులు నిర్ధారించారు. గతేడాది జూన్‌లోనూ మరోసారి పరిశీలించారు. అందులోనూ వారు అర్హులేనని తేల్చారు. అయినా, లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కాలేదు.

ఇంటి కోసం అప్పు చేశాను

ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నాకు 2018లో ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తామని చెప్పారు. మొదటి విడతగా ఆ ఏడాది చివరిలో రూ.19,300 ఇచ్చారు. ఇంటి నిర్మాణాన్ని మధ్యలో విడిచిపెట్టలేక రూ.రెండు లక్షల అప్పు చేసి ఇంటిని పూర్తి చేశాను. బిల్లుల కోసం అధికారులను అడిగితే ఇదిగో అదిగో వస్తాయని చెప్తున్నారు.

– లీలావతి, తండ్యాంవలస (శ్రీకాకుళం జిల్లా)

వడ్డీలు కట్టలేకపోతున్నాం

ఎన్‌టిఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నా భార్య సుజాత పేరుతో 2017లో ఇల్లు మంజూరైంది. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు చెల్లిస్తామని చెప్పడంతో నిర్మాణం ప్రారంభించాను. మొదటి విడతగా రూ.81 వేలను ఖాతాలో పడింది. ఇల్లు సగంలో ఆగిపోవడంతో ఉండడానికి ఇబ్బందులు పడ్డాం. బయట వడ్డీ వ్యాపారుల వద్ద రూ.2.50 లక్షలు అప్పు తెచ్చి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాం. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే అప్పు తీరుద్దామనుకున్నాను. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో వడ్డీ భారంగా మారింది.

– పతివాడ కన్నంనాయుడు, రాపాక (శ్రీకాకుళం జిల్లా)

➡️