బ్రూనో బలిదానం వృథా కారాదు!

Feb 17,2024 06:59 #Articles, #Profiles, #scientists

సైన్స్‌ ఎప్పుడూ వాస్తవాలపై ఆధారపడి పని చేస్తుంది. మతం నమ్మకాల ఆధారంగా మనుగడ సాగిస్తుంది. మధ్య యుగం వరకు మతం ప్రపంచ వ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మతాల పేరుతో వివిధ వర్గాల వారు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. మతాధిపతులు రాజులను సైతం నియంత్రణ చేసేవారు.

15వ శతాబ్దంలో యూరప్‌లో అనేక మంది శాస్త్రవేత్తలు మత భావనలకు విభిన్నమైన ప్రతి పాదనలు సిద్ధం చేశారు. ఇందుకు తగిన రుజువులను కూడా చూపించారు. ఇందులో గెలీలియో, బ్రూనో, కోపర్నికస్‌ అగ్రగణ్యులు. ఈ క్రమంలో వీరు మతవాదుల నుంచి ఎదురు దాడిని ఎదుర్కొన్నారు. గెలీలియో జైలు శిక్ష అనుభవించగా, బ్రూనో ఏకంగా దారుణంగా హత్యకు గురయ్యాడు.

మత గ్రంథాలలో చెప్పిన విషయాలకు విరుద్ధమైన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్ధించినందుకు క్రైస్తవ మత పెద్దలు బ్రూనోను సజీవ దహనం చేశారు. ఆయన కూడా క్రైస్తవ సన్యాసే కానీ క్రైస్తవ పెద్దలు ఆమోదించిన భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మలేదు. ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతాయని, ఈ భూమి లాంటి భూములు విశ్వంలో ఇంకెన్నో ఉంటాయని చెప్పాడు. విశ్వం అనంతం అన్నాడు.

1548లో ఇటలీలో జన్మించిన బ్రూనో కోపర్నికస్‌ సిద్ధాంతానికి ఆకర్షితుడైనాడు. 1572లో బ్రూనో మత గురువుగా వున్నప్పటికీ, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దీనిపై మరింత పరిశీలనలను, పరిశోధనలను చేసి మరిన్ని అదనపు అంశాలను చేర్చి అనంత విశ్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. బ్రూనో ప్రతిపాదనలు మత విశ్వాసాలకు విరుద్ధమైనవని మత బోధకులు భావించి, బ్రూనోపై 131 అభియోగాలను మోపి 1591లో కేసును నమోదు చేశారు. 1593లో బ్రూనోను గాలి, వెలుతురు చొరబడని ఒక కారాగృహంలో బంధించి ఎన్నో హింసలకు గురిచేశారు. ఈ కారాగారంలో బ్రూనో సుమారు ఏడు సంవత్సరాలకు పైగా వున్నాడు. ప్రతి రోజూ మత గురువుల నుంచి బ్రూనోకు వర్తమానం వచ్చేది. దాని సారాంశం బ్రూనో తన ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోవడం, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ఖండించడం, తాను ప్రచారం చేసిన అంశాలు తప్పని బహిరంగంగా ఒప్పుకోవడం. అయితే ప్రతి రోజూ బ్రూనో ఈ ప్రతిపాదనలు తిరస్కరించేవాడు. చివరకు బ్రూనోను మత ద్రోహిగా, సైతానుగా, రెచ్చగొట్టే ఉపన్యాసకుడుగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి, ఒక్క రక్తం బొట్టు నష్టపోకుండా అగ్నికి ఆహుతి చెయ్యాలన్న మరణ శిక్షకు ఆదేశాలు జారీ చేశారు. 1600 ఫిబ్రవరి 17 మత పెద్దల ఆదేశాల మేరకు బ్రూనోను ఇనుప సంకెళ్ళతో బంధించి, పెడరెక్కలు విరిచికట్టి, నరకయాతన చూపించి, సజీవ దహనం చేశారు.

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజులలో కూడా మతోన్మాదులు సైన్స్‌ వాదులపై దాడులు చేస్తున్నారు. ఎవరు ఏం తినాలి, ఏ దుస్తులు వేసుకోవాలి అనే విషయాలపై కూడా ఆంక్షలు పెడుతున్నారు. మరోవైపు మూఢ నమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో బ్రూనో వంటి త్యాగధనుల స్ఫూర్తితో నేటి సైన్స్‌వాదులు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • యం. రాంప్రదీప్‌, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి, సెల్‌ : 9492712836.

 

➡️