Supreme Court : రుణపరిమితిపై కేరళ పిటిషన్‌… ఇతర రాష్ట్రాలపై ప్రభావం

న్యూఢిల్లీ :   కేంద్రం రాష్ట్రాలకు విధించిన నికర రుణ పరిమితిని సవాలు చేస్తూ కేరళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం ప్రకారం.. అధిక రుణాలు తీసుకున్నప్పుడు తర్వాతి సంవత్సరాల్లో తగ్గింపు ఉండవచ్చన్న కేంద్రం నివేదికతో తాము ఏకీభవిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం నుండి ఇప్పటికే కేరళ రాష్ట్రానికి గణనీయమైన ఉపశమనం లభించిందని, మిగిలిన సౌలభ్యం కేంద్రంతో ముడిపడి ఉందని తెలిపింది.

రాష్ట్రానికి రుణాలు తీసుకునే, నియంత్రించే అధికారాల్లో కేంద్రం జోక్యంపై కేరళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

రాజ్యాంగ ధర్మాసనం పరిగణనలోకి తీసుకునే విధంగా కోర్టు ఆరు ప్రశ్నలను రూపొందించినట్లు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ ప్రశ్నలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 145 పరిధిలోకి వస్తాయని భావించామని, దీంతో ఈ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రాలు రుణాలు తీసుకునే అంశం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 పరిధిలోకి వస్తుందని, ఈ నిబంధన ఇప్పటివరకు అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి అధికారిక వివరణకు లోబడి లేదని పేర్కొంది. ఆర్టికల్‌ 293లోని ప్రత్యేక క్లాజ్‌ (3)పై రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపింది. ఈ క్లాజ్‌ ప్రకారం.. ”రాష్ట్రాలు రుణంలో ఇంకా కొంత బాకీ ఉంటే , భారత ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్రం రుణాలను సేకరించకూడదు” అని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అయితే వివిధ ఆర్టికల్స్‌ ప్రకారం రాష్ట్రాల ఆర్థిక నియంత్రణకు రాజ్యాంగం స్వయంప్రతిపత్తిని ఇచ్చిందని, రుణ పరిమితులు లేదా రుణాల పరిధిని రాష్ట్ర చట్టాలు నిర్ణయిస్తాయని కేరళ వాదిస్తోంది. రుణ పరిమితి ఇతర రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. రాష్ట్రాలు రుణాలు తీసుకునే అధికారాలపై కేంద్రం సంకెళ్లు వేయడం ఫెడరలిజంపై దాడి అని, రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన హక్కులను విచ్ఛిన్నం చేయడమేనని వాదించింది. రుణ పరిమితులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకునే హక్కు వాటికి ఉండాలని వాదిస్తోంది. జీతాలు, పెన్షన్లు ఇతర చెల్లింపులకు రాష్ట్రాలు రుణాలపై ఆధారపడుతుంటాయి. దీంతో రుణాలపై పరిమితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గణనీయంగా దెబ్బతీస్తాయని పేర్కొంది.

రూ.13,608 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని కోర్టు పేర్కొంది. కేరళ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే రూ.13,608 కోట్లు అదనపు రుణం తీసుకునేందుకు కేంద్రం మొదట అంగీకరించింది. అయితే దీనిపై న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 131ని దృష్టిలో ఉంచుకుని బెయిలౌట్‌ షరతుగా పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల ఉపసంహరణపై కేంద్రం ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు.

ఆర్టికల్‌ 131 ప్రకారం… రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల మధ్య చట్టపరమైన సమస్యలపై సుప్రీంకోర్టు ప్రత్యేక అధికార పరిధిని కలిగి ఉంటుంది.

➡️