నట్టేట ముంచిన విత్తనం

Feb 20,2024 11:13
  • తగ్గిన పుచ్చకాయల దిగుబడి

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : గత ఏడాది సిరులు కురిపించిన పుచ్చసాగు ఈ సారి చేదు ఫలితాలనే మిగిల్చింది.. సాధారణ పంటల్లో వస్తున్న నష్టాన్ని వాణిజ్య పంటల్లోనైనా పూడ్చుకుందామన్న రైతన్న కలలు అడియాశలే అయ్యాయి.. పంట వేసి సుమారు 50 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు కాయలు రాకపోవ డంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కొన్ని చోట్ల అన్నో ఇన్నో కాయలు వచ్చినా ఆశించినంత దిగుబడి రాని పరిస్థితి. గతేడాది లాభాలే ఈ ఏడాదీ చవిచూడచ్చని గంపెడాశలతో పుచ్చసాగు లోకి దిగిన రైతన్నలను విత్తన లోపం నట్టేట ముంచింది. బోదెకు 200 నుంచి 300 కాయలుం డాల్సిన చోట పట్టుమని పది కాయలు కూడా లేకపోవడంతో రైతులు తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవు తున్నారు. శ్రీకాళహస్తి వ్యవసాయశాఖ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సుమారు 400 ఎకరాల్లో వేసిన పుచ్చ తోటలు కాయలతో కళకళలాడాల్సింది పోయి మోడును తలపిస్తుండటంతో రైతులు లబోదిబో మంటున్నారు. ప్రకృతికి తోడు రైతుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల నుంచి సరైన మద్ద తు లేకపోవడంతో పుచ్చ సాగులో ఈ సారి చేదు ఫలితాలు వచ్చాయన్న విమర్శలు వస్తున్నాయి.

కానరాని కాయలు

                  శ్రీకాళహస్తి వ్యవసాయశాఖ రెవెన్యూ డివిజన్‌ లో అధికారిక లెక్కల ప్రకారం 200 ఎకరాల్లో, అనధికారిక లెక్కల ప్రకారం 400 ఎకరాల్లో పుచ్చ పంట సాగవుతోంది. అత్యధిక శాతం రైతులు తొట్టంబేడు మండలం బోనుపల్లిలో ఉండటం గమనార్హం. ఇక్కడ సుమారు 200 మంది రైతులు 300 ఎకరాల్లో పుచ్చసాగు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా పుచ్చ విత్తనం 40 రోజులకు కాయలు వస్తుంటాయి. 65 నుంచి 70 రోజుల్లో కోత కోయాల్సి ఉంటుంది. ఒక్కో పుచ్చచెట్టు కనీసం పదికాయలైనా పడతుందని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక్కో బోదెకు 200 నుంచి 250 కాయలు వరకు వస్తాయని రైతులు చెబుతున్న మాట. అయితే ఈ ఏడాది 50 రోజులు కావస్తున్నా కొన్ని చోట్ల కాయలు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల అరకొరగా వచ్చినా బోదెకు 20 నుంచి 50 కాయలే దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా పంటల యాజమాన్యంపై సరైన జాగ్రత్తలు తీసుకున్నామనీ, సరైన సమయం లో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేశామనీ, అయినా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని రైతులు వాపోతున్నా రు. వాతావరణ ప్రభావమా? లేక విత్తన లోపమా? అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు.

నష్టాల్లో పుచ్చరైతులు

                   సాధారణంగా పుచ్చ సాగులో ఎకరాకు 20 నుంచి 25 టన్నుల దిగుబడి వస్తుంది. కాయ సైజును బట్టి ధర నిర్ణయించబడుతుంది. కాయ తాజాగా ఉండి సైజు పెద్దదిగా ఉంటే కిలో రూ.18 నుంచి రూ.22 వరకు ధర పలుకుతుంది. టన్నుకు రూ.18 నుంచి రూ.20 వేలు వరకు గిట్టుబాటు వస్తుంది. ఎకరాకు రైతుకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో కనీసం పెట్టుబడి అయినా వస్తుందా..! అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఎకరా పొలంలో పుచ్చసాగు చేసేందుకు రైతుకు రూ.లక్ష పైనే పెట్టుబడి ఖర్చు అవుతోంది. ఈ ఏడాది 50 రోజులు అయినా కాయలు రాకపోవడం, వచ్చిన చోట ఎకరాకు 5 నుంచి 10 టన్నులు మాత్రమే దిగుబడి రావడంతో పెట్టుబడి కూడా రాదనీ, ఇక అప్పులే మిగులుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు. పుచ్చవిత్తనాలు అమ్మే డీలర్లపై వ్యవసాయా ధికారులు సరైన దృష్టి పెట్టి ఉంటే, కొత్తగా పుచ్చసాగులోకి దిగిన రైతులకు సకాలంలో పంటల యాజమాన్యంపై అవగాహన కల్పించి ఉంటే ఈ పరిస్థితులు దాపురించేవి కావన్నది నిజం.

పెట్టుబడి కూడా వచ్చేలా లేదు : వెంకటముని నాయుడు, రైతు, బోనుపల్లి

               ఈ సారి పుచ్చ సాగును చూస్తే కళ్ల వెంబడి నీళ్లొస్తున్నాయి. నాలుగుకెరాల్లో పుచ్చ సాగు చేస్తే కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే అంతోఇంతో దిగుబడి వచ్చింది. మిగిలిన రెండు ఎకరాల్లో కాయలు కూడా పట్టలేదు. మా ఊర్లో అందరి రైతుల పరిస్థితీ ఇంతే. నాలుగు ఎకరాలకు రూ.నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాను. కనీసం పెట్టుబడి డబ్బులు వచ్చినా సంతోషపడతా. పుచ్చసాగు ఎందుకింత చతికిలపడిందో అధికారులు కనిపెట్టి రైతులను ఆదుకోవాలి.

దిగుబడి తగ్గినమాట వాస్తవమే : పుష్పలత, ఉద్యానవనపంటల అధికారి, శ్రీకాళహస్తి

ఈ సారి వేసిన పుచ్చసాగులో దిగుబడి తగ్గిందన్న మాట వాస్తవమే. రైతులు పంటల యాజమాన్యంపై సరైన జాగ్రత్తలే తీసుకున్నారు. సకాలంలో ఎరువులు వేశారు. పురుగుమందులు పిచికారీ చేశారు. వాతావరణ ప్రభావం, విత్తన లోపం వల్ల దిగుబడి తగ్గి ఉండొచ్చని భావిస్తు న్నాం. 50 రోజులు దాటినా కాయలు రాకపో వడంపై దృష్టి సారిస్తున్నాం. పుచ్చ నష్టాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం.

➡️